నవతెలంగాణ – వలిగొండ రూరల్
గ్రామాలను అన్నిరంగాలలో సమగ్రాభివృద్ధి పర్చడం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం అని స్థానిక శాసన సభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి అన్నారు. బుధవారం పంచాయతీ ఎన్నికల ప్రచారంలో బాగంగా మండలంలోని టేకులసోమారం, పహిల్వాన్ పురం, సుంకిశాల, పులిగిల్ల, కేర్చిపల్లి, మొగిలిపాక, ఎం తుర్కపల్లి, లింగరాజుపెల్లి ,వలిగొండ గ్రామాలలో సర్పంచ్ అభ్యర్థులతో కలిసి మాట్లాడుతూ.. గత ప్రభుత్వం 10 సంవత్సరాలలో ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదని, ఒక్క ఇల్లు ఇవ్వలేదని, పేద ప్రజలను పట్టించుకోలేదని, గ్రామాలలోని పేద ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తుందని తెలిపారు.
రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల, సన్నబియ్యం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రైతులకు సాగు నీటి కాల్వల అభివృద్ధి, గ్రామాలలో కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థులను గెలిపించుకుంటేనే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అండతో గ్రామాలను అభివృద్ధి చేసుకోవచ్చని అన్నారు. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులను ఆశీర్వదించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ కార్యదర్శి కసుబా శ్రీనివాస్ రావు, పాశం సత్తిరెడ్డి, తుమ్మల యుగంధర్ రెడ్డి, చేగురి మల్లేశం, కుంభం విద్యాసాగర్ రెడ్డి, కుంభం వెంకటపాపి రెడ్డి, మాద శంకర్, గరిసే రవి, కంకల కిష్టయ్యా తదితరులు పాల్గొన్నారు.



