తగ్గేదేలే అంటున్న అధికార, ప్రతిపక్ష పార్టీలు
ఒకరు ఎక్కువిస్తే మరొకరు అంతకుమించి…
అధికార పార్టీలో రెబెల్స్ పోరు
ఉత్కంఠ రేపనున్న నేటి రెండో విడత పోరు
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
మలి విడత పంచాయతీ పోరులోనూ ఎన్నికల ప్రలోభాలు శృతిమించి పోతున్నాయి. అధికార, ప్రతిపక్షాలు తగ్గేదేలే అనే రీతిలో పోటాపోటీగా పంపిణీ చేస్తున్నాయి. గ్రామ నాయకులు తమ మద్దతుదారుల గెలుపు కోసం సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. ఒకర్నిమించి మరొకరు పంపిణీ చేపడుతున్నారు. కొన్ని గ్రామాల్లో నాయకులందరూ ఒక అవగాహనకు వచ్చి సమానంగా పంపిణీ చేపడుతున్నారు. కొన్నిచోట్ల మాత్రం ఒకరు రూ.వెయ్యి ఇస్తే మరొకరు అంతకుమించి చేస్తున్నారు. ఇది తెలిసి తొలుత ఇచ్చిన వారు ఆ మిగిలిన లోటును భర్తీ చేస్తున్నారు. సాధారణ ఎన్నికల తరహాలోనే పంపకాల్లోనూ అధికార, విపక్షాలు పోటీ పడుతున్నాయి. అధికార, విపక్షాలకు చెందిన నియోజకవర్గ ఎమ్మెల్యేలు, మంత్రులు వారి స్థోమతను బట్టి తమ పార్టీ అభ్యర్థుల కోసం ఓట్ల సంఖ్య ఆధారంగా డబ్బులు పంపుతున్నారు.
ఓటర్ల సంఖ్యను బట్టి పైస్థాయి నుంచి డబ్బులు
ఓటర్ల సంఖ్యకు అనుగుణంగా ఆయా పంచాయతీలకు కేటాయింపులు చేశారు. ఇందులో అధికారపక్షానికి ఏమాత్రం తీసిపోని విధంగా ప్రధాన ప్రతిపక్షం కూడా పంపిణీ చేస్తోంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఓ నియోజకవర్గంలో రెండు వేల ఓట్లలోపు ఉంటే రూ.5 లక్షలు, మూడు వేల ఓట్లలోపైతే రూ.6 లక్షలు, నాలుగువేల ఓట్లలోపు ఓట్తైతే రూ.7 లక్షలు.. ఇలా ఓట్ల సంఖ్య ఆధారంగా వెయ్యి ఓట్లకు రూ.లక్ష చొప్పున పెంచుతూ క్యాంప్ కార్యాలయాల నుంచి డబ్బులు వెళ్లాయని సమాచారం. అలాగే విపక్ష పార్టీలు సైతం దీనికి కుడి ఎడుమ పంచాయతీలకు పంపించినట్టు తెలిసింది. కొన్ని గ్రామాల్లో అధికార పార్టీని మించి ప్రధాన ప్రతిపక్షం పంపిణీ చేస్తోంది. శుక్రవారం రాత్రి నుంచి మొదలైన ఈ పంపిణీ ప్రకియ ఆదివారం మధ్యాహ్నం పోలింగ్ ముగిసే వరకూ కొనసాగే అవకాశం ఉంది. వీటికి తోడు చికెన్, మటన్, మద్యం, చీరలు, జాకెట్లు, వెండి ఉంగరాలు, కుక్కర్లు.. ఇలా రకరకాల నజరానాలు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అందజేస్తున్నారు.
ఓటెయ్యకపోతే పథకాలు కట్
తమ పార్టీ అభ్యర్థికి ఓటెయ్యకపోతే పథకాలు కట్ అవుతాయని కొన్నిచోట్ల అధికారపక్షం నాయకులు హెచ్చరిస్తున్నట్టుగా ఓటర్లు వాపోతున్నారు. ముఖ్యంగా అధికార పార్టీకి రెబెల్ అభ్యర్థులు ఉన్నచోట ఈ బెదిరింపులు ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఇందిరమ్మ ఇండ్లు మంజూరై ఉంటే సంబంధిత లబ్దిదారులకు స్టేజీల వారీగా రావాల్సిన బిల్లులను నిలిపివేయిస్తామని, ఒకవేళ ఇండ్లు మంజూరు కాకపోతే సెకండ్ లిస్టు కోసం ఎదురు చూస్తుంటే ఆ విడత రాకుండా అడ్డుకుంటామని భయబ్రాంతులకు గురిచేస్తున్నట్టుగా ఆరోపణలు ఉన్నాయి. ఇవేకాక ఇతర పథకాల విషయంలోనూ హెచ్చరిస్తున్నారని ఓటర్లు చెబుతున్నారు.
గతంలో వార్డుమెంబర్లుగానో.. సర్పంచ్‌లుగానో పనిచేసిన వాళ్లు మళ్లీ పోటీ చేస్తే.. వారికి సంబంధించిన అక్రమాల తాలూకు ప్రతులు, ఫొటోలను ప్రదర్శిస్తూ ప్రచారం చేస్తున్నారు. లేదంటే పైస్థాయి నాయకత్వాన్ని అడ్డుపెట్టుకొని ఆయా వార్డుల్లో అభివృద్ధి పేరుతో పనిచేసినా చేయకపోయినా అక్రమ పద్ధతుల్లో కొందరు బిల్లులు డ్రా చేశారు. వారికి సంబంధించిన అవినీతి ఆనవాళ్లతోనూ ప్రచారం చేపడుతుండటం గమనార్హం. కొందరు పారిశుధ్య చర్యలు, పిచ్చి, కంచెమొక్కల తొలగింపు పేరుతో బిల్లులు డ్రా చేశారు. అటువంటి చోట ఆ మొక్కలను సోషల్ మీడియా ద్వారా పోస్టు చేస్తూ…ఫొటోలను ప్రదర్శిస్తూ అవినీతి జరిగిన విధానాన్ని వివరిస్తున్నారు. మళ్లీ అటువంటి అభ్యర్థికి ఓటేస్తారా…? అని ఓటర్ల వద్ద ఎండగడుతున్నారు.
నేటి ఫలితాల్లోనూ ఉత్కంఠ!
తొలి విడత అనేక చోట్ల ఫలితాలు ఉత్కంఠకు దారితీశాయి. స్వల్ప ఓట్ల తేడాతోసర్పంచ్, వార్డు మెంబర్ల భవితవ్యం తారుమారింది. అనేక చోట్ల డ్రా పద్ధతిలో విజేతను ప్రకటించాల్సి వచ్చింది. రెండు, మూడు ఓట్ల తేడాతో జయాపజయాలు నిర్ణయం అయిన చోట రెండుసార్లు రీకౌంటింగ్ చేపట్టారు. ఇలాంటి సన్నివేశాలు నేడు జరగనున్న రెండో దఫా ఎన్నికల్లోనూ చోటుచేసుకోనున్నాయి. చాలా గ్రామాల్లో అభ్యర్థుల మధ్య నువ్వానేనా అనేరీతిలో పోటీ ఉంది. పలుచోట్ల అధికారపార్టీకి రెబెల్స్ బెడద ఉంది. ఇటువంటి చోట ఎన్నిక మరింత ప్రతిష్టాత్మకంగా మారనుంది. అధికార పక్షంలో ఉన్న గ్రూపు పోరు కొన్నిచోట్ల ప్రతిపక్ష అభ్యర్థులకు, విపక్షాల గ్రూపు పోరు అధికార పక్షానికి కలిసి రానుంది. మంత్రులు ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గాల్లో ఎన్నికలను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.



