Wednesday, July 2, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయందుకాణం మూసేసి వెళ్లిపో : ట్రంప్‌

దుకాణం మూసేసి వెళ్లిపో : ట్రంప్‌

- Advertisement -

– అన్నింటికీ సిద్ధమే : మస్క్‌
– వారు రుణ బానిసత్వానికి మద్దతు ఇస్తున్నారంటూ విమర్శ
– బిల్లు ఆమోదం పొందితే పార్టీ పెడతానని ప్రస్తావనొమళ్లీ మొదలైన మాటల యుద్ధం
వాషింగ్టన్‌ :
ప్రతిపాదిత ప్రభుత్వ వ్యయ బిల్లుపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌, బిలియనీర్‌ ఎలాన్‌ మస్క్‌ మధ్య మరోసారి మాటల యుద్ధం మొదలైంది. ‘ఇదో పెద్ద అత్యద్భుత బిల్లు’ అని ట్రంప్‌ చెప్పుకుంటుంటే దానిపై మస్క్‌ పలు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. బిల్లుపై సెనెట్‌లో చర్చ జరుగుతున్న సమయంలో మస్క్‌ తన విమర్శలకు మరింత పదును పెట్టారు. ఈ బిల్లుకు సెనెట్‌ ఆమోదం లభించిన వెంటనే తాను కొత్తగా ఓ పార్టీని ఏర్పాటు చేస్తానని ప్రకటించారు. బిల్లుకు మద్దతు ఇవ్వవద్దని సెనెట్‌ సభ్యులను హెచ్చరించారు.


‘ప్రభుత్వ వ్యయాన్ని తగ్గిస్తామని కాంగ్రెస్‌లోని ప్రతి సభ్యుడు హామీ ఇచ్చారు. కానీ చేసిందేమిటి? చరిత్రలో అతి పెద్ద రుణ పెరుగుదలకు అనుకూలంగా ఓటు వేసినందుకు వారు సిగ్గుతో తల దించుకోవాలి. నేను ఈ భూమిపై చేయబోయే చివరి పని ఏమిటంటే వారిని ప్రైమరీ ఎన్నికలలో ఓడించడం’ అంటూ మస్క్‌ ధ్వజమెత్తారు. రిపబ్లికన్లు ‘రుణ బానిసత్వానికి’ మద్దతు ఇస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ వ్యయాన్ని తగ్గిస్తామని ప్రచారం చేసి ఇప్పుడు బిల్లుకు మద్దతు ఇస్తున్న వారిని తన ప్రతిపాదిత రాజకీయ పార్టీ లక్ష్యంగా చేసుకుంటుందని హెచ్చరించారు. ‘ఈ ఉన్మాద వ్యయ బిల్లు ఆమోదం పొందిన మరునాడే అమెరికా పార్టీ ఏర్పడుతుంది. డెమొక్రాట్‌, రిపబ్లికన్‌ పార్టీలకు ప్రత్యామ్నాయం అవసరం. దాని ద్వారా ప్రజలు తమ గళం విప్పుతారు’ అని అన్నారు. కొత్త పార్టీకి అనుకూలంగా ఓ సర్వేలో 80 శాతం మంది ఓటేశారని తెలిపారు.మస్క్‌ వ్యాఖ్యలను ట్రంప్‌ తీవ్రంగా ఖండించారు. మస్క్‌ తన కంపెనీలకు అనేక బిలియన్‌ డాలర్ల ప్రభుత్వ సబ్సిడీ అందుకున్నారని, ఇకపై అదేమీ లేకుండా ఆయన దక్షిణాఫ్రికాకు తిరిగి వెళ్లాల్సి ఉంటుందని చెప్పారు.

‘చరిత్రలో ఏ మానవుడూ పొందని సబ్సిడీలను ఎలాన్‌ పొంది ఉండవచ్చు. బహుశా ఆయన ఇక్కడ దుకాణం మూసేసి దక్షిణాఫ్రికాకు వెళ్లాల్సి రావచ్చు’ అని ఎద్దేవా చేశారు. మస్క్‌ యాజమాన్యంలోని టెస్లా, స్పేస్‌ఎక్స్‌కు ప్రభుత్వ మద్దతును తగ్గించాలని సూచించారు. ‘ఇక రాకెట్‌ ప్రయోగాలు, ఉపగ్రహాలు లేదా ఎలక్ట్రిక్‌ కార్ల ఉత్పత్తి ఉండబోదు. మన దేశం అదృష్టాన్ని ఆదా చేస్తుంది.’ అని అన్నారు. దీనిపై మస్క్‌ మరోసారి స్పందిస్తూ తాను ఇప్పుడు అన్నింటినీ తగ్గించుకుంటానని, దేనికైనా సిద్ధమేనని బదులిచ్చారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -