నవతెలంగాణ – హైదరాబాద్: ఏపీ మంత్రి నారా లోకేశ్ తనయుడు నారా దేవాన్ష్ లండన్ వేదికగా అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. చెస్ క్రీడలో అత్యద్భుతమైన ప్రతిభ కనబరిచి ‘వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ 2025’ పురస్కారాన్ని అందుకున్నాడు. లండన్‌లోని చారిత్రక వెస్ట్‌మిన్‌స్టర్ హాల్‌లో ఈ అవార్డు ప్రదానోత్సవం జరిగింది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తన హర్షాన్ని వ్యక్తం చేస్తూ మనవడు దేవాన్ష్‌ను అభినందించారు.
చెస్ గేమ్‌లో అత్యంత వేగంగా చెక్‌మేట్ పజిల్స్‌ను ఛేదించిన వ్యక్తిగా దేవాన్ష్ ఈ ప్రపంచ రికార్డును నెలకొల్పాడు. మొత్తం 175 పజిల్స్‌ను వేగంగా పూర్తి చేసి ఈ ఘనత సాధించాడు. దీనిపై స్పందించిన సీఎం చంద్రబాబు, “మా దేవాన్ష్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అవార్డు 2025 అందుకోవడం గర్వంగా ఉంది” అని తెలిపారు.
నెలల తరబడి చూపిన పట్టుదల, గురువుల మార్గదర్శకత్వం వల్లే ఈ విజయం సాధ్యమైందని చంద్రబాబు పేర్కొన్నారు. దేవాన్ష్ సాధించిన ఈ రికార్డు ఎంతో స్ఫూర్తిదాయకమని కొనియాడారు. ఈ సందర్భంగా ఆయన దేవాన్ష్‌ను ‘శభాష్ ఛాంప్’ అంటూ ప్రశంసించారు. అంతర్జాతీయ వేదికపై దేవాన్ష్ ప్రతిభకు గుర్తింపు లభించడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.