సామాజిక కార్యకర్త హెచ్.నరసింహ నిరసన, దీక్ష
నవతెలంగాణ- ఉట్కూర్
వర్షాలకు నష్టపోయిన పత్తి పంటకు ఎకరాకు రూ.30 వేల పరిహారం చెల్లించాలని సామాజిక కార్యకర్త హెచ్.నరసింహ ప్రభుత్వాన్ని కోరారు. నారాయణపేట జిల్లా ఉట్కూర్ మండలంలోని బిజ్వార్‌లో స్వామి వివేకానంద విగ్రహం ముందు బుధవారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అధిక వర్షాల వల్ల పత్తి, వరి మొక్కజొన్న రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. ఎకరాకు పత్తి కేవలం నాలుగు నుంచి ఐదు క్వింటాళ్ల దిగుబడి మాత్రమే వస్తోందన్నారు. స్వయంగా కేంద్ర ఆర్థిక, గణాంకాల శాఖ డైరెక్టరేట్ నివేదిక ప్రకారం.. పత్తి దిగుబడి తగ్గిందని చెప్పిందని గుర్తు చేశారు.
అందువల్ల పత్తి పంటకు ఎకరాకు రూ.30 వేల నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అదే విధంగా 20శాతం వరకు తేమఉన్న పత్తిని కూడా మద్దతు ధరకు సీసీఐ ద్వారా కొనే విధంగా రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని కోరారు. ఎకరాకు కొత్తగా 7 క్వింటాళ్ల పత్తి మాత్రమే కొంటాం అనే నిబంధన ఎత్తివేసి 12 క్వింటాళ్ల పత్తి కొనాలని డిమాండ్ చేశారు. ఈ నిరసన దీక్ష కార్యక్రమానికి రైతులు రాఘవేంద్ర, నాగిరెడ్డి, హన్మంతు, చిన్న నర్సింహా, ఆంజనేయులు, గుడిసె రాజు, అశోక్, రాజప్ప, తులసీదాస్, తిరుపతి, వెంకటప్ప, వడెప్ప, బడేసాబ్, నరేష్, ఆశప్ప, రాజమూరి తదితరులు మద్దతు తెలిపారు.



