నవతెలంగాణ – నిజామాబాద్ సిటీ : నిజామాబాద్ నగరంలోని కోటగల్లి శంకర్ భవన్ పాఠశాలలో కొనసాగుతున్న భవిత కేంద్రాన్ని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి శనివారం సందర్శించారు. ప్రత్యేక అవసరాలు గల పిల్లల కోసం ఉద్దేశించిన ఈ కేంద్రంలో చేపట్టిన నిర్మాణ పనులను పరిశీలించారు. అన్ని చోట్ల నాణ్యతతో పనులు జరిగేలా పకడ్బందీ పర్యవేక్షణ చేయాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. చిన్నారులకు అన్ని సదుపాయాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. భవిత కేంద్రాల నిర్మాణాలు, మరమ్మతుల కోసం అవసరమైన పక్షంలో జిల్లా యంత్రాంగం ద్వారా కొంత మేరకు అదనపు నిధులను కూడా సమకూరుస్తామని, పనుల నాణ్యత విషయంలో రాజీ పడకూడదని అన్నారు.
అనంతరం కలెక్టర్ శంకర్ భవన్ పాఠశాలను తనిఖీ చేశారు. విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరు ముఖ గుర్తింపు విధానంలో అమలు చేస్తున్నారా లేదా అని పరిశీలించారు. నూటికి నూరు శాతం ఎఫ్.ఆర్.ఎస్ విధానంలోనే హాజరు ఉండాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ఏవైనా సాంకేతిక సమస్యలు ఉంటే, వాటిని పరిష్కరించుకుంటూ ఎఫ్.ఆర్.ఎస్ పద్ధతిలోనే అటెండెన్స్ అమలు జరిగేలా పర్యవేక్షణ చేయాలని పాఠశాల హెచ్.ఎంను ఆదేశించారు. పాఠశాల ప్రాంగణంలో విద్యార్థులచే ప్రత్యేకంగా నిర్వహిస్తున్న కిచెన్, హెర్బల్ గార్డెన్ ను కలెక్టర్ పరిశీలించి అభినందించారు. కలెక్టర్ వెంట ఇంజినీరింగ్ విభాగం అధికారులు జి.రవి, ఉదయ్ కిరణ్, ఎం.ఈ.ఓ సాయిరెడ్డి, భవిత కేంద్రాల జిల్లా ఇంచార్జి ప్రకాష్, సీ.ఎం.ఓ శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.



