– పాఠశాల డైరెక్టర్‌కు, పరీక్షల నియంత్రణాధికారికి ఎస్‌ఎఫ్‌ఐ వినతి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ప్రభుత్వం విడుదల చేసిన పదోతరగతి వార్షిక పరీక్షల షెడ్యూల్ అశాస్త్రీయంగా, అసంబద్ధంగా ఉందని ఎస్‌ఎఫ్‌ఐ విమర్శించింది. 7 పేపర్ల కోసం పరీక్షలను 35 రోజుల పాటు నిర్వహిస్తే విద్యార్థులపై మానసిక ఒత్తిడి పెరుగుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. తక్షణమే పరీక్షల షెడ్యూల్‌ను సవరించి పరీక్షల మధ్య ఒకట్రెండు రోజుల వ్యవధి ఉండేలా నిర్వహించాలని కోరింది. ఈ మేరకు ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో బుధవారం పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ డాక్టర్ నవీన్ నికోలస్, పరీక్షల నియంత్రణ అధికారి పి.వి.శ్రీహరికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి టి.నాగరాజు మాట్లాడుతూ 35 రోజుల పరీక్షల షెడ్యూల్ విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులకు భారంగా మారుతుందని తెలిపారు. ఏప్రిల్ 23 పాఠశాలలు చివరి వర్కింగ్ డే అనీ, ఏప్రిల్ 16 వరకు పదవ తరగతి పరీక్షలు నిర్వహిస్తే, 6 నుంచి 9వ తరగతి వార్షిక పరీక్షా ఫలితాల వెల్లడిలో ఆలస్యమవుతుందని చెప్పారు. ప్రయివేటు విద్యాసంస్థల, కార్పోరేట్ విద్యాసంస్థల లాగా కాకుండా మారుమూల ప్రాంతాల్లో పరీక్షలు నిర్వహణ, స్టోరేజ్ కూడా కష్టంగా మారుతుందని అని చెప్పారు. ఏప్రిల్ వరకు పరీక్షల నిర్వహణ కొనసాగితే, వాల్యుయేషన్, ఫలితాల వెల్లడి ఆలస్యమవుతుందని వివరించారు. వినతిపత్రం అందజేసిన వారిలో ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు డి.కిరణ్, కె.అశోక్ రెడ్డి, హైదరాబాద్ జిల్లా నాయకులు స్టాలిన్ తదితరులు పాల్గొన్నారు.
10వ తరగతి పరీక్షల షెడ్యూల్ సవరించాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



