Thursday, December 4, 2025
E-PAPER
Homeజాతీయంగ్లోబల్‌ సమ్మిట్‌కు రండి

గ్లోబల్‌ సమ్మిట్‌కు రండి

- Advertisement -

ప్రధాని మోడీకి సీఎం రేవంత్‌ రెడ్డి ఆహ్వానం
రాహుల్‌, సోనియా, పలువురు కేంద్ర మంత్రులకు కూడా…
సీఎం వెంట డిప్యూటీ సీఎం, ఎంపీలు


నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
అంతర్జాతీయ స్థాయిలో హైదరాబాద్‌ భారత్‌ ఫ్యూచర్‌ సిటీలో ఈ నెల 8, 9 తేదిల్లో నిర్వహిస్త్తున్న ‘తెలంగాణ రైజింగ్‌-2047’ గ్లోబల్‌ సమ్మిట్‌కు హాజరు కావాలని ప్రధాని మోడీని సీఎం ఎ.రేవంత్‌ రెడ్డి ప్రత్యేకంగా ఆహ్వానించారు. అలాగే కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ చైర్‌ పర్సన్‌ (సీపీపీ) సోనియా గాంధీ, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ, పలువురు కేంద్ర మంత్రులను కలిసి ఆహ్వానం అందజేశారు. బుధవారం పార్లమెంట్‌లో ప్రధాని మోడీని ఆయన కార్యాలయంలో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో సీఎం వెంట ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, ఎంపీలు మల్లు రవి, గడ్డం వంశీ కృష్ణ, చామల కిరణ్‌ కుమార్‌ రెడ్డి, కుందూరు రఘువీర్‌ రెడ్డి, సురేష్‌ షెట్కార్‌, కడియం కావ్య, అనిల్‌ కుమార్‌ యాదవ్‌ ఉన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ముద్రించిన గ్లోబల్‌ సమ్మిట్‌ ఆహ్వాన పత్రికను సీఎం రేవంత్‌రెడ్డి ప్రధాని మోడీకి అందజేశారు.

అనంతరం కేంద్ర ప్రభుత్వం ఎంచుకున్న వికసిత్‌ భారత్‌-2047 లక్ష్యాలకు అనుగుణంగా 3 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వృద్ధి లక్ష్యంగా తెలంగాణ భవిష్యత్తు సంకల్పంతో ముందుకు సాగుతుందని ఆయన ప్రధానికి వివరించారు. దీనికి అనుగుణంగా అన్ని రంగాల వృద్ధి లక్ష్యాలు, అనుసరించే భవిష్యత్తు ప్రణాళి కలను విశ్లేషించేలా తెలంగాణ రైజింగ్‌ 2047 విజన్‌ డాక్యుమెంట్‌ను రూపొందించినట్టు చెప్పారు. నీతి ఆయోగ్‌ సలహాలు,సూచనలతో పాటు అన్ని రంగాల నిపుణుల మేథో మదనంతో తయారు చేసిన ఈ విజన్‌ డాక్యుమెంట్‌ను గ్లోబల్‌ సమ్మిట్‌ లో ఆవిష్కరించనున్నట్టు సీఎం ప్రధానికి వివరించారు. తెలంగాణ రైజింగ్‌ విజన్‌లో భాగంగా చేపడుతున్న అభివద్ధి పనులకు కేంద్ర ప్రభుత్వం తగిన సహాయ సహాకారాలు అందించాలని కోరారు.

సోనియా, రాహుల్‌, ప్రియాంక గాంధీలకు ఆహ్వానం
ప్రధానితో భేటీ అనంతరం లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీని పార్లమెంట్‌లోని ఆయన కార్యాలయంలో సీఎం రేవంత్‌ రెడ్డి కలిశారు. తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న గ్లోబల్‌ సమ్మిట్‌కు ఆహ్వానించారు. అలాగే అదే ఛాంబర్‌లో ఉన్న ప్రియాంక గాంధీ వాద్రాకు సైతం ఆహ్వానం పలికారు. అనంతరం నేతలిద్దరికీ సమ్మిట్‌లో ఆవిష్కరించనున్న విజన్‌ డాక్యుమెంట్‌ గురించి సీఎం వివరించారు. అనంతరం జన్‌ పథ్‌ 10లో సీపీపీ చైర్‌పర్సన్‌ సోనియా గాంధీని డిప్యూటీ సీఎం భట్టి, ఎంపీలతో కలిసి సీఎం మర్యాదపూర్వకంగా కలిశారు. తెలంగాణ అభివృద్ధి, అంతర్జాతీయ స్థాయిలో రాష్ట్రాన్ని నిలిపేలా చేస్తోన్న ఈ సమ్మిట్‌కు హాజరుకావాలని కోరారు. అంతకు ముందు పార్లమెంట్‌లో తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌ కు హాజరు కావాలని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్‌ లాల్‌ ఖట్టర్‌, కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌లను వేర్వేరుగా కలిసి ఆహ్వానించారు. ఈ సందర్భంగా తెలంగాణ రైజింగ్‌ 2047 విజన్‌ డాక్యుమెంట్‌ గురించిన లక్ష్యాలను కేంద్ర మంత్రులకు సీఎం వివరించారు. అనంతరం సీఎం రేవంత్‌ రెడ్డి ఢిల్లీ పర్యటన ముగించుకొని తిరిగి హైదరాబాద్‌ చేరుకున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -