జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 20 వేల దొంగ ఓట్ల నమోదు: ఎన్నికల సంఘానికి కేటీఆర్ ఫిర్యాదు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. దొంగ ఓట్ల నమోదు, కాంగ్రెస్ అధికార దుర్వినియోగంపై పార్టీ సీనియర్ నేతలతో కలిసి సోమవారం రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. జాతీయస్థాయిలో ఆ పార్టీ నేత రాహుల్ గాంధీ ఓటు చోరీ ఉద్యమం చేస్తుంటే… ఇక్కడ మాత్రం చోరీ ఓట్లతో గెలవడానికి కాంగ్రెస్ ప్రయత్నం చేస్తున్నదని విమర్శించారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఒకే ఇంట్లో 50 దొంగ ఓట్లను నమోదు చేసిన ఘటనపై ఆధారాలను ఎన్నికల సంఘానికి సమర్పించినట్టు తెలిపారు. మొత్తం నియోజక వర్గంలో కాంగ్రెస్ పార్టీ 20వేలకు పైగా దొంగ ఓట్లను నమోదు చేయించిందని ఆరోపించారు. ఒక్కొ వ్యక్తికి మూడు ఎన్నికల గుర్తింపు కార్డులు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. ఇష్టా రాజ్యంగా నిధులు వెచ్చించి ఎన్నికల నిబంధనలకు వ్యతిరేకంగా ప్రజలకు తాయిలాలు అందిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర మంత్రులందరూ జూబ్లీహిల్స్‌కు మకాం మార్చి ప్రజలను ప్రలోభ పెడుతున్నారని విమర్శించారు. దొంగ ఓట్లతో పాటు అధికార దుర్వినియోగంపై సమగ్ర విచారణ జరపాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ అధికార దుర్వినియోగం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES