Monday, December 8, 2025
E-PAPER
Homeట్రెండింగ్ న్యూస్లేబర్‌కోడ్‌లపై కొట్లాటే

లేబర్‌కోడ్‌లపై కొట్లాటే

- Advertisement -

– కార్మికుల ఆందోళనల్లో బీఆర్‌ఎస్‌ ఎక్కడీ
– రాష్ట్రంలో అమలు చేయబోమని కాంగ్రెస్‌ ప్రకటించాలి
– హక్కుల కోసం సంఘటిత పోరాటాలు
– సమరశీలంగా ఉద్యమిద్దాం కేంద్ర విధానాలను తిప్పికొడదాం : సీఐటీయూ ఉమ్మడి రాష్ట్ర పూర్వ ప్రధాన కార్యదర్శి బీవీ రాఘవులు పిలుపు
– మెదక్‌లో ఉత్సాహపూరిత వాతావరణంలో బహిరంగసభ
– సీఐటీయూ రాష్ట్ర ఐదో మహాసభ సందర్భంగా కార్మికుల కవాతు


నాలుగు లేబర్‌ కోడ్‌లకు వ్యతిరేకంగా ఇటీవల ఢిల్లీలో ఇండియా బ్లాక్‌ ఆధ్వర్యంలో ఆందోళన జరిగింది. ఈ ఆందోళనలో బీఆర్‌ఎస్‌ ఎందుకు పాల్గొనలేదు? ఇండియా బ్లాక్‌లో కీలక పాత్ర పోషిస్తున్న కాంగ్రెస్‌..తెలంగాణలో వాటిని అమలు చేయబోమని అసెంబ్లీలో తీర్మానం చేయాలి. బీఆర్‌ఎస్‌ కూడా డిమాండ్‌ చేయాలి. విద్యా, వైద్యం కార్మికులకు అందని ద్రాక్షలా మారింది. ఇప్పుడు ఈ కోడ్‌లను తీసుకురావటంతో కార్మికుల బతుకు పెనం నుంచి పొయ్యిలో పడ్డట్టు అవుతోంది. – బీవీ రాఘవులు

మెదక్‌ నుంచి ఎస్‌.వెంకన్న
కార్మికులను కట్టుబానిసలుగా చేసేందుకు కేంద్రం తెచ్చిన నాలుగు లేబర్‌ కోడ్‌లను ఉపసంహరిం చుకునేదాకా తెగించి కొట్లాడాలని సీఐటీయూ ఉమ్మడి రాష్ట్ర పూర్వ ప్రధాన కార్యదర్శి, సీపీఐ (ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు పిలుపునిచ్చారు. కార్మికవర్గం తన హక్కుల కోసం మరిన్ని ఉధృతపోరాటాలు నిర్వహించాల్సిన తరుణం ఆసన్నమైందని ఆయన సూచించారు.
సంఘటిత, సమరశీల పోరాటాలతో కేంద్రం మెడలు వంచాలని, తద్వారా దాని విధానాలను ప్రతిఘటించాలని దిశా నిర్దేశం చేశారు. సీఐటీయూ తెలంగాణ ఐదో రాష్ట్ర మహాసభ సందర్భంగా తొలిరోజైన ఆదివారం మెదక్‌ పట్టణంలో కార్మికులు భారీ ర్యాలీ నిర్వహించారు. స్థానిక వ్యవసాయ మార్కెట్‌ నుంచి చిల్డ్రన్స్‌ పార్కు వరకు నిర్వహించిన ఈ ప్రదర్శన ఆద్యంతం కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలపై నినాదాలతో మార్మోగింది. ర్యాలీ అగ్రభాగంలో రాఘవులుతోపాటు సీఐటీయూ అఖిల భారత అధ్యక్షులు డాక్టర్‌ కె హేమలత, జాతీయ కోశాధికారి ఎం సాయిబాబు, రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చుక్క రాములు, పాలడుగు భాస్కర్‌, ఉపాధ్యక్షులు ఎస్‌ వీరయ్య, ఎస్వీ రమ, జె వెంకటేశ్‌, జె మల్లిఖార్జున్‌ తదితరులు ఉండి.. ప్రదర్శనను ముందుకు నడిపించారు.
అనంతరం సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు అధ్యక్షతన జరిగిన సభలో బీవీ రాఘవులు మాట్లాడుతూ… నాలుగు లేబర్‌కోడ్‌లను తీసుకొచ్చిన మోడీ సర్కార్‌ వాటిని కచ్చితంగా అమలు చేయాల్సిందేనంటూ రాష్ట్రాలపై ఒత్తిడి తెస్తోందని చెప్పారు. వాటిని తీసుకురావటంలో మతలబేంటని ప్రశ్నించారు. కోడ్‌ లను తక్షణం అమలు చేయాలంటూ కేంద్రం ఎందుకు పట్టుబడుతోందనే విషయంపై కార్మికులు ఆలోచించాలని సూచించారు. దేశంలో ఉన్న కోట్లాదిమంది కార్మికులు తమ చట్టాలను సవరించాలని ఎప్పుడైనా అడిగారా? లేబర్‌కోడ్‌లను తీసుకొస్తే తమకు ప్రయోజనం చేకూరుతుందని వారు మోడీకి మొరపెట్టుకు న్నారా? అలాంటిది ఏమీలేదు కదా? అయినా ఇంత హడావుడిగా, ఆదరాబాదరాగా ఎందుకు ఈ కోడ్‌లను ప్రభుత్వం తీసుకొచ్చిందనే దానిపై దృష్టి సారిం చాలన్నారు.


తమ లాభాలకు ఆటంకంగా ఉన్న కార్మిక చట్టాలను సవరించాలంటూ పెట్టు బడిదారులు మోడీపై ఒత్తిడి తెచ్చారు… దానికి అంగీకరించారు కాబట్టే ఆయన్ను వారు అధికారంలోకి తీసుకొచ్చారని రాఘవులు చెప్పారు. కార్మికులను అణచడంలో సమర్థత కలిగిన నాయకుడు మోడీ అని కార్పొరేట్లు భావించారు కాబట్టే..వేల కోట్ల రూపాయల ఫండ్‌ ఇచ్చి బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చారని విశదీకరించారు. అందువల్ల కార్పొరేట్లకు ఇచ్చిన మాట ప్రకారం ఆ చట్టాలను సవరించి పెట్టుబడిదా రులకు ప్రయోజనం చేకూర్చేందుకు బీజేపీ సర్కారు తహతహలాడుతోందని చెప్పారు. ఈ ప్రక్రియ కాస్త ఆలస్యం అయినందుకు పెట్టుబడిదారులు మోడీపై కన్నెర్ర చేస్తున్నారని తెలిపారు. ఇంత అసమర్థంగా ఉంటే ఎలా అని వారు ప్రధానిపై అసంతృప్తి వ్యక్తం చేయటంతో కనీస ప్రజాస్వామిక పద్దతులను కూడా పాటించకుండా మోడీ వాటిని తీసుకొచ్చారని వివరించారు. కార్మికులకు హక్కులు లేకుండా చేస్తేనే సంపద కొల్లగొట్టొచ్చని కార్పొరేట్లు భావిస్తున్నారు.. కాబట్టే ఈ లేబర్‌ కోడ్‌లను తీసుకొచ్చారని తెలిపారు. 2014 నుంచి రకరకాల ప్రయత్నాలు చేసి 2019లో వాటిని తీసుకొచ్చారని వివరించారు.


కార్మికుల ప్రయోజనాల కోసమే ఈ చట్టాలను సరళతరం చేశామని ప్రభుత్వం ప్రచారం చేసుకుంటు న్నదని, ఇందులో ఎంత అవాస్తవముందో అర్థం చేసుకోవాలని రాఘవులు సూచించారు. దేశంలో కార్మికుల వేతనాలు, ఆదాయాలు ఏ మేరకు పెరుగు తున్నాయి? అదే సమయంలో కార్పొరేట్ల ఆదాయాలు, లాభాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలించాలని అన్నారు. ప్రభుత్వ విధానాల వల్ల కార్మికుల నిజ వేతనాలు పడిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. మరో పక్క ప్రతీయేటా దేశంలో కొత్తగా 70 మంది శతసహస్ర కోటీశ్వరలవుతున్నారని గుర్తు చేశారు. ఈ కాలంలో 350 మంది శతసహస్ర కోటీశ్వరులకు రూ.50 లక్షల కోట్ల ఆస్తులు పెరిగాయని చెప్పారు. దేశ బడ్జెట్‌ కంటే వీరి ఆస్తులు, లాభాలే ఎక్కువగా ఉన్నా యని తెలిపారు. అంబానీ, ఆదానీల ఆస్తులు లక్షల కోట్లకు ఎలా పెరిగాయని ప్రశ్నించారు. దీన్నిబట్టి మోడీ ప్రభుత్వం ఎవరి కోసం ఉందో అర్థం చేసుకోవాలన్నారు. కార్పొరేట్లకు లాభాలు దోచిపెడుతున్న కేంద్రం…ఇప్పుడు లేబర్‌ కోడ్‌లను కార్మికుల ప్రయోజనాల కోసమే తెచ్చామంటే ఎలా నమ్మాలని ప్రశ్నించారు. అందుకే కార్మికులు పోరాడకపోతే ఉన్న హక్కులు కూడా పోతాయని హెచ్చ రించారు. వారు సమ్మె చేయకూడదనేది యాజమానుల కోరికని, అందుకే ఆ హక్కును లేకుండా చేసి పెట్టుబడిదారులను సంతోషపెట్టే ప్రక్రియకు మోడీ సిద్ధ మయ్యారని చెప్పారు. ఇండిగో విమాన సర్వీసుల విషయమే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణని తెలిపారు. ప్రభుత్వ రంగ సర్వీసులను కార్పొరేట్లకు కట్టబెట్టేందుకు ఆయన తహతహలాడుతున్నారని విమర్శించారు. పెట్టుబడిదారులకు, భూస్వాములకు ప్రధాని ఊడిగం చేస్తున్నారని దుయ్యబట్టారు. ఎనిమిది గంటల పని విధానం కోసం ఆనాడు పోరాడి సాధించుకున్న హక్కులకు ఈ రోజు మోడీ ప్రభుత్వం సమాధి కడుతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు.
సభలో సీఐటీయూ రాష్ట్ర ఆఫీసు బేరర్లు, మెదక్‌ జిల్లా సీఐటీయూ అధ్యక్ష, కార్యదర్శులు బాలమణి, మల్లేశం, ఆహ్వాన సంఘం ఉపాధ్యక్షులు అడివయ్య, తదితరులు పాల్గొన్నారు.

కార్మికుల మెడపై కత్తి సీఐటీయూ అఖిలభారత అధ్యక్షులు డాక్టర్‌ కె.హేమలత
డాక్టర్‌ కె హేమలత మాట్లాడుతూ కేంద్రంలోని మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్‌ కోడ్‌లు కార్మికుల మెడపై కత్తిలాంటివని చెప్పారు. పాత చట్టాల్లో కార్మికుల రక్షణ కోసం ఉన్న కొద్దిపాటి అంశాలను కూడా తొలగించటమంటే.. కార్పొరేట్ల లాభాల పట్ల ఈ ప్రభుత్వానికి ఎలాంటి ప్రేమ ఉందో అర్థమవుతున్నదని చెప్పారు. సుదీర్ఘ పోరాటాల వల్ల సాధించుకున్న ఆ చట్టాలను ధ్వంసం చేయడం మోడీకి తగునా? అని ప్రశ్నించారు. కార్మికుల ‘చట్టం’ అనే పేరు లేకుండా కోడ్‌లుగా మార్చారన్నారు. ఇన్‌స్పెక్టర్‌ బదులుగా ఫెసిలిటే టర్‌ అని రూపాంతరం చేశారని పేర్కొన్నారు. తనిఖీలు ఉండొద్దనే ఉద్దేశంతోనే కార్పొరేట్ల కోర్కెను మోడీ ఈ విధంగా తీర్చారని చెప్పారు. కార్మిక చట్టాల్లోని జీతం, డీఏ, బోనస్‌, పీఎఫ్‌, ఈఎస్‌ఐ, తదితర ఏ ఒక్క అంశం అమలు జరగకపోయినా అధికారులు తనిఖీచేయాలని అన్నారు. ఇది ఇప్పటి వరకూ చట్టాలు చేసే మార్గదర్శనమని చెప్పారు. కానీ ఇక ముందు యూనియన్లు ఫిర్యాదు చేసినా, కార్మికులు ఫిర్యాదు చేసినా ఎలాంటి తనిఖీలు ఉండబోవని ఆందోళన వ్యక్తం చేశారు. ఇక నుంచి ఫిక్స్‌డ్‌టర్మ్‌ ఎంప్లాయిమెంట్‌ పేరుతో ఎన్ని సంవత్సరాలైనా పర్మినెంట్‌ చేయకుండా పని చేయించుకునే విధానం అమల్లోకి వస్తుందని తెలిపారు. ఏ పేరు పెట్టినా కార్మికులను జీవితాంతం పర్మినెంట్‌ చేయకుండా పని చేయించుకోవడమే లేబర్‌కోడ్‌ల సారాంశమని వివరించారు. కొత్తగా తీసుకొచ్చిన లేబర్‌ కోడ్‌లలో స్కీమ్‌ వర్కర్లు, డొమెస్టిక్‌ వర్కర్లు, హౌమ్‌ బేస్డ్‌ వర్కర్లు, వ్యవసాయాధారిత కూలీల గురించి ప్రస్తావించలేదని చెప్పారు. రాబోయే కాలంలో మరింత ఉధృత పోరాటాలకు సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు.

ప్రమాద ఘంటికలు : సీఐటీయూ అఖిలభారత కోశాధికారి సాయిబాబు
ఎం సాయిబాబు మాట్లాడుతూ నాలుగు లేబర్‌ కోడ్‌లు కార్మికుల పాలిట ప్రమాద ఘంటికలని చెప్పారు. 29 చట్టాలను సరళీకరించామనీ, సింపుల్‌ఫై చేశామని చెబుతుంటే కార్మికులు నమ్మేందుకు సిద్దంగా లేరని అన్నారు. కార్మిక కోడ్‌లలో ఉన్న నీతి..నేతి బీరలో నేయిలాంటిదేనని ఎద్దేవా చేశారు. వ్యాపార సులభతరం అని చెబుతూనే..కార్మికుల ప్రయోజనకోసమేనని చెప్పటం పొంతన లేని ప్రచారమని విమర్శించారు. ధర్మాల గురించి చెబుతున్నారు కదా..ఏమీ అడక్కుండా పని చేయటమే ధర్మమా? హక్కులు, చట్టాలు ఎవరయ్య జాగీరూ కాదని చెప్పారు. స్వాతంత్రోద్యమ కాలంలోనే కార్మిక హక్కులను సాధించుకున్నామని గుర్తు చేశారు. పార్లమెంటులో మందబలం ఉండటంతో కరోనా సమయంలో, మూతులకు మాస్కులు పెట్టుకున్న కాలంలో ఈ లేబర్‌ కోడ్‌లను తెరమీదకు తీసుకొచ్చారని తెలిపారు. కేంద్రం వాటిని కార్మికుల నిరసనలకు భయపడి ఇంతకాలం ఆపిందనీ, బీహార్‌ ఎన్నికల తర్వాత అప్రజాస్వామికంగా వీటిని నోటిఫై చేసిందని చెప్పారు.ఈ దేశ సంపదను సృష్టిస్తున్న కోట్లాది మంది కార్మికులు, రైతులు, ఎలా బతకాలో ఈ ప్రభుత్వం ఆలోచిస్తున్నదా? అని ప్రశ్నించారు. నెలకు వెయ్యి రూపాయలతో మధ్యాహ్న భోజన కార్మికులు ఎలా బతుకుతారని ప్రశ్నించారు. గ్రామ పంచాయతీ కార్మికులకు ఇచ్చే చాలీచాలని వేతనంతో ఆ కుటుంబాలు ఎలా జీవిస్తాయని ప్రశ్నించారు. ఎమ్మెల్యేలు, మంత్రులు తీసుకునే వేతనాలెంత? కార్మికులకు ఇచ్చే వేతనాలు ఎంత? అని నిలదీశారు. తెలంగాణలో ఇక్కడి ప్రభుత్వం గ్లోబల్‌ సమ్మిట్‌ నిర్వహించేందుకు సన్నాహాలు చేసిందనీ, దీనికి అనేక మందిని పిలుస్తున్నారని చెప్పారు. ఈ సమ్మిట్‌ విజయానికి కారణమైన కార్మికుల బతుకుల గురించి రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం ఎందుకు ఆలోచించటం లేదని ప్రశ్నించారు. ఈ సమ్మిట్‌కు కార్మిక సంఘాల ప్రతినిధులను ఎందుకు పిలవటం లేదని ప్రశ్నించారు. కేంద్ర బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్నామని చెబుతున్న రేవంత్‌ రెడ్డి ప్రభుత్వానికి ఈ లేబర్‌కోడ్‌లను రాష్ట్రంలో అమలు చయబోమని చెప్పే ధైర్యం ఉందా? అని ప్రశ్నించారు. గతంలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కూడా కార్మికుల హక్కులను అణిచి వేసిందనీ, కాంగ్రెస్‌ కూడా అదే విధంగా వ్యవహరిస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చ రించారు. ఈ రెండు పార్టీలు బీజేపీ బాటలో నడుస్తాయా? కార్మికుల పక్షం ఉంటాయా? తేల్చుకోవాలన్నారు. మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించటంతోనే ఆగకుండా..కార్మికుల సమస్యలతో పాటు ఆర్టీసీ బకాయిలను విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. అదనపు బస్సులను ఎందుకు పెంచటంలేదని ప్రశ్నించారు. సింగరేణిలో బకాయిలు పేరుకుపోతున్నాయనీ, విద్యుత్‌ బిల్లుకు వ్యతిరేకంగా బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ వైఖరి ప్రకటించాలన్నారు.



నేడు సీఐటీయూ ప్రతినిధుల సభకు తపన్‌సేన్‌
సీఐటీయూ రాష్ట్ర మహాసభలో సోమవారం ప్రతినిధుల సభ ప్రారంభం కానుంది. సభలో సీఐటీయూ జాతీయ ప్రధాన కార్యదర్శి తపన్‌సేన్‌ ప్రారంభో పన్యాసం చేయనున్నారు. అంతకుముందు సీఐటీయూ జెండావిష్కరణ కార్య క్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా అమరవీరులకు ప్రతినిధులు శ్రద్ధాంజలి ఘటించనున్నారు. అనంతరం మహాసభ ప్రారంభమవుతుంది. తొలుత ఆహ్వాన సంఘం అధ్యక్షులు అధ్యక్షోపన్యాసం చేయనున్నారు.

స్కీం వర్కర్ల పరిస్థితి అధ్వాన్నం శ్రామిక మహిళా కన్వీనర్‌ ఎస్వీ రమ
ఎస్వీ రమ మాట్లాడుతూ రాష్ట్రంలో స్కీం వర్కర్ల పరిస్థితి అధ్వాన్నంగా ఉందన్నారు. వేతనాలు నిర్ణయించటంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని విమర్శించారు. బీడీ కార్మికుల బతుకులు మరింత దుర్భరంగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వారిలో అనేక మంది అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.

సుద్దులు చెబుతున్న కేంద్రం సీఐటీయూ రాష్ట్ర ఉపాద్యక్షులు ఎస్‌.వీరయ్య
సీఐటీయూ రాష్ట్ర ఉపాద్యక్షులు ఎస్‌ వీరయ్య మాట్లాడుతూ శ్రమశక్తినీతి విధానాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించి కార్మికులకు ధర్మ సుద్దులు చెబుతున్నదని విమర్శించారు. దేశభక్తి అంటే పెట్టుబడిదారుల భక్తి తప్ప మరొకటి కాదన్నారు. భారతీయ కార్మికులు పవిత్రమైన ధర్మంగా తలవంచుకుని పనిచేయాలని మోడీ సూచిస్తున్నారని గుర్తు చేశారు. అంటే ఏ కార్మికుడైనా తమ హక్కుల గురించి, బతికే హక్కు గురించి, కుటుంబం బతకటానికి అవసరమైన వేతనం గురించి అడిగితే.. అది ధర్మాన్ని తప్పటంగా ఈ ప్రభుత్వం ప్రచారం చేస్త్నుదని గుర్తు చేశారు. సోషలిజంలో అందరికీ తిండీ, బట్ట తదితర మౌలిక సౌకర్యాలు ఉంటాయి.. అందుకు భిన్నంగా మోడీ సర్కార్‌ మాత్రం కార్పొరేట్లకు లాభాలు చేకూర్చే విధానాలను అమలు చేస్తోందని విమర్శించారు. ప్రధాని మోడీ మాత్రం విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నారని వివరించారు. తెలంగాణలో లక్షల మందికి ఇండ్లులేవని అధికార లెక్కలు చెబుతున్నాయని తెలిపారు. మోడీ కూడా అదే చెబుతున్నాడు కదా? ఇండ్లు లేని పేదలకు ఎందుకు ఇండ్లు కట్టించటం లేదని ప్రశ్నించారు.

వ్యతిరేకించాలి సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్‌
సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్‌ మాట్లాడుతూ…రాష్ట్ర ప్రభుత్వం ఈ లేబర్‌కోడ్‌లను అమలు చేయబో మంటూ కేంద్రాన్ని వ్యతిరేకించాలి, ధిక్కరించాలని సూచించారు. గ్లోబల్‌ సమ్మిట్‌లో కార్మికుల పాత్రను రేవంత్‌ ప్రభుత్వం విస్మరించటం ఆయన వర్గ స్వభావానికి నిదర్శమని విమర్శించారు.

కార్మికవర్గానికి ఉరితాళ్లు సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు చుక్క రాములు
సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు చుక్క రాములు మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం మొత్తం కార్మిక వర్గానికి ఉచ్చు బిగుస్తున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. యాజమానుల, కార్పొరేట్ల గరిసెల్లోకి లాభాల వరద పారించేందుకు నేడు లేబర్‌ కోడ్‌లను అమలు చేస్తున్నదని చెప్పారు. కార్మిక హక్కులను తుంగలో తొక్కుతున్న పాలకుల విధానాలపై పోరాటాలకు సన్నద్దం కావాలని పిలుపునిచ్చారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -