అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా సుదీప్ దత్తా, ఎలమారం కరీం
కోశాధికారిగా ఎం.సాయిబాబు
ఆఫీస్ బేరర్లుగా చుక్కరాములు, పాలడుగు భాస్కర్
వర్కింగ్ కమిటీలోకి జె.వెంకటేశ్, ఎస్వీ రమ, జయలక్ష్మి, భూపాల్, మల్లిఖార్జున్
విశాఖపట్నం నుంచి నవతెలంగాణ ప్రతినిధి ఎస్ వెంకన్న
సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్స్ (సీఐటీయూ) అఖిల భారత అధ్యక్షులుగా సుదీప్ దత్తా, ప్రధాన కార్యదర్శిగా ఎలమారం కరీం, కోశాధికారి ఎం.సాయిబాబు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎలమారం కరీం సీఐటీయూ అఖిల భారత ప్రధాన కార్యదర్శి ఎన్నికైన తొలి మళయాళీ. సుదీప్ దత్ (40) అతి చిన్న వయస్సులో సీఐటీయూ అధ్యక్షులుగా ఎన్నికై చరిత్ర సృష్టించారు. విశాఖపట్నంలోని అనతలపట్టం ఆనందన్‌నగర్(ఏయూ కన్వెన్షన్ సెంటర్)లో జరుగుతున్న అఖిల భారత 18వ మహాసభలో 39 మందితో ఆఫీస్ బేరర్ల కమిటీని, 125 మంది సభ్యులతో వర్కింగ్ కమిటీని, 425 మందితో జనరల్ కౌన్సిల్‌ను ఎన్నుకున్నారు. ఆఫీస్ బేరర్లలో తెలంగాణకు చెందిన చుక్కరాములు ఉపాధ్యక్షులుగా, పాలడుగు భాస్కర్ కార్యదర్శిగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి ఆఫీస్ బేరర్లుగా టి.రాణి, సీహెచ్ నర్సింగరావు ఉన్నారు. తెలంగాణ నుంచి వర్కింగ్ కమిటీలో ఐదుగురికి చోటు దక్కింది. అందులో ఎస్వీ.రమ, జె.వెంకటేశ్, భూపాల్, పి.జయలక్ష్మి, జె.మల్లిఖార్జున్ ఉన్నారు. జనరల్ కౌన్సిల్‌లో తెలంగాణ నుంచి 14 మందికి చోటు దక్కగా అందులో వంగూరి రాములు, కళ్యాణం వెంకటేశ్వర్లు, ఎం.పద్మశ్రీ, వీఎస్.రావు, బీరం మల్లేష్, టి.రాజారెడ్డి, కూరపాటి రమేష్, పాలడుగు సుధాకర్, రాగుల రమేష్, రాజమల్లు, గంగమణి, కల్లూరు మల్లేష్, భాను కిరణ్, గోపాలస్వామి ఉన్నారు.
ఎలమారం కరీం ప్రస్థానం ఇలా..
ఎలమారం కరీం మలప్పురంలోని వరక్కడ్ పంచాయతీలోని ఎలమరం జన్మించారు. కోజికోడ్ మెడికల్ కాలేజీ సమీపంలోని కోవూర్‌లో నివసిస్తున్నారు. సీఐటీయూ కేరళ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగానూ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. నిష్ణాతుడైన పార్లమెంటేరియన్ గానూ అనేక కార్మిక, రైతు, ప్రజా సమస్యలను పార్లమెంటులో గొంతెత్తిన వ్యక్తిగా పేరుంది. 2006-2011 వరకు రాష్ట్ర పరిశ్రమల మంత్రిగా పనిచేశారు. రెండుసార్లు శాసనసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. ఆయన కేరళ ఎలక్ట్రిసిటీ బోర్డు వర్కర్స్ అసోసియేషన్‌తో సహా అనేక కార్మిక సంఘాలకు నాయకత్వం వహిస్తున్నారు. 71 ఏండ్ల కరీం కార్మిక ఉద్యమంలో చురుకుగా ఉన్నారు. ఆయన 51 ఏండ్లుగా సీఐటీయూలో సభ్యులుగా ఉన్నారు. కరీం 1979 వరకు మాపూర్‌లోని బిర్లా కోర్ట్ పల్స్, ఫైబర్ వర్కర్స్ ఫెడరేషన్‌కు నాయకుడిగా ఉన్నారు. కరీం 1970 వరకు మాపూర్లోని జిల్లా కోర్ట్ పర్స్ ఫైబర్. వర్కర్స్ ఫెడరేష న్ కార్యదర్శిగా పనిచేశారు. మాపూర్లో కార్మిక ఆందోళనల్లో ఆయన చాలా చురుకుగా పాల్గొన్నారు. అక్కడ సంఘం బలోపేతానికి కృషి చేశారు. సమ్మెకు సంబంధించి మాపూర్ నుండి తిరువనంతపురం వరకు పాదయాత్ర చేస్తున్న సమయంలో ఆయన అరెస్టు అయ్యారు. వారం పాటు జైలు శిక్ష అనుభవించారు.
యంగ్ లీడర్ సుదీప్ దత్తా
సుదీప్ దత్తా దేశంలోనే యువ కార్మిక నేతగా ఎదిగారు. కేవలం 40 ఏండ్ల వయస్సులోనే సీఐటీయూ అఖిల భారత ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించారు. అతిపిన్న వయస్సులో ప్రధాన కార్యదర్శి అయిన వ్యక్తి ఈయనే. పశ్చిమ బెంగాల్‌లోని డార్జిలింగ్ జిల్లా నుంచి శరవేగంగా జాతీయస్థాయి నేతగా ఎదిగారు. మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన ఆయన కలకత్తా యూనివర్శిటీలో ఎమ్మెస్సీ ఫిజిక్స్ పూర్తి చేశారు. అదే యూనివర్శిటీలో నానో ఫిజిక్స్ పరిశోధనలు చేశారు. ఆయన 2006లో ఎస్‌ఎఫ్‌ఐలో చేరారు. విద్యార్థి ఉద్యమాలకు నాయకత్వం వహించారు. 2013లో సీఐటీయూలో పూర్తి కాలం కార్యకర్తగా చేరారు. ఆయన డార్జిలింగ్‌లో ప్లాంటేషన్ కార్మికుల పోరాటానికి నాయకత్వం వహించారు. సీఐటీయూ 17వ అఖిల భారత మహాసభలో ఆఫీస్ బేరర్‌గా ఎన్నికై ఢిల్లీ కేంద్రానికి చేరుకున్నారు. ఆయన విద్యుత్, కోల్ రంగాల కార్మిక ఉద్యమానికి బాధ్యత వహించారు. విద్యుత్ ఉద్యోగల ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఇండియా ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 18వ మహాసభలో సీఐటీయూ అఖిల భారత అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
ఐక్యతే బలం సామాజిక ఉద్యమంతో విప్లవాత్మక మార్పు
సార్వత్రిక సమ్మె కేంద్ర ప్రభుత్వానికి బలమైన హెచ్చరిక : సీఐటీయూ నూతన అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సుదీప్ దత్తా, ఎలమారం కరీం
కార్మిక వర్గ ఐక్యతే సీఐటీయూ బలమని సీఐటీయూ అఖిల భారత నూతన అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సుదీప్ దత్తా, ఎలమారం కరీం అన్నారు. రైతులు, వ్యవసాయ కార్మికులు సహా కార్మిక వర్గం ఐక్యంగా ఉద్యమించటమే భవిష్యత్ లక్ష్యమని అన్నారు. సీఐటీయూ అఖిల భారత 18వ మహాసభలో నూతన అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా ఎన్నికైన అనంతరం ప్రతినిధులను ఉద్దేశించి సుదీప్ దత్తా, ఎలమారం కరీం మాట్లాడారు. ‘ఫిబ్రవరి 12న జరిగే సార్వత్రిక సమ్మె కేంద్ర ప్రభుత్వానికి బలమైన హెచ్చరిక అవుతుంది. రాష్ట్రాలకు వెళ్లిన తర్వాత నాయకత్వం సమ్మె విజయవంతానికి కార్మికులతో సమావేశాలు నిర్వహించాలి.
కార్మిక వ్యతిరేక చర్యల నుంచి వెనక్కి తగ్గకపోతే, సీఐటీయూ మరింత శక్తివంత సమ్మెలకు నాయకత్వం వహిస్తుంది’ అని హెచ్చరించారు. ‘సామాజిక ఉద్యమంతో విప్లవాత్మక మార్పు సాధ్యం కాదని శత్రువులు ఎల్లప్పుడూ మనల్ని నమ్మించడానికి ప్రయత్నిస్తారు. మన బలాన్ని, ఆయుధాలను మనం గుర్తించాలి. అదే సమయంలో, మన బలహీనతలను మనం పరిష్కరించుకోవాలి. నిరుద్యోగ యువతతో ట్రేడ్ యూనియన్ ఉద్యమానికి సంస్థాగత సంబంధం లేదు. సీఐటీయూ వారి పోరాట స్వరంగా ఉద్భవించాలి. దానిని సామాజిక మార్పు కోసం సైన్యంగా మార్చాలి. మంచి పని పరిస్థితులు ప్రాథమిక హక్కుగా ఉండాలి. శ్రామిక మహిళలను కొత్త సామాజిక-రాజకీయ తరగతిశక్తిగా ఉన్నతీకరించాలి. టెక్నాలజీలో వస్తున్న మార్పులను అర్థం చేసుకోవడంతో ప్రజలతో సంభాషించే విధానాన్ని ఆధునీకరించాలి.
వ్యవస్థాగత సంక్షోభంలో ఉన్న పెట్టుబడిదారీ విధానం మనుగడ సాగించడానికి అన్ని మార్గాలను అన్వేషిస్తోంది. వెనిజులాలోనూ, ప్రపంచవ్యాప్తంగా అదే జరుగుతోంది. లాభాల రేటు తగ్గినప్పుడు, వారు మరింత దోపిడీతో నష్టాన్ని భర్తీ చేయడానికి ప్రయత్నిస్తారు. కార్మిక కోడ్‌లను ప్రవేశపెట్టడం, మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని దెబ్బతీయడం కార్మికులు, వ్యవసాయ కార్మికుల వేతనాలను తగ్గించడం లక్ష్యంగా పెట్టుకున్నాం’ అని తెలిపారు. ‘దేశంలో సీఐటీయూని నెంబర్‌వన్ స్థానంలో నిలిపేందుకు ప్రతి ఒక్కరూ కంకణ బద్ధులు కావాలి. దేశ కార్మిక వర్గానికి సీఐటీయూ ఒక ఆశాజ్యోతిగా నిలిచేందుకు ప్రతి కార్యకర్త ప్రత్యామ్నాయ విధానంతో ప్రణాలికా బద్ధంగా పని చేయాలి. దేశంలో కార్మిక వర్గాన్ని చీల్చేందుకు మతోన్మాద శక్తులు ప్రయత్నాలను తిప్పికొట్టాలి’ అని పిలుపునిచ్చారు.
సీఐటీయూ అఖిలభారత ఆఫీస్ బేరర్లు
ఉపాధ్యక్షులు : తపన్‌సేన్, డాక్టర్ కె.హేమలత, చుక్కరాములు, టీపీ.రామకృష్ణన్, ఎ.సౌందరరాజన్, జె.మెర్సికుట్టి అమ్మ, అనదిసాహు, పి.నందకుమార్, డీ.ఎల్.కరద్, మాలతి చిట్టిబాబు, కె.చంద్రన్‌పిళ్లై, బిష్ణు మహంతి, జి.బేబి రాణి
కార్యదర్శులు : పాలడుగు భాస్కర్, ఎస్.దేవ్‌రాయ్, కాశ్మీర్‌సింగ్ ఠాకూర్, జి.సుకుమారన్, డీడీ.రామనాథన్, ఏఆర్.సింధు, ఎస్.వరలక్ష్మి, మీనాక్షి సుందరం, ఉషారాణి, మదుమిత బందోపాధ్యాయ, ఆర్.కరిమలైయన్, తపన్ శర్మ, ప్రమోద్ ప్రదాన్, కె.ఎన్.ఉమేశ్, సీహెచ్. నర్సింగరావు, దీపా కె..రాజన్, లలిత్ మోహన్ మిశ్రా, కె.ఎన్.గోపీనాథ్, జియా ఉల్ అలం, శంకర్ దత్, ఎస్.కన్నన్, జిబన్‌షా, సురేఖ.
శాశ్వత ఆహ్వానితులు : ఏకే. పద్మనాభన్, మాణిక్ డే, ఏ.వీ.నాగేశ్వరరావు
ఏఐసీసీడబ్ల్యూడబ్ల్యూ (సీఐటీయూ అనుబంధం) కన్వీనర్: ఏ.ఆర్.సింధు
తెలంగాణ నుంచి వర్కింగ్ కమిటీకి ఎన్నికైన వారు : ఎస్వీ.రమ, జె.వెంకటేశ్, భూపాల్, పి.జయలక్ష్మి, జె.మల్లిఖార్జున్
తెలంగాణ నుంచి సీఐటీయూ జనరల్ కౌన్సిల్‌కు ఎన్నికైన వారు : వంగూరి రాములు, కళ్యాణం వెంకటేశ్వర్లు, ఎం.పద్మశ్రీ, వీఎస్.రావు, బీరం మల్లేష్, టి.రాజారెడ్డి, కూరపాటి రమేష్, పాలడుగు సుధాకర్, రాగుల రమేష్, రాజమల్లు, గంగమణి, కల్లూరు మల్లేష్, భాను కిరణ్, గోపాలస్వామి



