నవతెలంగాణ – జన్నారం
ఈ నెల 7 నుంచి 9 వరకు మెదక్ పట్టణంలో రాష్ట్ర సిఐటియు మహాసభలు జరగనున్నాయని సీఐటీయూ జన్నారం మండల కార్యదర్శి అంబటి లక్ష్మణ్ తెలిపారు. గురువారం మండల కేంద్రంలో సీఐటీయూ రాష్ట్ర మహాసభలకు సంబంధించిన వాల్ పోస్టర్లను విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బిజెపి ప్రభుత్వం మొత్తం కార్మిక వర్గానికి ఉచ్చు బిగించిందని, దీన్ని ప్రతిఘటించాల్సిన ఆవశ్యకత కార్మిక వర్గంపై ఉన్నదని, యజమానుల, కార్పోరేట్ల గరిసెల్లోకి లాభాల వరద పారించేందుకే, లేబర్ కోడ్లను అమల్లోకి తెచ్చిందని విమర్శించారు.
కార్మిక వర్గం దశబ్దాల పాటు పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను రద్దు చేసిందని, అప్రజా స్వామికంగా నాలుగు లేబర్ కోడులను తెచ్చింది. ఇది పూర్తిగా పెట్టుబడిదారుల, కార్పొరేట్ల లాభాలను రెట్టింపు చేయడం కోసమేనని ఎద్దేవా చేశారు. దేశంలో బిజెపి ప్రభుత్వం కార్మిక వ్యతిరేక, ప్రజావ్యతిరేక విధానాలపై చర్చించుకొని, భవిష్యత్తు పోరాటాలకు పునాది వేయుటకు ఈ మహాసభలు ఉపయోగపడతాయని కార్మికులందరూ మహాసభలకు వచ్చి విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కోడిపల్లి రవి ,రాములు ఇతర కార్మికులు పాల్గొన్నారు.



