నవతెలంగాణ – డిచ్ పల్లి
పిల్లలకు మెనూ ప్రకారం పౌష్టికాహారం అందిస్తూ, ఆటపాటల ద్వారా పూర్వ ప్రాథమిక విద్యా కార్యక్రమాలను నిర్వహించాలని, ఎరువుల వివరాలతో కూడిన స్టాక్ బోర్డులను ప్రతి చోటా తప్పనిసరిగా ప్రదర్శించాలని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి అదేశించారు. శనివారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఇందల్ వాయి మండలంలోని ఎల్లారెడ్డిపల్లిలో గల అంగన్వాడి కేంద్రాలను, సహకార సంఘం ఎరువుల గిడ్డంగిని తనిఖీ చేశారు. పాఠశాలల్లో బోధన, బోధనేతర సిబ్బంది హాజరును పేస్ రికగ్నేషన్ విధానం (ఎఫ్.ఆర్.ఎస్) ద్వారా చేపడుతున్నారా అని ఆరా తీశారు.
విద్యార్థుల ప్రవేశాలు, హాజరవుతున్న వారి సంఖ్యను అడిగి తెలుసుకున్నారు. మౌలిక సదుపాయాలను పరిశీలించి, ఇంకనూ ఏమైనా వసతులు అవసరం ఉన్నాయా అని ప్రధానోపాధ్యాయులను అడిగారు. మద్యాహ్న భోజనాన్ని తనిఖీ చేసిన కలెక్టర్, మెనూ ప్రకారం విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలని ఆదేశించారు. ఎరువుల గిడ్డంగులలో అందుబాటులో ఉన్న నిల్వలు స్టాక్ రిజిస్టర్ లోని వివరాలకు అనుగుణంగా ఉన్నాయా అని పరిశీలించారు. రైతుల అవసరాలకు సరిపడా ఎరువులు అందుబాటులో ఉండేలా చూసుకోవాలని, వెంటదివెంట ఇండెంట్ పెట్టి ఎరువుల నిల్వలను తెప్పించుకోవాలని సొసైటీల కార్యదర్శులను ఆదేశించారు.
ఎరువుల వివరాలతో కూడిన స్టాక్ బోర్డులను ప్రతి చోటా తప్పనిసరిగా ప్రదర్శించాలని, శాశ్వత ప్రాతిపదికన బోర్డులను ఏర్పాటు చేయించాలని సూచించారు. జిల్లా అవసరాలకు సరిపడా ఎరువులు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉన్నందున, ఎక్కడ కూడా ఎరువుల కోసం రైతులు ఇబ్బందులు పడకుండా ప్రణాళికాబద్ధంగా పంపిణీ జరిగేలా కృషి చేయాలని హితవు పలికారు. ఎల్లారెడ్డిపల్లిలో ఒకే ప్రాంగణంలో మూడు అంగన్వాడి కేంద్రాలు కొనసాగుతుండడాన్ని గమనించిన కలెక్టర్, ఎందుకు ఒకేచోట నిర్వహిస్తున్నారని ప్రశ్నించారు. గదులు ఒకేచోట అందుబాటులో ఉన్నందున ఒకే ప్రాంగణంలో నిర్వహిస్తున్నామని స్థానిక అధికారులు తెలిపారు. చిన్నారులను అంగన్వాడి కేంద్రాలకు పంపేందుకు ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని కలెక్టర్ సూచించారు. ఎల్లారెడ్డిపల్లిలో ఇందిరమ్మ ఇళ్ళ నిర్మాణాల ప్రగతి గురించి పంచాయతీ కార్యదర్శి సంద్యారాణిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. లబ్దిదారులు అందరూ ఇంటి నిర్మాణం చేపట్టేలా క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ జరపాలని సూచించారు. కలెక్టర్ వెంట స్థానిక అధికారులు ఉన్నారు.
ఇందల్ వాయిలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES