– యాజమాన్యమే ఇవ్వాలి
– ప్రభుత్వ తక్షణ సాయం రూ.లక్ష.. క్షతగాత్రులకు రూ.50 వేలు
– కంపెనీలో తనిఖీలు చేశారా?
– నిపుణుల కమిటీ వేయండి : ‘సిగాచి’ ప్రమాదస్థలాన్ని సందర్శించిన సీఎం రేవంత్‌రెడ్డి
– గాయపడినవారికి పరామర్శ
– బాధితులకు ఓదార్పు
– కంపెనీల నిర్వహణపై మార్గదర్శకాలిస్తామని ప్రకటన
నవతెలంగాణ-మెదక్ ప్రాంతీయ ప్రతినిధి
‘సిగాచి’ దుర్ఘటనలో మృతుల కుటుంబాలకు కంపెనీ యాజమాన్యం నష్టపరిహారంగా రూ.కోటి చెల్లించాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్‌రెడ్డి చెప్పారు. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు నియోజకవర్గం పాశమైలారం పారిశ్రామిక ప్రాంతంలోని సిగాచి కెమికల్స్ పరిశ్రమను మంగళవారం నాడాయన మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, శ్రీధర్‌బాబు, దామోదర రాజనర్సింహ్మ, వివేక్ వెంకటస్వామితో కలిసి సందర్శించారు. అధికారుల్ని ఆడిగి ప్రమాద వివరాలు తెలుసుకున్నారు. ఈ దుర్ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రుల్ని పరామర్శించారు. బాధిత కుటుంబ సభ్యుల్ని ఓదార్చారు.
ధైర్యంగా ఉండాలని చెప్పారు. ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. మృతుల కుటుంబాలకు తక్షణ సాయంగా రూ.లక్ష, క్షతగాత్రులకు రూ.50వేలు చొప్పున ప్రభుత్వం తరఫున ఇవ్వాలని అధికారుల్ని ఆదేశించారు. అనంతరం అక్కడే ఫైర్, డిజాస్టర్, పరిశ్రమల శాఖ, హైడ్రా, పోలీస్, రెవెన్యూ ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఊహాజనితంగా ఆలోచించడం తగదనీ, నిపుణుల కమిటీ ఏర్పాటు చేసి వాస్తవాలు వెలుగులోకి తెచ్చి, ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. దుర్ఘటనను మానవతా కోణంలో చూడాలన్నారు. ఈ సందర్బంగా సిగాచి పరిశ్రమ యాజమాన్యంపై సీఎం సీరియస్ అయ్యారు. ప్రమాదం జరిగి 24 గంటలు దాటినా సిగాచి యాజమాన్యం ఘటనా స్థలానికి ఎందుకు రాలేదని ప్రశ్నించారు. వారి తరఫున బాధితులకు ఏం భరోసా ఇచ్చారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
యాజమాన్య నిర్లక్ష్యంపై కఠిన చర్యలు తప్పవని సీఎం హెచ్చరించారు. ఎక్స్‌గ్రేషియా విషయంలో మానవతా దృక్పథంతో ఉండాలని యాజమాన్యానికి సూచించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రమాదం జరిగిన వెంటనే రాష్ట్ర మంత్రులు, జిల్లా కలెక్టర్ సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు పర్యవేక్షించారన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో గాని, తెలంగాణలో గాని ఇంత వరకు ఇంత మంది ప్రాణాలను బలిగొన్న సంఘటన జరగలేదన్నారు. అన్ని శాఖలు పూర్తి సమన్వయంతో సహాయ చర్యల్ని చేపడుతున్నాయని చెప్పారు. దుర్ఘటనలో బీహార్, ఒడిశా, ఆంధ్రప్రవేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన వాళ్లు ఉన్నట్టు ప్రాథమిక సమాచారం అందిందని తెలిపారు.
ఇప్పటి వరకు 36 మంది మరణించారనీ, మరికొందరి ఆచూకీ తెలియాల్సి ఉందని ముఖ్యమంత్రి చెప్పారు. ప్రమాద సమయంలో కంపెనీలో 143 మంది పనిచేస్తున్నారని, వారిలో 58 మంది క్షేమంగా ఉన్నట్టు అధికారుల వద్ద సమాచారముందని చెప్పారు. మృతుల కుటుంబాలకు కోటి రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని కంపెనీ యాజ మాన్యాన్ని ప్రభుత్వ పరంగా ఆదేశించినట్టు తెలిపారు. ఆ మేరకు పరిశ్రమ యాజమాన్యంతో మంత్రులు మాట్లాడి నష్టపరిహారం అందేలా చూస్తారన్నారు. తీవ్ర గాయాలపాలై, పని చేసుకోలేనిస్థితిలో ఉన్న వాళ్లకు రూ.10 లక్షలు, కొంత కాలం తర్వాత పని చేసుకోగలిగిన వాళ్లకు రూ.5 లక్షల చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని నిర్ణయించామన్నారు. ఈ పరిహారాన్ని పరిశ్రమ యాజ మాన్యం, ప్రభుత్వం కలిసి అందచేస్తాయని వివరించారు.
గాయపడినవారికి మెరుగైన వైద్యం అందిస్తామనీ, అందుకయ్యే ఖర్చుల్ని ప్రభుత్వం, కంపెనీ చూసుకుంటా యని తెలిపారు. ఈ ప్రమాదంలో ఎవరి నిర్లక్ష్యం ఉన్నదో విచారణ జరిపి చర్యలుతీసుకుంటామన్నారు. భవిష్యత్‌లో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు ప్రభుత్వం స్పష్టమైన విధానంతో కొన్ని సూచనలు, మార్గదర్శకాలకు ఇచ్చేందుకు ఒక ప్రత్యేక వ్యవస్థను కూడా ఏర్పాటు చేస్తామన్నారు. పరిశ్రమల యజమానులు కూడా ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. అధికారులు కూడా తనిఖీలు చేసి ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రమాదంలో చనిపోయిన, గాయపడిన వారి పిల్లలకు గురుకులాల్లో చదువుకునేందుకు అవకాశం కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారుల్ని ఆదేశించారు. సీఎం ఆదేశాలతో తక్షణసాయం కింద ప్రభుత్వం తరపున బాధిత కుటుంబాలకు లక్ష రూపాయలను కలెక్టర్ ఆధ్వర్యంలో అందించారు.