Monday, September 15, 2025
E-PAPER
Homeప్రధాన వార్తలునేటినుంచి కాలేజీలకు తాళం

నేటినుంచి కాలేజీలకు తాళం

- Advertisement -

– ఇంజినీరింగ్‌, వృత్తివిద్యా, డిగ్రీ, పీజీ కళాశాలలు నిరవధిక బంద్‌
– ఫీజు బకాయిలు తక్షణమే విడుదల చేయాలి
– టోకెన్లు ఇచ్చిన రూ.1800 కోట్లు 21లోగా చెల్లించాలి
– ఈనెల 23 లేదా 24న హైదరాబాద్‌లో భారీ బహిరంగసభ
– వివిధ పరీక్షల బహిష్కరణ
– ఎఫ్‌ఏటీహెచ్‌ఐ చైర్మెన్‌ రమేష్‌బాబు
– విద్యార్థులెవరూ కాలేజీలకు రావొద్దు : రవికుమార్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

రాష్ట్రంలో ఇంజినీరింగ్‌సహా వృత్తి విద్యా కాలేజీలు, డిగ్రీ, పీజీ కాలేజీలు సోమవారం నుంచి మూతపడనున్నాయి. కాలేజీలకు తాళం వేయాలని కాలేజీ యాజమాన్యాలు నిర్ణయించాయి. నిరవధిక బంద్‌ చేయనున్నట్టు ప్రకటించాయి. వివిధ విశ్వవిద్యాలయాల పరిధిలో ఇంజినీరింగ్‌, బీ ఫార్మసీ, ఎం ఫార్మసీ, బీఈడీ పరీక్షలను బహిష్కరించాయి. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు సుమారు రూ.ఎనిమిది వేల కోట్లను వెంటనే విడుదల చేయాలంటూ ఫెడరేషన్‌ ఆఫ్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ తెలంగాణ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ (ఎఫ్‌ఏటీహెచ్‌ఐ) రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తున్నది. విద్యార్థులెవరూ కాలేజీలకు రావొద్దంటూ కోరుతున్నది. ఆదివారం హైదరాబాద్‌లో ఎఫఏటీహెచ్‌ఐ అత్యవసర జనరల్‌ బాడీ సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం మీడియాతో ఎఫ్‌ఏటీహెచ్‌ఐ చైర్మెన్‌ నిమ్మటూరి రమేష్‌బాబు మాట్లాడుతూ సోమవారం నుంచి కాలేజీలను నిరవధికంగా మూసేయాలని నిర్ణయించామని చెప్పారు. అటెండర్లు, స్వీపర్లు, ఫ్యాకల్టీ, యాజమాన్యాలు ఎవరూ రారనీ, కాలేజీలకు తాళాలు వేస్తామని ప్రకటించారు.

ఈనెల 21 నాటికి ఆర్థిక శాఖ టోకెన్లు ఇచ్చిన నిధులు రూ.1,500 కోట్ల నుంచి రూ.1,800 కోట్లు విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. ఏడాది కింద టోకెన్లు ఇచ్చిందన్నారు. వచ్చేనెల 31 నాటికి ఫీజు బకాయిల్లో సగం, మిగిలిన సగం డిసెంబర్‌ 31 నాటికి చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ప్రస్తుత విద్యాసంవత్సరం నుంచి మార్చి 31 నాటికి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను చెల్లించాలని డిమాండ్‌ చేశారు. రెండు విడతలు లేదా మూడు విడతల్లో ఫీజులను చెల్లిస్తామంటూ ఉత్తర్వులను జారీ చేయాలని కోరారు. ఇతర విషయాల్లో ప్రభుత్వానికి యాజమాన్యాలు సహకరిస్తాయని అన్నారు. పాత బకాయిలు ఈ ప్రభుత్వానికి సంబంధం లేదనడం సరైంది కాదన్నారు. కాంట్రాక్టర్లు బెదిరించి డబ్బులు తీసుకెళ్లారని గుర్తు చేశారు. సంక్షేమ పథకాలకు నిధులు కేటాయిస్తున్నారని వివరించారు. కాలేజీ యాజమాన్యాలు ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టకుండా ఇంతకాలం ఓపిక పట్టామని అన్నారు. ఈనెల 23 లేదా 24న హైదరాబాద్‌లో లక్ష మంది విద్యార్థులతో భారీ బహిరంగసభను నిర్వహిస్తామని చెప్పారు. రకరకాల కారణాలతో ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను విడుదల చేయడం లేదన్నారు.

టోకెన్ల నిధులు ఇచ్చేంత వరకు తెరిచేది లేదు : సూర్యనారాయణరెడ్డి
ప్రభుత్వం గతేడాది ఇచ్చిన టోకెన్లకు సంబంధించిన నిధులను ఇచ్చేంత వరకు కాలేజీలను తెరిచేది లేదని టీపీడీఎంఏ రాష్ట్ర అధ్యక్షులు సూర్యనారాయణరెడ్డి స్పష్టం చేశారు. ఏడాది నుంచి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను విడుదల చేయాలంటూ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా లెక్క చేయడంలేదని అన్నారు. ఇప్పుడు అన్ని విద్యాసంస్థలూ ఏకతాటిపైకి వచ్చి ఒత్తిడి పెంచుతున్నాయని చెప్పారు. ప్రభుత్వం ఫీజులు ఇవ్వకపోవడంతో గతేడాది దసరాకు అధ్యాపకులు, సిబ్బందికి జీతాలు చెల్లించలేకపోయామని వివరించారు. అద్దెలు కట్టలేదన్నారు. ఈ దసరాకైనా సిబ్బందికి జీతాలివ్వాల్సిన పరిస్థితి ఉందనీ, ఈనెల 21 వరకు టోకెన్ల నిధులను వెంటనే చెల్లించాలని డిమాండ్‌ చేశారు. సోమవారం నుంచి రాష్ట్రంలోని డిగ్రీ, పీజీ కాలేజీలను నిరవధిక బంద్‌ చేయాలని నిర్ణయించామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎఫ్‌ఏటీహెచ్‌ఐ కోశాధికారి కొడాలి కృష్ణారావు, ఆర్గనైజింగ్‌ సెక్రెటరీ కె సునీల్‌కుమార్‌, ఇతర ప్రతినిధులు అల్జాపూర్‌ శ్రీనివాస్‌, గౌతంరావు, తుమ్మ జైపాల్‌రెడ్డి, ఎస్‌ పరమేశ్వర్‌రెడ్డి, రేపాక ప్రదీప్‌రెడ్డి, గుర్రం నాగయ్య, కె రామదాస్‌, ముద్దసాని రమేష్‌రెడ్డి, పుల్లా రమేష్‌బాబు, గోపగాని వెంకట నారాయణ, శ్రీనివాస్‌ ఆచార్య తాడూరి, సరస్వతీ రమేష్‌, కోదాడ సత్యనారాయణ, టీపీడీఎంఏ ప్రధాన కార్యదర్శి యాద రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

ఎలాంటి పరీక్షలూ జరగవు కెఎస్‌ రవికుమార్‌
వివిధ విశ్వవిద్యాలయాల పరిధిలో కొన్ని కోర్సుల విద్యార్థులకు పరీక్షలున్నాయనీ, ఆ విద్యార్థులు ఇబ్బంది పడతారంటూ తమ దృష్టికి వచ్చిందని ఎఫ్‌ఏటీహెచ్‌ఐ సెక్రెటరీ జనరల్‌ కెఎస్‌ రవికుమార్‌ చెప్పారు. ఏ రకమైన పరీక్షలున్నా నిరవధిక బంద్‌ చేస్తున్నామని ప్రకటించారు. పరీక్షలు జరగబోవనీ, వీసీలకు లేఖ రాస్తామని అన్నారు. కాలేజీలే మూతపడే పరిస్థితిలో ఉన్నపుడు పరీక్షలు జరిగితే ఏంటీ, జరగకపోతే ఏంటీ?అని చెప్పారు. సకాలంలో కాలేజీల్లో పనిచేస్తున్న అధ్యాపకులు, బోధనేతర సిబ్బందికి జీతాలు ఇవ్వాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. ప్రభుత్వం ఫీజులు విడుదల చేయకపోవడంతో తాము జీతాలు చెల్లించలేని పరిస్థితి ఉందని అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -