Tuesday, July 22, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంగ్రామపంచాయతీ కార్మికుల పక్షాన పోరాడేది సీఐటీయూ

గ్రామపంచాయతీ కార్మికుల పక్షాన పోరాడేది సీఐటీయూ

- Advertisement -

– సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు బాస్కర్‌
– సంఘంలో పలువురి చేరిక
నవతెలంగాణ-వాజేడు

గ్రామపంచాయతీ కార్మికుల పక్షాన పోరాడేది సీఐటీయూ మాత్రమేనని ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్‌ అన్నారు. ములుగు జిల్లా వాజేడు మండలంలో సోమవారం గుమ్మడిదొడ్డి గ్రామంలో జరిగిన గ్రామపంచాయతీ వర్కర్స్‌ యూనియన్‌ సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్రామపంచాయతీ కార్మికులకు సమయపాలన లేకుండా ఇష్టానుసారంగా పనులు చేయించుకుంటూ ప్రభుత్వం వెట్టిచాకిరి చేయించుకుంటూ శ్రమదోపిడి చేస్తోందని అన్నారు. కార్మికుల సమస్యలపై అనేకసార్లు సమ్మెలు చేసినప్పటికీ డిమాండ్లు పరిష్కరించడంలో ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని తెలిపారు. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో 29 రోజులు సమ్మె చేస్తే కార్మికుల సమస్యల పరిష్కరించేందుకు ఏమాత్రం శ్రద్ధ చూపలేదని, సమ్మె సందర్భంగా నాడు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరిస్తామని తెలిపారని గుర్తుచేశారు. ఉద్యోగ భద్రత కల్పిస్తామని, కనీస వేతనాలు అమలు చేస్తామని, బీమా సౌకర్యం కల్పిస్తామని, పని గంటలు తగ్గిస్తామని అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి రెండేండ్లయినా పట్టించుకోవట్లేదని అన్నారు. పైగా ఆందోళన చేస్తున్న కార్మికులను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నదని తెలిపారు. మల్టీపర్పస్‌ వర్కర్స్‌ పేరుతో తీసుకొని 12 గంటలు పని చేయించుకుంటున్నారని, పని పట్ల కూడా స్పష్టత లేదని అన్నారు. ఇన్సూరెన్స్‌ సౌకర్యాలు లేక కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని, కుటుంబాల్ని ఆదుకోవాలని కార్మికులు ప్రభుత్వాన్ని అడుగు తుంటే.. మల్టీపర్పస్‌ వర్కర్స్‌పై ప్రభుత్వ బాధ్యత లేదని, వారు రోజు కూలీలని చెబుతూ చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొన్ని గ్రామ పంచాయతీల్లో కార్మికులకు చెల్లించాల్సిన వేతనాల్లోనూ కోతలు విధిస్తున్నారని అన్నారు. దీనిపై ఉన్నత స్థాయి అధికారులకు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని, కనీస వేతనాలు అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. లేకుంటే పోరాటాలు నిర్వ హిస్తామని, దానికి ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వస్తుందని హెచ్చరించారు. అనంతరం వాజేడు మండలంలోని 17 గ్రామపంచాయతీల్లో 60మంది కార్మి కులు పాలడుగు భాస్కర్‌ సమక్షంలో సీఐటీయూలో చేరారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి బల్గూరి మధు, జిల్లా కార్యదర్శి రత్నం రాజేందర్‌, నాయకులు దావుద్‌, కొప్పుల రఘుపతిరావు, మల్లారెడ్డి, కట్ల నర్సింహాచారి, నీలా దేవి, సమ్మక్క, కంబాలపల్లి కొండయ్య తదితరలు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -