– ఆర్మూర్ ఏసిపి వెంకటేశ్వర్ రెడ్డి
– పోలీసులు ఉన్నది ప్రజల భద్రత కోసమే
– శాంతి పద్ధతులు కాపాడమే పోలీస్ ప్రథమ కర్తవ్యం
– పదుల సంఖ్యలో సరైన పత్రాలు లేని వాహనాలు స్వాధీనం
నవతెలంగాణ – కమ్మర్ పల్లి
ప్రజల్లో ఉన్న అభద్రత భావాన్ని పోగొట్టి, ధైర్యాన్ని నింపేందుకే కమ్యూనిటీ కాంట్రాక్ట్ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ఆర్మూర్ ఏసిపి వెంకటేశ్వర్ రెడ్డి అన్నారు. సోమవారం సాయంత్రం మండల కేంద్రంలోని గొల్లపేట ఇందిరమ్మ కాలనీలో పోలీసులు కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కాలనీలోని ఇండ్లలో పోలీసులు సోదాలు చేశారు. కాలనీ ఏరియాలో పోలీస్ జాగిలాలతో తనిఖీలు నిర్వహించారు.ఈ సందర్భంగా సరైన పత్రాలు, నంబర్ ప్లేట్స్ లేని పదుల సంఖ్యలో వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
అనంతరం ఇందిరమ్మ కాలనీ కూడలి వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కాలనీవాసులను ఉద్దేశించి ఏసిపి వెంకటేశ్వర్ రెడ్డి మాట్లాడారు. సబ్ డివిజన్ పరిధిలోని అన్ని ప్రాంతాల్లో ఈ కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రజలతో సత్సంబంధాల వల్ల పోలీసులపై గౌరవం పెంపొందించేందుకు ఈ కార్యక్రమంలో ఎంతగానో దోహదపడుతుందన్నారు. కొందరు ప్రజలు అపోహ పడుతున్నారని, మా ప్రాంతానికి వచ్చి ఎందుకిలా సోదాలు చేస్తున్నారని, ఆందోళన చెందుతున్నారని.. ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ప్రజలకు మేమున్నామనే ధైర్యాన్ని, భరోసాను కల్పించేందుకే ఇలాంటి కార్యక్రమాలను సబ్ డివిజన్ పరిధిలోని అన్ని మండలాల్లో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. శాంతిభద్రతలు కాపాడడమే పోలీసుల ప్రథమ కర్తవ్యం అన్నారు. ప్రజల భద్రత కోసమే పోలీసులు ఉన్నారన్న విషయాన్ని ప్రజలు గుర్తుంచుకోవాలన్నారు.
తమ ఏరియాలో భద్రత ఉన్నప్పుడే ప్రజలు ప్రశాంతంగా నిద్రపోతారన్నారు. ఒక ఇంట్లో భార్యాభర్తలు గొడవ పడితే ఆ ఇల్లు ప్రశాంతంగా ఉండదని, అదేవిధంగా ఒక ఏరియాలో గొడవలు జరిగితే ఆ ఏరియా కూడా ప్రశాంతంగా ఉండదన్నారు. ప్రజల వద్దకే పోలీసులు వెళ్లి సమస్యలు తెలుసుకునేందుకే ఈ కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు ఏసిపి తెలిపారు.కార్యక్రమంలో భీంగల్ సిఐ సత్యనారాయణ గౌడ్, కమ్మర్ పల్లి ఎస్ఐ అనిల్ రెడ్డి, ఆర్మూర్ డివిజన్ పరిధిలోని సీఐలు, ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
ప్రజల్లో అభద్రతా భావాన్ని పోగొట్టేందుకే కమ్యూనిటీ కాంటాక్ట్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES