– పాఠశాల సందర్శన
– గురుకుల డిప్యూటీ వార్డెన్, సూపర్‌వైజర్ సస్పెన్షన్
– ప్రిన్సిపాల్, వార్డెన్, హౌస్ మాస్టర్‌కు మెమో జారీ
– సమస్యల పరిష్కారానికి అధికారులకు ఆదేశాలు
నవతెలంగాణ- అలంపూర్
గురుకుల పాఠశాలలో సమస్యలపై విద్యార్థులు కలెక్టర్‌కే చెబుతామంటూ పాదయాత్రగా బయలుదేరిన ఘటనపై జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ సీరియస్ అయ్యారు. గురువారం పాఠశాలను సందర్శించి హాస్టల్ డిప్యూటీ వార్డెన్, సూపర్‌వైజర్‌ను సస్పెండ్ చేశారు. జోగులాంబ గద్వాల జిల్లా ఉండవల్లి మండలం అలంపూర్ చౌరస్తాలోని మహాత్మా జ్యోతిబాపూలే బీసీ బాలుర గురుకుల పాఠశాల విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై బుధవారం పాదయాత్రగా కలెక్టరేట్‌కు బయలుదేరారు. మధ్యలో పోలీసులు నచ్చజెప్పి డీసీఎంలో తిరిగి హాస్టల్‌కు పంపిన విషయం విదితమే. దీంతో జిల్లా కలెక్టర్ బియం.సంతోష్ గురుకుల పాఠశాలను సందర్శించారు. ఉపాధ్యాయులు, విద్యార్థులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. సమస్యల పరిష్కారానికి తక్షణం చర్యలు తీసుకునే విధంగా అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. విద్యార్థులు ఎదుర్కొం టున్న ఏదైనా సమస్యను సంబంధిత అధికారులకు తెలియ జేయాలన్నారు. మీ భద్రత మాకు అత్యంత ప్రాధాన్యమై నదని, రోడ్డెక్కే ప్రయత్నం చేయొద్దని, ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుందని చెప్పారు. అలాంటి పరిస్థితి మళ్లీ తలెత్తొద్దని హెచ్చరించారు. పాఠశాలలో విధుల్లో నిర్లక్ష్యం వహించిన డిప్యూటీ వార్డెన్ రజిత, సూపర్‌వైజర్ నవీన్‌ను సస్పెండ్ చేసినట్టు తెలిపారు. ప్రిన్సిపాల్, వార్డెన్, హౌస్‌మాస్టర్‌పై మెమో జారీ చేశామన్నారు. విద్యార్థులపై బెదిరింపులకు పాల్పడుతున్న పాఠశాల భవన యజమానిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని పోలీసులను ఆదేశించారు. ప్రస్తుతం పాఠశాలలో నాలుగు మరుగుదొడ్లు ఉన్నాయని, నెల రోజుల్లో అందరికీ సరిపడా మరుగుదొడ్లు, బాత్రూమ్‌లు నిర్మిస్తామని చెప్పారు. విద్యార్థులకు ప్రతిరోజూ మెనూ ప్రకారం పౌష్టికాహారం తప్పనిసరిగా అందించాలన్నారు. హాస్టల్ నిర్వహణలో ఎలాంటి నిర్లక్ష్యం జరిగినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పాఠశాలలో ఆర్‌ఓ ప్లాంట్ పనిచేయనందున వెంటనే మినరల్ వాటర్ అందించాలని ఆదేశించారు. విద్యార్థుల పట్ల ఉపాధ్యాయులు నిత్యం బాధ్యతతో ఉండాలని, ఆరోగ్యం, విద్య, భద్రత విషయంలో నిఘా పెట్టాలని సూచించారు. అనంతరం ఉండవల్లి మండల పరిధిలోని కలుగొట్ల కస్తూర్బాగాంధీ బాలికల పాఠశాలను కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు.ఇటీవల ఒక విద్యార్థినికి పాము కాటు వేసిందన్న అనుమానంతో ఆస్పత్రికి తరలించగా.. బాధిత విద్యార్థినితో కలెక్టర్ మాట్లాడారు. ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. పాఠశాల పరిసరాలను శుభ్రంగా ఉంచి, పాములు, హానికర కీటకాలు లోపలకు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. పాఠశాల రిజిస్టర్లను పరిశీలించారు. ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరు శాతం పూర్తిగా ఉండాలని చెప్పారు. కలెక్టర్ వెంట జిల్లా కో ఆర్డినేటర్ అనీల, ప్రధానోపాధ్యాయులు రామకృష్ణ, కేజీవీవీ ప్రిన్సిపాల్ పరిమల, వార్డెన్ రేణుక, ఉపాధ్యాయులు ఉన్నారు.
విద్యార్థుల పాదయాత్ర ఘటనపై కలెక్టర్ సీరియస్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES