బీజేపీ నిర్వాకం
న్యూఢిల్లీ : స్వచ్ఛ భారత్, బేటీ బచావో బేటీ పఢావో, కిసాన్ సేవ వంటి ప్రభుత్వ పథకాల పేరు చెప్పి బీజేపీ కొన్నేండ్ల క్రితం ప్రజల నుంచి విరాళాలు సేకరించింది. బీజేపీకి చెందిన నమో యాప్, నరేంద్రమోడీ. ఇన్ పోర్టల్ ప్రభుత్వ పథకాలకు విరాళాలు అందజేయడానికి తమ పేజీలలో ఇప్పటికీ ఆప్షన్లను చూపిస్తూనే ఉన్నాయి. చెన్నైకి చెందిన సీనియర్ పాత్రికేయుడు, సత్యం టీవీ ఛానల్ న్యూస్ ఎడిటర్ అయిన బీఆర్ అరవిందక్షణ్ సమాచార హక్కు చట్టం కింద అడిగిన ప్రశ్నలకు వివిధ మంత్రిత్వ శాఖలు ఇచ్చిన సమాధానం ప్రకారం…కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల కోసం విరాళాలు సేకరించడానికి కేంద్ర మంత్రిత్వ శాఖల నుంచి కానీ, ప్రధానమంత్రి కార్యాలయం నుంచి కానీ బీజేపీ ఎలాంటి ప్రత్యేక అనుమతి తీసుకోలేదు. అలా విరాళాలు సేకరించడానికి ఆ పార్టీకి ఎవరూ అధికారాన్ని ఇవ్వలేదు.
నేటికీ కన్పిస్తున్న విరాళాల ఆప్షన్లు
విరాళాల సేకరణ కార్యక్రమం 2022 ఫిబ్రవరిలో ముగిసినప్పటికీ ఆ రెండు వేదికల పేజీలలో నేటికీ ఆప్షన్లు కన్పిస్తూనే ఉండడం గమనార్హం. సత్యం టీవీ న్యూస్ ఎడిటర్ అరవిందక్షణ్ కూడా రెండు పథకాలకు వంద రూపాయల చొప్పున విరాళం ఇచ్చారు. ఆయన ఈ- మెయిల్‌కు బీజేపీ కేంద్ర కార్యాలయం నుంచి ఆన్‌లైన్ రశీదులు కూడా వచ్చాయి. వెబ్‌సైటులోని చెల్లింపుల లింక్స్‌లోనూ, నమో యాప్ డొనేషన్ మాడ్యూల్‌లోనూ కేంద్ర ప్రభుత్వ పథకాల పేర్లు కన్పించడంతో వాటి కోసమే విరాళాలు సేకరిస్తున్నారని తాను భావించానని ఆయన చెప్పారు. తన పొరబాటును గ్రహించిన అనంతరం ఆయన ఆయా పథకాలకు చెందిన మంత్రిత్వ శాఖల నుంచి ఆర్‌టీఐ ద్వారా సమాచారాన్ని కోరారు. ప్రభుత్వ పథకాల పేరు చెప్పి విరాళాలు దండుకున్న బీజేపీపై కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోని పక్షంలో న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తానని అరవిందక్షణ్ చెప్పారు.
నడ్డా, మోడీ విరాళాలతో స్ఫూర్తి పొంది…
2021 డిసెంబర్ 25వ తేదీన మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి జయంతి సందర్భంగా బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా పార్టీ బలోపేతం కోసం ‘సూక్ష్మ విరాళ’ క్యాంపెయిన్‌ను ప్రకటించారు. హిందూత్వ వాది దీన్‌దయాళ్ ఉపాధ్యాయ వర్థంతి రోజైన 2022 ఫిబ్రవరి 11న ఈ కార్యక్రమం ముగుస్తుందని ఆయన చెప్పారు. పార్టీ బలోపేతానికి, దాని ప్రజా ఉద్యమానికి అవసరమైన నిధుల కోసం విరాళాలు సేకరిస్తామని నడ్డా చెప్పినప్పటికీ ప్రభుత్వ పథకాలకే తమ నుంచి విరాళాలు కోరుతున్నారేమోనని దాతలు భావించారు. ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఈ క్యాంపెయిన్‌కు తన ఎక్స్ వేదికలో మద్దతు తెలిపారు. ‘మీ విరాళం జాతి నిర్మాణం కోసం నిస్వార్థంగా సేవలు అందిస్తున్న లక్షలాది మంది పార్టీ కార్యకర్తలకు ఉత్సాహాన్ని కలిగిస్తుంది’ అని ఆయన అన్నారు. ఆ నిధి కోసం నడ్డా, మోడీ వెయ్యి రూపాయల చొప్పున విరాళం అందించి ఆ స్క్రీన్‌షాట్లను ప్రదర్శించారు. దీంతో స్ఫూర్తి పొందిన బీజేపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున విరాళాలు అందించారు.
ప్రయివేటు వేదికల ద్వారా…
2021 డిసెంబర్-2022 ఫిబ్రవరి మధ్యకాలంలో బీజేపీ నిధుల సేకరణ నిమిత్తం నరేంద్రమోడీ.ఇన్, నమో యాప్ వంటి ప్రయివేటు వేదికల ద్వారా ప్రచారాన్ని నిర్వహించింది. స్వచ్ఛ భారత్, బేటీ బచావో బేటీ పఢావో, కిసాన్ సేవ పథకాలకు విరాళాలు అందజేయాల్సిందిగా ప్రజలను కోరింది. అయితే ఇవన్నీ ప్రభుత్వ పథకాలే. బీజేపీకి విరాళాలు అందజేసే సమయంలో ప్రజలు ఈ మూడు ప్రభుత్వ పథకాలలో ఏదో ఒక దానిని ఎంచుకోవాలని, విరాళం ఎలా ఇస్తారన్న దానికి ‘పార్టీ ఫండ్’ను చూపాలని సూచించారు. కాగా ఈ పథకాల కోసం నిధులు సేకరించడానికి ఏ వేదికకు కానీ లేదా ఎవరికి కానీ ప్రత్యేక అనుమతి ఇవ్వలేదని వాటిని అమలు చేయాల్సిన మంత్రిత్వ శాఖలు ఆర్‌టీఐ సమాధానాల్లో స్పష్టం చేశాయి.



