చాకచక్యంగా పట్టుకున్న స్నేక్ క్యాచర్ జగదీష్..
నవతెలంగాణ – వేములవాడ
దక్షిణ కాశిగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి దేవాలయ పరిసరాల్లో మరోసారి పాము దర్శనమిచ్చి భక్తుల్లో భయం పుట్టించింది. పార్వతిపురం వసతి గృహంలో బుధవారం ఉదయం సుమారు ఆరున్నర అడుగుల అడుగుల ఎత్తు గల నాగుపాము కనిపించడంతో అధికారులు వెంటనే స్నేక్ క్యాచర్ జగదీష్ కు సమాచారం అందించారు. దీంతో ఆయన చాకచక్యంగా స్పందించి పామును గోనెసంచిలో బంధించి, ఊరు బయట నిర్మానుష ప్రాంతాల్లో సురక్షితంగా వదిలిపెట్టాడు.
గతంలో కూడా దేవాలయ ప్రాంగణం, వసతి గదులు, సెకండ్ బైపాస్ ప్రాంతాల్లో కొండచిలువలు, నాగుపాములు సంచరించిన అనేక సందర్భాల్లో ఇదే వ్యక్తి పాములను సురక్షితంగా పట్టుకున్న విషయం తెలిసిందే. అయితే గత కొన్ని ఏళ్లుగా దేవస్థానంలో స్నేక్ క్యాచర్ పోస్టు ఖాళీగా ఉండటం వల్ల అత్యవసర సమయంలో నిపుణుడు అందుబాటులో లేకపోవడం భక్తులను ఆందోళనకు గురిచేస్తోంది. ఆలయానికి వచ్చే రాజన్న–భీమన్న భక్తుల రక్షణ కోసం తక్షణమే స్నేక్ క్యాచర్‌ను నియమించాలని పలువురు భక్తులు దేవస్థాన అధికారులను కోరుతున్నారు. దేవాలయ ప్రాంతం చెరువును ఆనుకుని ఉండటంతో ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతున్నాయని, శాశ్వత సిబ్బంది లేకపోవడం సమస్యగా మారిందని భక్తులు అభిప్రాయపడుతున్నారు.



