నవతెలంగాణ – హైదరాబాద్: సోమవారం ప్రజాభవన్‌లో జరిగిన కార్యక్రమంలో ‘బాల భరోసా’ పథకం, ‘ప్రణామ్’ డే కేర్ సెంటర్లను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా దివ్యాంగులకు సహాయ ఉపకరణాలను ఉచితంగా పంపిణీ చేశారు. దాదాపు రూ. 50 కోట్లతో దివ్యాంగులకు పరికరాలను అందించామని రేవంత్ తెలిపారు. ప్రభుత్వం మీ కోసం ఉందని చెప్పడానికే ఈ కార్యక్రమం నిర్వహించినట్లు వెల్లడించారు.
మా ప్రభుత్వంలో ట్రాన్స్‌జెండర్లకు కూడా ప్రభుత్వ ఉద్యోగాలు, ఇందిరమ్మ ఇళ్లు ఇస్తున్నామని అన్నారు. తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసే ప్రభుత్వ ఉద్యోగుల జీతాల్లో 10 నుంచి 15 శాతం కోత విధిస్తామని వెల్లడించారు. ఈ బడ్జెట్ సమావేశాల్లో బిల్లు తీసుకొస్తున్నామని, తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసేవారిని మనమే దారిలోకి తీసుకురావాలన్నారు. తల్లిదండ్రులపై బాధ్యత లేనివారికి సమాజంపై ఏం బాధ్యత ఉంటుందని సీఎం రేవంత్ అన్నారు.
ఒక్క రోజు కూడా సెలవు తీసుకోలేదు
తాను ఇప్పటివరకు ఒక్క రోజు కూడా సెలవు తీసుకోలేదని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. తీసుకుందామని అనుకున్నా.. ఏదో ఒక పని వచ్చి పడుతోందన్నారు. సచివాలయంలో తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ సెంట్రల్ అసోసియేషన్ 2026 డైరీ ఆవిష్కరణలో కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వంలో ఉన్న 200 మంది మాత్రమే రాష్ట్రాన్ని నడపలేరని, 10.50లక్షల ప్రభుత్వ ఉద్యోగులే రాష్ట్రాన్ని నడిపిస్తున్నారని అన్నారు. ‘‘ఉద్యోగులే ప్రభుత్వ సారథులు, వారధులు. వారి సమస్యల పరిష్కారానికి ప్రథమ ప్రాధాన్యం. ఉద్యోగుల్లో కూడా నేను అంటే నచ్చని వారు చాలా మంది ఉండొచ్చు. నేను వచ్చాక ఉద్యోగుల జీతాలు ఎలా వస్తున్నాయో మీరే గమనించాలి. ఉద్యోగుల డీఏ దస్త్రాలపై సంతకం చేసి ఇక్కడికి వచ్చాను. ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి రూ.కోటి బీమా ఇవ్వాలని నిర్ణయించాం. ప్రభుత్వ ఉద్యోగుల బకాయిలు రూ.12వేల కోట్లు మేర పెండింగ్‌లో ఉన్నాయి. పన్ను వసూళ్లలో అవకతవకలు అరికడితే రావాల్సిన నిధులు వస్తాయి. పన్నులు పెంచాల్సిన అవసరం లేదు. సరిగా వసూళ్లు చేస్తే చాలు’’అని అన్నారు.



