బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తల తోపులాట : మంత్రి కోమటిరెడ్డి ప్రసంగాన్ని అడ్డుకున్న బీజేపీ జిల్లా అధ్యక్షులు
నల్లగొండ పట్టణంలో వినాయకుడి విగ్రహం వద్ద ఉద్రిక్తత
నవతెలంగాణ-నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి
నల్లగొండ జిల్లా కేంద్రంలో గణేష్ నిమజ్జన శోభయాత్ర ప్రారంభ సభలో ఘర్షణ తలెత్తింది. మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ప్రసంగిస్తుండగా.. గణేష్ ఉత్సవం వద్ద రాజకీయాలెలా మాట్లాడతారంటూ బీజేపీ జిల్లా అధ్యక్షులు నాగం వర్షిత్‌రెడ్డి అడ్డుకోవడంతో ఉద్రిక్తత ఏర్పడింది. పట్టణంలో ప్రతిష్టాత్మకమైన ఒకటవ నెంబర్ వినాయక విగ్రహం వద్ద శుక్రవారం శోభాయాత్ర ప్రారంభానికి ముందు సభ నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ సభలో రోడ్లు, భవనాలు, సినిమా ఫొటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ప్రసంగంలో జిల్లాలో అభివృద్ధి పనుల గురించి ప్రస్తావించారు. దాంతో బీజేపీ జిల్లా అధ్యక్షులు నాగం వర్షిత్‌రెడ్డి, ఆ పార్టీ నాయకులు అడ్డుకున్నారు. గణేష్ ఉత్సవం దగ్గర రాజకీయ రచ్చ ఏంటని ప్రశ్నిస్తూ దూసుకెళ్లారు. దీంతో పోలీసులు నాగం వర్షిత్‌రెడ్డిని చుట్టుముట్టి ముందుకు వెళ్లకుండా అడ్డుకుని పోలీస్‌స్టేషన్‌కు తరరించారు.
తోపులాట..
మంత్రి ప్రసంగాన్ని అడ్డుకున్న బీజేపీ నేతలను పోలీసులు వారిస్తున్న క్రమంలోనే కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తలు ఒకరినొకరు తోసుకోవడంతో తీవ్ర ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. పోలీసులు ఇరుపార్టీల కార్యకర్తలను చెదరగొట్టారు. దీంతో పోలీసులకు, బీజేపీ నేతలకు మధ్య తీవ్ర వాగ్వివాదం చోటుచేసుకుంది.
మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి బైటాయింపు
గణేష్ ఉత్సవాల దగ్గర మంత్రి రాజకీయాలు ప్రస్తావించడం సరికాదని, బీజేపీ జిల్లా అధ్యక్షులు నాగం వర్షిత్‌రెడ్డిని పోలీసులు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి నిరసనగా బైటాయించారు. వర్షిత్‌రెడ్డిని విడుదల చేసే వరకు నిమజ్జనం యాత్ర ప్రారంభించేది లేదంటూ భీష్మించుకూర్చున్నారు. ఎస్పీ శరత్‌చంద్రపవార్‌తో మాట్లాడేందుకు ప్రయత్నించినా స్పందించడం లేదన్నారు. దాంతో కొద్ది సమయం తర్వాత నాగం వర్షిత్‌రెడ్డిని పోలీసులు విడుదల చేయడంతో వివాదం సద్దుమణిగింది.