Tuesday, June 24, 2025
E-PAPER
Homeజాతీయంఆందోళనే… ఖండన ఏదీ?

ఆందోళనే… ఖండన ఏదీ?

- Advertisement -

– ‘ప్రస్తుత పరిస్థితి’, ‘తాజా ఉద్రిక్తతలు’ అనే పదాలతో సరిపెట్టిన ప్రధాని మోడీ
– నాడు పహల్గాం దాడిని తీవ్రంగా ఖండించిన ఇరాన్‌
న్యూఢిల్లీ:
ఇరాన్‌ అణు కేంద్రాలపై అమెరికా దాడులు జరిపిన కొన్ని గంటల తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ ఇరాన్‌ అధ్యక్షుడు మసౌద్‌ పెజెష్కియాన్‌తో ఫోన్‌లో మాట్లాడారు. ఉద్రిక్తతలు పెరుగుతుండడంపై ‘తీవ్ర ఆందోళన’ వ్యక్తం చేశారు. చర్చలు, దౌత్యం ద్వారా ఉద్రిక్తతలను నివారించాలని హితవు పలికారు. మోడీ తన ఫోన్‌ సంభాషణలో అమెరికా దాడులను ఖండించిన పాపాన పోలేదు. సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ఆయన ఓ పోస్ట్‌ పెడుతూ ప్రస్తుత పరిస్థితిపై ఇరాన్‌ నేతతో సవివరంగా చర్చించానని తెలిపారు. మధ్యప్రాచ్యంలో శాంతి, సుస్థిరత తిరిగి నెలకొనాలన్న ఆకాంక్షను వ్యక్తపరిచారు. అమెరికా దాడులపై భారత ప్రభుత్వం అధికారికంగా స్పందించిన తీరు ఇది. రెండు నెలల క్రితం పహల్గాంలో ఉగ్రదాడి జరిగిన తర్వాత మోడీతో ఇరాన్‌ అధ్యక్షుడు ఫోన్‌లో మాట్లాడారు. ఉగ్రవాదుల దాడిని తీవ్రంగా ఖండించారు. ఇప్పుడు ముందుగా ఫోన్‌ చేసింది కూడా ఇరాన్‌ అధ్యక్షుడు పెజెష్కియానే. ఆయన భారత్‌తో పాటు ఈజిప్ట్‌, పాకిస్తాన్‌, ఫ్రాన్స్‌ సహా పలు దేశాల నేతలతో కూడా మాట్లాడి పరిస్థితిని వివరించారు. తాజా ఉద్రిక్తతలపై మోడీ కేవలం ఆందోళన వ్యక్తం చేశారే తప్పించి దాడులను ఖండించలేదు. అసలు ఆయన ఆ దాడులనే ప్రస్తావించలేదు. ‘ప్రస్తుత పరిస్థితి’, ‘తాజా ఉద్రిక్తతలు’ అనే పదాలను మాత్రమే తన సంభాషణలో ఉపయోగించారు. ఇరాన్‌లో నివసిస్తున్న భారతీయులను సురక్షితంగా స్వదేశానికి పంపుతున్నందుకు మోడీ కృతజ్ఞతలు తెలిపారని విదేశాంగ శాఖ వివరించింది. వాణిజ్య, శాస్త్ర సాంకేతిక రంగాలలోనూ, రెండు దేశాల ప్రజల మధ్య ద్వైపాక్షిక సహకారాన్ని బలోపేతం చేసుకోవాలని ఇరువురు నేతలు నిర్ణయించుకున్నారని తెలిపింది.
ఇరాన్‌ అధ్యక్షుడు ఏమన్నారు?
‘ఇవాళ ప్రపంచం చూస్తున్నది ఆందోళనకరమైన, ఆమోదయోగ్యం కాని ధోరణి. అంతర్జాతీయ నిబంధనలు, కర్తవ్యాల పరిధిలో పనిచేస్తున్న దేశంపై…ముఖ్యంగా అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ పర్యవేక్షణలో కార్యకలాపాలు సాగిస్తున్న దేశంపై అమెరికా ప్రత్యక్షంగా, బహిరంగంగా దాడి చేసింది. ఈ చర్యలను చూస్తుంటే శాంతి, ప్రజాస్వామ్యం, మానవ హక్కులు, అంతర్జాతీయ నిబంధనలకు కట్టుబడి ఉన్నామంటూ ఆమెరికా చేస్తున్న వాదనలన్నీ కేవలం నినాదాలేనని, ప్రజాభిప్రాయాన్ని వంచించడం తప్ప మరేమీ కాదని తేలిపోయింది’ అని పెజెష్కియాన్‌ను ఉటంకిస్తూ ఇరాన్‌ అధ్యక్ష కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది.

చర్చలు జరుపుతుండగానే దాడులా?
టెహ్రాన్‌పై ఇజ్రాయిల్‌ దాడులు ప్రారంభించడానికి ముందే తన అణు కార్యక్రమంపై యూరోపియన్‌ యూనియన్‌ దేశాలతో చర్చిస్తున్నానని ఇరాన్‌ స్పష్టం చేసింది. అమెరికా దాడులకు కొద్ది రోజుల ముందు ఇరాన్‌ విదేశాంగ మంత్రి అబ్బాస్‌ అరగ్చీ యూరోపియన్‌ మంత్రులతో సమావేశాలు నిర్వహించారు. పెజెష్కియాన్‌ కూడా చర్చల గురించి మాట్లాడారని ఇరాన్‌ అధ్యక్ష కార్యాలయం తెలిపింది. దాడులు జరిగే సమయంలో సైతం అమెరికాతో పెజెష్కియాన్‌ చర్చలు జరుపుతూనే ఉన్నారు. ఇలా వివిధ రూపాలలో సంప్రదింపులు కొనసాగుతున్నప్పటికీ తొలుత ఇజ్రాయిల్‌, ఆ తర్వాత అమెరికా ఇరాన్‌పై విరుచుకుపడ్డాయి. చర్చలకు తాను కట్టుబడి ఉన్నానంటూ అమెరికా చేస్తున్న ప్రకటనల్లో ఏ పాటి నిబద్ధత ఉన్నదో దీనివల్ల అర్థమవుతోంది.

స్వదేశానికి భారతీయులు
ఇరాన్‌ అణు స్థావరాలపై ఇజ్రాయిల్‌ దాడులు ప్రారంభించడానికి ముందు అక్కడ పది వేల మందికి పైగా భారతీయులు నివసిస్తున్నారు. వీరిలో విద్యార్థులు, వృత్తి నిపుణులు, వ్యాపారులు ఉన్నారు. ఆపరేషన్‌ సిందు కింద ఇప్పటి వరకూ 1,428 మంది భారతీయులు స్వదేశానికి చేరుకున్నారు. గగనతలాన్ని చాలా వరకూ మూసివేయడంతో ఇరాన్‌లోని మష్దాద్‌ నగరం నుంచి ప్రత్యేక విమానాలు నడుపుతున్నారు. కొందరు భారతీయులు ముందుగా అర్మేనియా, తుర్క్‌మెనిస్థాన్‌ చేరుకొని అక్కడి నుంచి వాణిజ్య విమానాలలో ఢిల్లీకి వస్తున్నారు.

అతి పెద్ద, చారిత్రక అబద్ధం
ఇరాన్‌పై ఇజ్రాయి ల్‌ చేస్తున్న దాడులకు అమెరికాతో పాటు కొన్ని యూరోపియన్‌ యూని యన్‌ దేశాలు కూడా మద్దతు ఇచ్చాయని ఇరాన్‌ అధ్యక్షుడు పెజెష్కియాన్‌ ఆరోపించారు. ఇరాన్‌ వద్ద అణ్వాయుధాలు ఉన్నాయంటూ అమెరికా, ఇజ్రాయిల్‌ చేస్తున్న ఆరోపణను ‘అతి పెద్ద, చారిత్రక అబద్ధం’గా తోసిపుచ్చారు. ‘సుప్రీం లీడర్‌ జారీ చేసిన ఫత్వా ప్రకారం అణ్వాయుధాల తయారీ, వినియోగం మతపరంగా, నైతికంగా నిషిద్ధం. ఇరాన్‌ రక్షణ సిద్ధాంతంలో వాటికి చోటు లేదు. అంతర్జాతీయ వేదికపై ఇరాన్‌కు వ్యతిరేకంగా జరుగుతున్న ప్రచారం పూర్తి అబద్ధం. తన చట్టపరమైన హక్కులను వినియోగించుకోకుండా నిరోధించే ప్రయత్నాలను ఇరాన్‌ ఎప్పటికీ అంగీకరించదు. మా దేశాన్ని, ప్రాదేశిక సమగ్రతను కాపాడుకునే హక్కు మాకు ఉంది’ అని పెజెష్కియాన్‌ స్పష్టం చేశారని అధ్యక్ష కార్యాలయం వివరించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -