Tuesday, December 2, 2025
E-PAPER
Homeఆటలురోకోతో రాజీ!

రోకోతో రాజీ!

- Advertisement -

చీఫ్‌ కోచ్‌, చీఫ్‌ సెలక్టర్‌తో బోర్డు భేటీ
బుధవారం రాయ్
పూర్‌లో కీలక సమావేశం

సుమారు దశాబ్ద కాలం తర్వాత భారత క్రికెట్‌ డ్రెస్సింగ్‌ రూమ్‌లో విభేదాలు పతాక శీర్షికలుగా మారుతుండగా.. చీఫ్‌ కోచ్‌ గౌతం గంభీర్‌, చీఫ్‌ సెలక్టర్‌ అజిత్‌ అగార్కర్‌పై అభిమానులు ఆగ్రహంగా ఉన్నారు. ఈ తరం దిగ్గజాలు విరాట్‌ కోహ్లి, రోహిత్‌ శర్మ పట్ల జట్టు మేనేజ్‌మెంట్‌ గౌరవప్రదంగా నడచుకోవట్లదనే వాదన ప్రచారంలో ఉండగా.. సీనియర్లతో మెరుగైన సంబంధాల పునరుద్ధరించేందుకు బీసీసీఐ పెద్దలు కీలక సమావేశం ఏర్పాటు చేశారు.

నవతెలంగాణ-ముంబయి
2024 ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ విజయానంతరం విరాట్‌ కోహ్లి, రోహిత్‌ శర్మ పొట్టి ఫార్మాట్‌ నుంచి వైదొలిగారు. ఐసీసీ టైటిల్‌ విజయంతో టీ20లకు రోకో వీడ్కోలు పలకటం అభిమానులను భావోద్వేగాలకు గురి చేసింది. కానీ, ఆ తర్వాత జరిగిన పరిణామాలు విరాట్‌ కోహ్లి, రోహిత్‌ శర్మ బలంగా టెస్టు క్రికెట్‌ వీడేలా చేశాయి. టెస్టులకు వీడ్కోలు పలుకుతూ రోహిత్‌ శర్మ నిర్ణయం తీసుకోగా.. కొద్దిరోజులకే విరాట్‌ కోహ్లి సైతం అదే బాటలో నడిచాడు. చీఫ్‌ సెలక్టర్‌ అజిత్‌ అగార్కర్‌, చీఫ్‌ కోచ్‌ గౌతమ్‌ గంభీర్‌లు రోకోను టెస్టు క్రికెట్‌ భవితవ్యంపై పునరాలోచన చేయాలని ఒత్తిడి చేసినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఫిట్‌నెస్‌, ఫామ్‌తో పాటు భారత క్రికెట్‌ ముఖచిత్రాలుగా కొనసాగుతున్న విరాట్‌ కోహ్లి, రోహిత్‌ శర్మ వీడ్కోలుతో టెస్టు, టీ20 ఫార్మాట్‌కు క్రమంగా వన్నె తగ్గింది. ఇటీవల రాంచీలో దక్షిణాఫ్రికాపై విరాట్‌ కోహ్లి శతకంతో పెవిలియన్‌లో రోహిత్‌ శర్మ హావభావాలు.. ఆసీస్‌ పర్యటనలో రోకో జోడీ అజేయ భాగస్వామ్యాన్ని గౌతం గంభీర్‌ తక్కువ చేసి మాట్లాడటం.. డ్రెస్సింగ్‌రూమ్‌లో టీమ్‌ మేనేజ్‌మెంట్‌కు, సీనియర్‌ క్రికెటర్లకు పెరుగుతున్న అంతరాన్ని స్పష్టం చేస్తోంది.

రాయ్ పూర్‌లో భేటీ
జట్టు మేనేజ్‌మెంట్‌, సీనియర్‌ క్రికెటర్ల నడుమ అంతరం పెరుగుతుండగా.. భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) పెద్దలు రంగంలోకి దిగుతున్నారు. విరాట్‌ కోహ్లి, రోహిత్‌ శర్మతో స్నేహ సంబంధాలు పునరుద్ధరిస్తూ.. భారత క్రికెట్‌ను ముందుకు తీసుకెళ్లేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఈ సమావేశంలో చర్చింనున్నారు. భారత్‌, దక్షిణాఫ్రికా రెండో వన్డే బుధవారం రాయ్ పూర్‌లో జరుగుతుంది. అదే రోజు ఉదయం రాయ్ పూర్‌లో జట్టు బస చేసే హోటల్‌లో చీఫ్‌ కోచ్‌ గౌతం గంభీర్‌, సెలక్షన్‌ కమిటీ చైర్మెన్‌ అజిత్‌ అగర్కార్‌లతో బీసీసీఐ కార్యదర్శి దేవాజిత్‌ సైకియా, సంయుక్త కార్యదర్శి ప్రభుతేజ్‌ సింగ్‌ భాటియా సమావేశం కానున్నారు. బీసీసీఐ అధ్యక్షుడు మిథున్‌ మన్హాస్‌ ఈ సమావేశానికి హాజరు అయ్యే సూచనలు కనిపించటం లేదు. మ్యాచ్‌ రోజు కావటంతో విరాట్‌ కోహ్లి, రోహిత్‌ శర్మలు సైతం భేటీకి దూరంగా ఉండనున్నారు.

‘స్వదేశీ టెస్టు సీజన్‌లో ఆన్‌ ఫీల్డ్‌, ఆఫ్‌ ఫీల్డ్‌లో ఎంతో గందరగోళ వాతావరణం కనిపించింది. భారత జట్టు ప్రగతికి బోర్డు స్పష్టమైన ప్రణాళికలు కోరుతోంది. భారత్‌ తర్వాతి టెస్టు మ్యాచ్‌ మరో ఎనిమిది నెలల్లో ఆడనుండగా.. ఆ లోగా ఐదు రోజుల ఆటలో టీమ్‌ ఇండియా రోడ్‌మ్యాప్‌ను అడిగి తెలుసుకోనుంది. సెలక్షన్‌ కమిటీ సైతం ఆటగాళ్ల ఎంపికలో నిలకడ చూపించటం లేదు. సెలక్షన్‌ కమిటీ, టీమ్‌ మేనేజ్‌మెంట్‌ సమన్వయంతో భారత జట్టు పురోగతికి పాటుపడాలని బీసీసీఐ కోరుతుంది. టీ20 ప్రపంచకప్‌కు కౌంట్‌డౌన్‌ మొదలవగా.. 2027 వన్డే వరల్డ్‌కప్‌ సమయానికి జట్టులో సమస్యలు పరిష్కారం కావాలని బీసీసీఐ భావిస్తోంది’ అని రాయ్ పూర్‌ సమావేశంపై బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. విరాట్‌ కోహ్లి, రోహిత్‌ శర్మ పేర్లను నేరుగా ప్రస్తావించకపోయినా.. ఇటీవల పరిణామాల నేపథ్యంలో అభిమానుల వ్యతిరేకత తీవ్రరూపం దాల్చకముందే.. పరిస్థితులు సద్దుమణిగితే మేలని బీసీసీఐ పెద్దలు భావిస్తోంది. ఈ సమావేశం అనంతరం గౌతం గంభీర్‌ దూకుడు కాస్త తగ్గే అవకాశం ఉంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -