అభ్యంతరాల నడుమ అంబుడ్స్‌మన్, ఎథిక్స్ ఆఫీసర్ నియామకం
నవతెలంగాణ-హైదరాబాద్
సుప్రీంకోర్టు నియమిత జస్టిస్ లావు నాగేశ్వర్‌రావు ఏకసభ్య కమిటీ వేటు వేసిన 57 క్లబ్‌లు లేకుండా సమావేశమైన హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) 87వ (వాయిదా) ఏజీఎం తీవ్ర గందరగోళం నడుమ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్‌మోహన్ రావు, కోశాధికారి సిజె శ్రీనివాస రావు పలు కేసుల్లో సిఐడి కస్టడీలో ఉండగా.. కార్యదర్శి ఆర్. దేవరాజ్ అందుబాటులో లేరు. తాత్కాలిక అధ్యక్షుడు సర్దార్ దల్జీత్ సింగ్ అధ్యక్షతన శనివారం ఉప్పల్ స్టేడియంలో జరిగిన వార్షిక సర్వ సభ్య సమావేశంలో అంబుడ్స్‌మన్, ఎథిక్స్ ఆఫీసర్‌లను నియమించారు. అంబుడ్స్‌మన్‌గా జస్టిస్ సురేశ్ కుమార్ పేరును బీసీసీఐ మాజీ అధ్యక్షుడు శివలాల్ యాదవ్ ప్రతిపాదించగా.. ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ సభ్యుడు వి. చాముండేశ్వరినాథ్ బలపరిచారు. ఎథిక్స్ ఆఫీసర్‌గా జస్టిస్ కెసి భాను పేరును హెచ్‌సీఏ సీనియర్ సభ్యుడు వినోద్ ఇంగ్లే ప్రతిపాదించగా.. మరో సభ్యుడు రవీందర్ సింగ్ బలపరిచారు. అంబుడ్స్‌మన్, ఎథిక్స్ ఆఫీసర్ పేర్లను ముందుగా సభ్యులకు ఇవ్వకుండా.. సమావేశంలో ఏకపక్షంగా ప్రతిపాదించటంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. ఈ విషయంలో కొందరు సభ్యులు కార్యవర్గ సభ్యులను నిలదీసినా.. అభ్యంతరాలను పట్టించుకోకుండా నియామకాలను ఆమోదించారు. ఏజీఎంలో సభ్యుల ఆందోళనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి.
ఇదేం తీరు? :
ఏజీఎం భేటీ, నిర్వహణ తీరు పట్ల కొందరు సభ్యులు తీవ్ర విమర్శలు గుప్పించారు. ఏజీఎం ఏడాదికి ఒకసారి మాత్రమే నిర్వహిస్తారని, గత ఏజీఎంలో (జూన్ 29) వాయిదా తీర్మానం చేయకుండా.. వాయిదా ఏజీఎం నిర్వహణకు అవకాశం లేదని తాత్కాలిక అధ్యక్షుడు దల్జీత్ సింగ్‌కు రాసిన ఓ లేఖలో హెచ్‌సీఏ సభ్యుడు రామకృష్ణ ప్రశ్నించారు. 21 రోజుల గడువుతో నోటీసు ఇవ్వకుండా, రూల్స్ పాటించకుండా సమావేశం నిర్వహించారని అన్నారు. అంబుడ్స్‌మన్, ఎథిక్స్ ఆఫీసర్ పేర్లను సభ్యులతో పంచుకోకుండా కేవలం మూడు రోజుల వ్యవధిలో ఏజీఎం నిర్వహించాల్సిన అవసరం ఏమోచ్చిందని రామకృష్ణ నిలదీశారు. జస్టిస్ లావు నాగేశ్వర్ రావు కమిటీ వేటు వేసిన 57 క్లబ్‌ల ప్రతినిధులు గత ఏజీఎంకు హాజరైనప్పుడు లేని అభ్యంతరాలు ఇప్పుడు ఎందుకొచ్చాయో చెప్పాలని దల్జీత్ సింగ్‌ను ఆయన డిమాండ్ చేశారు.
గందరగోళంగా హెచ్‌సీఏ ఏజీఎం
- Advertisement -
- Advertisement -