Saturday, August 9, 2025
E-PAPER
spot_img
Homeమెదక్కిర్బీలో సీఐటీయూ గెలుపు

కిర్బీలో సీఐటీయూ గెలుపు

- Advertisement -

– నాలుగోసారి జయకేతనం
– రాజకీయ ఎత్తుల్ని చిత్తు చేసిన కార్మికులు
– అంబరాన్నంటిన సంబురాలు
– బీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షులు రాంబాబుపై సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు గెలుపు
– ఎమ్మెల్యే తమ్ముడి బెదిరింపులు.. మద్యం, డబ్బు పంపిణీ
– తాయిలాలకు లోనవ్వకుండా కార్మికవర్గ చైతన్యంతో సీఐటీయూకు పట్టం
– పరిశ్రమలో కార్మికుల భారీ విజయోత్సవ ర్యాలీ
– కార్మికుల చైతన్యానికి ప్రతీక కిర్బీ విజయం: యూనియన్‌్‌ అధ్యక్షులు, సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు
నవతెలంగాణ-పటాన్‌చెరు
: రాజకీయ పార్టీల ఎత్తులు, బెదిరింపులు, డబ్బు, మద్యం వంటి తాయిలాల కుయుక్తులను చిత్తు చేసి కార్మిక వర్గం చైతన్యంతో సీఐటీయూకు పట్టం కట్టారు. ఒకటా రెండా నాలుగు రాజకీయ పార్టీలకు వంతపాడే కార్మిక సంఘాల కూటమిని చిత్తు చేసి సీఐటీయూను కార్మికులు గెలిపించుకున్నారు. స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి సోదరుని బెదిరింపుల్ని సైతం లెక్కచేయకుండా నమ్ముకున్న యూనియన్‌కే ఓటు వేసి నాలుగో సారి విజయ ఢంకా మోగించారు. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం పాశమైలారం పారిశ్రామిక వాడలోని కిర్బీ పరిశ్రమలో శుక్రవారం గుర్తింపు ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో సీఐటీయూ తరపున ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు గుర్తింపు యూనియన్‌ అధ్యక్షులుగా పోటీ చేశారు. మరో పక్క బీఆర్‌టీయూ, ఐఎన్‌టీయూసీ, బీఎంఎస్‌, టీఎన్‌టీయూసీ కూటమి తరపున బీఆర్‌టీయూ రాష్ట్ర అధ్యక్షులు రాంబాబు పోటీ చేశారు. పరిశ్రమలో 578 మంది కార్మికులు ఓటు కలిగి ఉండగా 576 ఓట్లు పోలవ్వగా మరో 2 ఓట్లు చెల్లలేదు. సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు నక్షత్రం గుర్తుకు 295 ఓట్లు వచ్చాయి. బీఆర్‌టీయూ కూటమికి 281 ఓట్లు వచ్చాయి. 14 ఓట్ల మెజార్టీలో సీఐటీయూ నాలుగో సారి విజయదుందుభి మోగించింది.
ఈ సందర్భంగా పరిశ్రమలో కార్మికులు భారీ విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. బాణాసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. పారిశ్రామిక ప్రాంతంలో సీఐటీయూ జెండా రెపరెపలాడింది. అనేక పరిశ్రమల్లో గెలుస్తూ వస్తున్న సీఐటీయూ కిర్బీ పరిశ్రమలోనూ తన పట్టును నిలపుకుంది.
స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి బలపర్చిన టీఆర్‌టీయూ అభ్యర్థికి ఓటు వేయాలని, లేని పక్షంలో రాబోయే కాలంలో మీ అంతు చూస్తామంటూ ఎమ్మెల్యే సోదరుడైన మధుసూధన్‌రెడ్డి కార్మికుల్ని బెదిరించి భయభ్రాంతులకు గురి చేశారు. సీఐటీయూ అభ్యర్థికి పది ఓట్లు వేయించగలిగిన కంపెనీ కార్మికుల ఇండ్ల మీదికి వెళ్లి దౌర్జన్యం చేశారు. రాజకీయ పార్టీల ఎన్నికల మాదిరిగా కార్మికులకు మద్యం, డబ్బు పంపిణీ చేశారు. ఓట్లేయకపోతే అంతు చూస్తామని బెదిరించారు. అయినా కూటమి ప్రయత్నాలు సాగలేదు.
కార్మికులకు అండ ఎర్రజెండా
కార్మికుల సంక్షేమమే ధ్యేయంగా ఎర్రజెండా పని చేస్తున్నదని, కిర్బీ పరిశ్రమలో నాలుగోసారి సాధించిన విజయం.. కార్మికులకే అంకితమని గుర్తింపు ఎన్నికల్లో గెలుపొందిన అధ్యక్షులు, సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు అన్నారు. కిర్బీ ఎన్నికల్లో విజయం సాధించిన సందర్భంగా నిర్వహించిన విజయోత్సవ సభలో ఆయన మాట్లాడుతూ.. సీఐటీయూ గెలుపుతో కార్మికుల జీవితాలు బాగుపడతాయన్నారు. ఏ నమ్మకంతో ఎన్నికల్లో గెలిపించారో అదే నమ్మకంతో భవిష్యత్‌లో మరిన్ని సౌకర్యాలు సాధించేందుకు ఈ గెలుపు దోహదపడుతుందన్నారు. కార్మికులకు ఇచ్చిన హామీలన్నింటినీ రాబోయే రోజుల్లో అమలయ్యేలా శక్తి వంచనలేకుండా కృషి చేస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్‌ గౌరవాధ్యక్షులు కె.రాజయ్య, సీఐటీయూ జిల్లా అధ్యక్షులు బి. మల్లేశం, పాశమైలారం పారిశ్రామిక వాడ క్లస్టర్‌ కన్వీనర్‌, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు ఏ.మాణిక్‌, నాయకులు పి.పాండురంగా రెడ్డి, కిర్బీ యూనియన్‌ ప్రధాన కార్యదర్శి వీఎస్‌ రాజు, యూనియన్‌ నాయకులు తలారి శ్రీనివాస్‌, నాగప్రసాద్‌, రాములు, లకన్‌, జైపాల్‌, సోమన్న, ప్రవీణ్‌, శంకర్‌, బిలాల్‌ కార్మికులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img