నవతెలంగాణ-హైదారాబాద్: జమ్మూకాశ్మీర్‌లోని కిష్త్వార్‌లో కురిసిన భారీ వర్షాల వల్ల గురువారం 60 మంది మృతి చెందారు. ఈ వర్షాల దెబ్బకు నేలమట్టమైన భవనాలు, నిర్మాణాల శిథిలాల కింద వందలాది మంది చిక్కుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శనివారం జమ్మూకాశ్మీర్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా కిష్త్వార్ జిల్లాలోని చసోటి గ్రామంలో క్లౌడ్ బరస్ట్ కారణంగా గురైన వరద బాధితులను ఆయన పరామర్శించారు. మృతుల కుటుంబాలకు రెండు లక్షల రూపాయలు ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. అలాగే శిథిలాల కింద చిక్కుకున్న వారిని కాపాడుతున్న సహాయక బృందాల ఆపరేషన్స్ పై కూడా ఆయన సమీక్షించారు. సహాయక కార్యక్రమాలకు సంబంధించి ఆర్మీ సిబ్బంది నుంచి సమాచారాన్ని ఆయన అడిగి తెలుసుకున్నారు. ఆయన వర్చువల్‌గా.. వరద వల్ల జరిగిన నష్టాన్ని పరిశీలించారు. వరద బాధిత కుటుంబాలకు తక్షణమే సహాయక చర్యలు తీసుకుంటామని ఆయన ప్రకటించారు. కాగా సహాయక చర్యల్లో.. ఆర్మీ, ఎన్‌డిఆర్‌ఎఫ్, ఎస్‌డిఆర్‌ఎఫ్, స్థానిక పోలీసులు, జిల్లా యంత్రాంగం పాల్గొన్నారు.
