గవర్నర్‌ను కలిసి ఆహ్వానించిన భట్టి, శ్రీధర్‌బాబు
సమ్మిట్ ఘన విజయం సాధించాలని ఆకాంక్షించిన మమతా బెనర్జీ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా డిసెంబర్ 8, 9 తేదీల్లో భారత్ ఫ్యూచర్ సిటీలో నిర్వహిస్తున్న ”గ్లోబల్ సమ్మిట్” కార్యక్రమానికి విచ్చేయాలని పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు రాష్ట్ర మంత్రులు ప్రత్యేకంగా కలిసి ఆహ్వానించారు. ఒడిశా సీఎం మోహన్‌చరణ్ మాజ్హీ ని మంత్రి వాకిటి శ్రీహరి, హర్యానా సీఎం నాయబ్‌సింగ్ సైనీ, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్‌ను మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్‌ను మంత్రి తుమ్మల కలిసి ఆహ్వాన పత్రం అందించారు. తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్‌బాబు, సీఎస్ రామకృష్ణారావులు కలిసి సమ్మిట్‌కు రావాలని ఆహ్వానించారు.
కాగా పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ స్థానిక పర్యటనల్లో బిజీగా ఉండటంతో స్వయంగా కలవడం కుదరదనీ, ఈమెయిల్ ద్వారా ఆహ్వానం పంపాలని కోరడంతో మంత్రి సీతక్క కార్యాలయం నుంచి ఆమెకు ఆహ్వానం పంపారు. ”తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్” కార్యక్రమానికి తనను ఆహ్వానించినందుకు గాను సీఎం రేవంత్ రెడ్డికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు. సమ్మిట్ నిర్వహిస్తున్న తేదీల్లో తనకు ముందుగానే నిర్ణయించిన జిల్లా పర్యటనలు ఉండటం వల్ల కార్యక్రమానికి హాజరుకాలేకపోతున్నట్టు తెలిపారు.
గ్లోబల్ సమ్మిట్‌కు పలు రాష్ట్రాల సీఎంలకు ఆహ్వానం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



