నవతెలంగాణ-హైదరాబాద్: యమునా నది పరిశుభ్రతపై బీజేపీ, ఆప్‌ల మధ్య మాటల యుద్ధం నడుస్తున్న విషయం తెలిసిందే. తమ ప్రభుత్వ హయాంలో యమునా నదిలో నీటి కాలుష్యం తగ్గిందని చెప్పుకుంటున్నారు. తాజాగా క్లౌడ్ సీడింగ్‌పై రెండు పార్టీల మధ్య వివాదం రాజుకుంది.
దీపావళి సందర్బంగా దేశరాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం పెరిగిన విషయం తెలిసిందే. అయితే కృత్రిమ వర్షం కురిపించి ఢిల్లీలోని వాయు కాలుష్యాన్ని తగ్గించాలని రేఖా గుప్తా ప్రభుత్వం నిర్ణయించింది. బురారి, ఉత్తర కరోల్‌బాగ్ మరియు బద్లీతో సహా కొన్ని ప్రాంతాల్లో ఐఐటి కాన్పూర్ సహకారంతో ఢిల్లీ ప్రభుత్వం మంగళవారం క్లౌడ్ సీడింగ్ ట్రయల్స్ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ ప్రక్రియ తర్వాత ఢిల్లీలో ఎక్కడ కూడా వర్షం పడలేదు. క్లౌడ్ సీడింగ్ వ్యాయామంపై ఆప్ బీజేపీ ప్రభుత్వాన్ని నిలదీసింది. కృత్రిమ వర్షం కురుస్తుందని వాదించినప్పటికీ.. వర్షపాతం నమోదు కాలేదని, ఢిల్లీలో ఇటువంటి ప్రయోగాల సాధ్యాసాధ్యాలపై సందేహాలు లేవనెత్తుతున్నాయని పేర్కొంది.
ఢిల్లీలోని వివిధ ప్రాంతాల్లో గత కొన్ని రోజులుగా క్లౌడ్ సీడింగ్ జరుగుతోందని, కానీ ఎక్కడా వర్షం కురవడం లేదని ఆప్ ఢిల్లీ చీఫ్ సౌరభ్ భరద్వాజ్ బుధవారం మీడియా సమావేశంలో పేర్కొన్నారు. వాతావరణ, రసాయన కారకాల కారణంగా ఢిల్లీ వాతావరణానికి క్లౌడ్ సీడింగ్ తగినది కాదని మూడు కేంద్ర ప్రభుత్వ సంస్థలు గతంలో పార్లమెంటులో వెల్లడించాయని ఉద్ఘాటించారు. ఢిల్లీలో క్లౌడ్ సీడింగ్ చేయలేమని ఈ సంస్థలు ఇప్పటికే ప్రకటించినప్పటికీ.. ఇప్పుడు ఇటువంటి వ్యాయామం చేపట్టాల్సిన అవసరం ఏమిటని ఆయన ప్రశ్నించారు. ‘ప్రచార ఆధారిత కార్యాచరణ’ పేరుతో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.



