Thursday, December 18, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంఐరాసకు అభినందనలు

ఐరాసకు అభినందనలు

- Advertisement -

పాలస్తీనా సంఘీభావ దినోత్సవం సందర్భంగా జిన్‌పింగ్‌ సందేశం
బీజింగ్‌ :
పాలస్తీనా ప్రజలకు సంఘీభావం తెలుపుతూ పాటించే అంతర్జాతీయ దినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారం సమావేశం నిర్వహించిన ఐక్యరాజ్యసమితికి చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ అభినందనలు తెలిపారు. పాలస్తీనా సమస్య మధ్యప్రాచ్య ఘర్షణకు కేంద్ర బిందువుగా ఉన్నదని, అది అంతర్జాతీయ నిస్పాక్షికతను, న్యాయాన్ని, ప్రాంతీయ స్థిరత్వాన్ని ప్రభావితం చేస్తుందని ఐరాసకు పంపిన సందేశంలో ఆయన వివరించారు. ప్రస్తుత పరిస్థితులలో అంతర్జాతీయ సమాజం ఏకాభిప్రాయాన్ని కలిగి ఉండాలని, గాజాలో సమగ్రమైన, శాశ్వత కాల్పుల విరమణ కోసం క్రియాశీలక చర్యలు చేపట్టాలని సూచించారు. ఘర్షణలు తిరిగి తలెత్తకుండా చూడాలని కోరారు.

పాలస్తీనా ప్రజల ఆకాంక్షలను గౌరవించాలని, గాజాలో పరిస్థితులను త్వరగా మెరుగుపరచాలని, పాలస్తీనియన్ల ఇబ్బందులను తొలగించాలని జిన్‌పింగ్‌ తన సందేశంలో పిలుపునిచ్చారు. ముఖ్యంగా పాలస్తీనా సమస్యకు సాధ్యమైనంత త్వరగా రాజకీయ పరిష్కారం సాధించాల్సిన అవసరం ఉన్నదని నొక్కి చెప్పారు. పాలస్తీనా సమస్య అంతర్జాతీయ పాలనా వ్యవస్థ సమర్ధతకు ఓ పరీక్ష అని తెలిపారు. సమస్య మూలాలను గుర్తించి దానిని పరిష్కరించాల్సి ఉంటుందని, అందుకోసం పటిష్టమైన చర్యలు తీసుకోవాలని, చారిత్రక అన్యాయాలను సరిదిద్దాలని, న్యాయాన్ని నిలబెట్టాలని అంతర్జాతీయ సమాజాన్ని కోరారు.

పాలస్తీనా ప్రజలు తమ చట్టబద్ధమైన హక్కులను పునరుద్ధరించుకోవడానికి భద్రతా మండలిలో శాశ్వత సభ్య దేశంగా చైనా దృఢమైన మద్దతు ఇస్తుందని జిన్‌పింగ్‌ తెలిపారు. పాలస్తీనా సమస్యకు సమగ్రమైన, న్యాయమైన, శాశ్వత పరిష్కారం సాధించడానికి అంతర్జాతీయ సమాజంతో కలిసి పనిచేస్తూనే ఉంటామని ఆయన చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -