నవతెలంగాణ హైదరాబాద్: సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం ఒక వినూత్న విద్యా కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. రంగారెడ్డి జిల్లాలోని మంచిరేవుల గ్రేహౌండ్స్ క్యాంపస్‌లో ‘యంగ్ ఇండియా పోలీస్ స్కూల్’ను ప్రారంభించబోతోంది. పని ఒత్తిడి కారణంగా విద్యపై దృష్టి పెట్టలేకపోతున్న పోలీసులు, యూనిఫాం సిబ్బంది పిల్లల విద్యాబుద్దుల అవసరాలను తీర్చడానికి ఈ సరికొత్త పాఠశాల నిర్మాణానికి సీఎం పూనుకున్నారు.
ఈ స్కూల్ లో 50 శాతం అడ్మిషన్లు యూనిఫాం సిబ్బందికి రిజర్వ్ చేస్తారు. మిగిలిన 50 శాతం సీట్లు ప్రజలకు అందుబాటులో ఉంటాయి. ఎఎస్ఐ ర్యాంకు, హోమ్ గార్డులు, ఎస్ఐ నుండి అదనపు ఎస్పీ ర్యాంక్, ఐపీఎస్ వరకూ ఓపెన్ కేటగిరీలో వివిధ వర్గాలకు ఫీజులు సరసంగా భిన్నంగా ఉంటాయి.
ఈ పాఠశాలకు సంబంధించిన బ్రోచర్‌ను సీఎం విడుదల చేసి, పాఠశాలలో అడ్మిషన్ల ప్రారంభాన్ని ప్రకటించే వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. ఈ స్కూల్ కలను సాకారం చేయడానికి అధికారుల బృందం గత రెండు నెలలుగా పగలనక, రాత్రనకా పని చేసి కార్యరూపాన్ని తెచ్చాయి. పాఠశాల నిర్మాణానికి సంబంధించిన అన్ని ప్రభుత్వ అనుమతులు, లీజు డీడ్‌లు, ఎంఓయులు, ప్రిన్సిపాల్, జనరల్ మేనేజర్, ఇంకా ఉపాధ్యాయుల నియామకం, ప్రాథమిక మౌలిక సదుపాయాల పనులు దాదాపు కొలిక్కి వచ్చాయి. ఈ పాఠశాలను ముఖ్యమంత్రి మార్చి 31, 2025న ప్రారంభిస్తారు.