నవతెలంగాణ – హైదరాబాద్: జమ్మూ కాశ్మీర్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలోనే గురువారం రోజున కిష్త్వార్ జిల్లాలో క్లౌడ్ బరస్ట్ చోటు చేసుకుంది. ఛాషోటీ ప్రాంతంలో సంభవించిన ఈ క్లౌడ్ బరస్ట్ కారణంగా.. ఒక్కసారిగా మెరుపు వరదలు రావడంతో జరిగిన విషాదంలో ఇప్పటి వరకు ఇద్దరు CISF జవాన్లు సహా కనీసం 33 మంది మరణించారు. 120 మందికి పైగా గాయపడ్డారు. 220 మందికి పైగా ప్రజలు గల్లంతయినట్లు తెలుస్తోంది.అయితే మృతుల సంఖ్య మరింత ఎక్కువగానే ఉంటుందని అధికార వర్గాల ద్వారా తెలుస్తోంది.

ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, భద్రతా దళాలు, పోలీసులు అంతా కలిసి.. క్లౌడ్ బరస్ట్ అయిన ప్రాంతంలో నిర్వహిస్తున్న సహాయక చర్యలో పాల్గొన్నారు. మచైల్ మాతా యాత్ర ప్రారంభమయ్యే ఛషోటి ప్రాంతంలో ఈ క్లౌడ్ బరస్ట్ చోటు చేసుకుంది. మాతా చండీ ఆలయానికి వెళ్లే చివరి గ్రామం అదే కావడం గమనార్హం. మాతా చండీ ఆలయానికి వెళ్లేందుకు యాత్రికులు నదిని దాటుతుండగా.. ఈ ప్రమాదం సంభవించింది.