గ్రూప్-1 పోస్టులపై కేటీఆర్ తన వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలి : టీపీసీసీ ప్రధాన కార్యదర్శి చనగాని దయాకర్
నవతెలంగాణ-ఉస్మానియా యూనివర్సిటీ
గ్రూప్-1 పోస్టులను రూ.3 కోట్లకు అమ్ముకున్నారని కేటీఆర్ మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి చనగాని దయాకర్ అన్నారు. కేటీఆర్ వ్యాఖ్యలపై శనివారం ఆయన హైదరాబాద్ ఓయూ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్య ప్రతిష్టకు భంగం కలిగేంచే కేటీఆర్ వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని అన్నారు. అలాగే, 24 గంటల్లో ప్రభుత్వానికి క్షమాపణ చెప్పాలని లేకపోతే.. రూ. 100 కోట్ల పరువు నష్టం దావా వేస్తామని హెచ్చరించారు. పదేండ్లు పాలించిన బీఆర్‌ఎస్ గ్రూప్-1 పరీక్షలు నిర్వహించలేకపోయిందని, ఉద్యోగాలు భర్తీ చేయకుండా నిర్లక్ష్యం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరుద్యోగుల్లో ప్రభుత్వం పట్ల విద్వేషాలు కలిగేలా కేటీఆర్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు చెప్పారు. కోర్టు తీర్పును కేటీఆర్ వక్రీకరిస్తూ చిల్లర రాజకీయాలు చేస్తున్నారని అన్నారు. నిరుద్యోగుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, కేటీఆర్ చేసిన విష ప్రచారాన్ని నిరుద్యోగులు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎన్‌ఎస్‌యూఐ అధ్యక్షులు మెడ శ్రీనివాస్, నాయకులు మోహన్ బొట్టభత్తుల, నిరుద్యోగులు పరశురామ్, ఈశ్వర్, భార్గవ్, రవి, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.
కేటీఆర్ వ్యాఖ్యలపై ఓయూ పీఎస్‌లో ఫిర్యాదు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES