Saturday, March 14, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుశాండ్విక్‌ పరిశ్రమలో సీఐటీయూ ఘనవిజయం

శాండ్విక్‌ పరిశ్రమలో సీఐటీయూ ఘనవిజయం

- Advertisement -

హెచ్‌ఎంఎస్‌పై 131 ఓట్లతో భారీ విజయం
మరోసారి విజయకేతనం ఎగురవేసిన కార్మికుల వేగు ‘చుక్క’
కార్మిక శ్రేయస్సే సీఐటీయూ లక్ష్యం
ఈ విజయం మరింత బాధ్యతను పెంచింది : సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు, శాండ్విక్‌ యూనియన్‌ అధ్యక్షులు చుక్క రాములు


నవతెలంగాణ-పటాన్‌చెరు
కార్మిక వర్గానికి దిక్సూచిగా నిలిచిన శాండ్విక్‌ పరిశ్రమలో సీఐటీయూ మరోసారి ఘన విజయం సాధించింది. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు పారిశ్రామిక ప్రాంతంలోని శాండ్విక్‌ పరిశ్రమలో శుక్రవారం జరిగిన కార్మిక సంఘం గుర్తింపు ఎన్నికల్లో సీఐటీయూ, హెచ్‌ఎంఎస్‌పై 131 ఓట్ల భారీ విజయం సాధించి మరోసారి సగర్వంగా విజయకేతనం ఎగురవేసింది.

కార్మికుల వేగు’చుక్క’ సీఐటీయూ
ఈ ఎన్నికల్లో సీఐటీయూ తరఫున సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు, పరిశ్రమ యూనియన్‌ అధ్యక్షులు చుక్క రాములు, హెచ్‌ఎంఎస్‌ తరపున విశ్వ ప్రసాద్‌ బరిలో ఉన్నారు. పరిశ్రమలో మొత్తం 186 ఓట్లు గాను సీఐటీయూకు 157, హెచ్‌ఎంఎస్‌కు 26 ఓట్లు రాగా 2 ఓట్లు వేయలేదు. 1 ఓటు చెల్లలేదు. హెచ్‌ఎంఎస్‌పై సీఐటీయూ 131 ఓట్లతో భారీ విజయం సాధించింది. కార్మిక వర్గానికే దిక్సూచిగా నిలిచిన సీఐటీయూ భారీ విజయంతో పరిశ్రమలో కార్మికుల సంబరాలు అంబరాన్నంటాయి. పరిశ్రమ లోపలి నుంచి జాతీయ రహదారి వరకు విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కార్మికులు రంగులు పూసుకొని ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. కార్మిక వర్గాన్ని చీల్చే విధంగా ఎన్ని ప్రయత్నాలు జరిగినప్పటికీ వాటన్నింటినీ పటాపంచలు చేస్తూ సీఐటీయూ విజయకేతనం ఎగరవేసింది.

ఈ విజయం మరింత బాధ్యతను పెంచింది : చుక్క రాములు
శాండ్విక్‌ పరిశ్రమ విజయం.. కార్మికుల విజయమని, ఈ విజయం మరింత బాధ్యతను పెంచిందని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు, శాండ్విక్‌ యూనియన్‌ అధ్యక్షులు చుక్క రాములు తెలిపారు. కార్మిక వర్గాన్ని చీల్చటానికి ఎన్ని కుయుక్తులు పన్నినా కార్మిక వర్గం ఐక్యంగా నిలిచి కుట్రలను పటాపంచలు చేస్తూ మరోసారి చారిత్రాత్మక విజయాన్ని అందించారని అన్నారు. కార్మికులు ఐక్యంగా ఉంటే ఏదైనా సాధించవచ్చనేది ఈ శాండ్విక్‌ విజయమే ఒక నిదర్శనం అని తెలిపారు. ఈ విజయంలో పాలు పంచుకున్న కార్మికులందరికీ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.

సీఐటీయూ జిల్లా అధ్యక్షులు బీరం మల్లేశం మాట్లాడుతూ.. రాష్ట్రంలోనే చారిత్రాత్మక విజయమని అన్నారు. పరిశ్రమలో 41 సంవత్సరాలుగా కార్మికుల కోసం చట్టపరమైన సౌకర్యాలు సాధించుకుంటూ జిల్లాలోని మిగతా యూనియన్లకు ఆదర్శవంతంగా నిలిచిందని తెలిపారు. వివిధ పరిశ్రమల కార్మిక సంఘం నాయకులు చుక్క రాములకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పరిశ్రమ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పాండురంగారెడ్డి, జనరల్‌ సెక్రెటరీ మనోహర్‌, ఆఫీస్‌ బేరర్స్‌ సత్తిబాబు, వీర రావు, సదాశివరెడ్డి, వెంకట్రావు, కమిటీ సభ్యులు, వివిధ పరిశ్రమల యూనియన్‌ నాయకులు, కార్మికులు పాల్గొన్నారు.

‘శాండ్విక్‌’ కార్మికులకు అభినందనలు : సీఐటీయూ
శాండ్విక్‌ పరిశ్రమ యూనియన్‌ ఎన్నికల్లో సీఐటీయూకు మద్దతుగా ఓటు వేసి ఘన విజయం సాధించేందుకు సహకరించిన కార్మికులందరికీ ఆ సంఘం తెలంగాణ రాష్ట్ర కమిటీ అభినందనలు తెలిపింది. ఈ మేరకు శుక్రవారం సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్‌ ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ ఎన్నికల్లో కార్మికుల ఐక్యత, చైతన్యం స్పష్టంగా ప్రతిఫలించిందని తెలిపారు. కార్మిక హక్కుల పరిరక్షణ, వేతనాల పెంపు, పని పరిస్థితుల మెరుగుదల, సంక్షేమ హక్కుల సాధన కోసం, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్‌ కోడ్‌లను రద్దు చేయాలని సీఐటీయూ పోరాడుతున్నదని గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో కార్మికులు యూనియన్‌పై నమ్మకముంచి ఇచ్చిన విజయాన్ని బాధ్యతగా భావిస్తున్నామని తెలిపారు. కార్మికుల సమస్యలు పరిష్కరించడానికి, వారి హక్కులను కాపాడేందుకు, ఉద్యోగ భద్రతను సాధించేందుకు సీఐటీయూ ఎల్లప్పుడూ ముందుండి పోరాడుతుందని హామీనిచ్చారు.

కార్మికుల ఐక్యతను మరింత బలపరుస్తూ పరిశ్రమలో కార్మికుల హక్కులు సాధించే దిశగా కృషి కొనసాగిస్తామని తెలిపారు. శాండ్విక్‌ పరిశ్రమ స్థాపించి నేటికీ 42 సంవత్సరాలైందనీ, నాటి నుంచి నేటి వరకు జరిగిన యూనియన్‌ ఎన్నికలలో సీఐటీయూ విజయం సాధిస్తున్నదని పేర్కొన్నారు. అధ్యక్షునిగా చుక్క రాములు కొనసాగుతున్నారని తెలిపారు. యజమాన్యం, పాలకవర్గాలు, మిగతా కార్మిక సంఘాలు ఎన్ని కుట్రలు పన్నినా నికరంగా కార్మికుల కోసం పనిచేస్తూ, కార్మికుల హక్కుల కోసం కృషి చేస్తున్న సంఘాన్నే కార్మికులు విశ్వసిస్తున్నారని పేర్కొన్నారు. పోరాడే సంఘాన్ని కార్మికులు కోరుకుంటున్నారనీ, అందుకే సీఐటీయూ గెలుస్తున్నదని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -