Friday, October 17, 2025
E-PAPER
Homeజాతీయంబీహార్‌లో కాంగ్రెస్‌ అభ్యర్థుల ప్రకటన

బీహార్‌లో కాంగ్రెస్‌ అభ్యర్థుల ప్రకటన

- Advertisement -

15 మందికి పైగా పేర్లతో తొలి జాబితా
నామినేషన్ల స్వీకరణకు నేడే చివరి తేదీ
మహా గట్‌బంధన్‌లో కుదరని ఏకాభిప్రాయం
221 అక్రమ ఆయుధాలు సీజ్‌ : ఈసీ
రూ.37 కోట్ల విలువైన మద్యం, నగదు స్వాధీనం

న్యూఢిల్లీ : బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికల్లో సీట్ల పంపకంపై విపక్ష మహా గట్‌బంధన్‌(ఇండియా బ్లాక్‌)లో ఇప్పటికీ ఏకాభిప్రాయం కుదరలేదు. ఇలాంటి తరుణంలో కాంగ్రెస్‌ పార్టీ 15 మందికి పైగా పేర్లతో తొలి జాబితాను విడుదల చేసింది. తొలి దశ పోలింగ్‌ నామినేషన్ల స్వీకరణకు నేడే చివరి తేదీ. అయినప్పటికీ మహా గట్‌బంధన్‌లో సీట్ల పంపకం కొలిక్కి రాకపోవటం, కాంగ్రెస్‌ పార్టీ తన అభ్యర్థులను ప్రకటించటం ఆసక్తికరంగా మారింది. తమ పార్టీ అభ్యర్థులను బరిలో నిలిపే ప్రకటనను కాంగ్రెస్‌ పార్టీ తన అధికారిక ఎక్స్‌ హ్యాండిల్‌ ద్వారా వెల్లడించింది. గోపాల్‌ గంజ్‌, అమర్‌పూర్‌, బెగుసరాయ్, సుల్తాన్‌గంజ్‌, కుటుంబ, వసీర్‌గంజ్‌, నలంద, ఔరంగబాద్‌, రాజాపకడ్‌, బచ్వర్‌, బారాబిగా, ముజఫర్‌పూర్‌, గోవింద్‌గంజ్‌, రోసెరా, లఖిసరాయ్, బికర్మ్‌ వంటి స్థానాలకు అభ్యర్థులను ప్రకటించినట్టుగా తెలుస్తున్నది.

లాలూకు రాహుల్‌ ఫోన్‌
మహాగఠ్‌బంధన్‌లో ఆర్జేడీ, కాంగ్రెస్‌లు ప్రధాన పార్టీలుగా ఉన్నాయి. కాంగ్రెస్‌ పార్టీ మొత్తం 60 స్థానాలో కోసం పట్టుబడుతున్నది. కానీ ఆర్జేడీ 50 సీట్లను మాత్రమే ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నది. తాను గెలిచే స్థానాలను విడిచిపెట్టుకోవటానికి ఆర్జేడీ ఏ మాత్రమూ సిద్ధంగా కనబడటం లేదు. ఈ నేపథ్యంలో సీట్ల పంపకంలో ఏకాభిప్రాయం సాధించేందుకు కాంగ్రెస్‌, ఆర్జేడీ అగ్రనేతల మధ్య చర్చలు నడుస్తున్నాయి. ఇందులో భాగంగా కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేతలు రాహుల్‌ గాంధీ, మల్లికార్జున్‌ ఖర్గేలు ఆర్జేడీ అగ్రనేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌తో ఫోన్‌లో మాట్లాడరని పార్టీ వర్గాలు తెలిపాయి. సీట్ల పంపకంలో ఒక ఒప్పందాన్ని ఖరారు చేయాలని ఇరు పార్టీలు నిర్ణయించినట్టు తెలుస్తున్నది.

ఇక కాంగ్రెస్‌ చెప్పినట్టుగానే 61 స్థానాలు ఇవ్వటానికి ఆర్జేడీ సిద్ధమైనా.. హస్తంపార్టీ పట్టుబడుతున్న కొన్ని కీలక నియోజకవర్గాల విషయంలో ఏకాభిప్రాయం కుదరలేదని సమాచారం. 2020 రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ మొత్తం 70 స్థానాల్లో పోటీ చేసిన విషయం విదితమే. ఈ సారి ఆ సీట్ల సంఖ్య తగ్గనున్నట్టు తెలుస్తున్నది. ఇటు సీట్ల కేటాయింపుపై ఏకాభిప్రాయం రాకముందే ఆర్జేడీ కీలక నేత బుధవారం రాత్రి నామినేషన్‌ దాఖలు చేయటం, అనంతరం కాంగ్రెస్‌ పార్టీ తన అభ్యర్థులను ప్రకటించటం జరిగాయి.

రూ.37 కోట్ల విలువైన మద్యం, నగదు స్వాధీనం, 221 అక్రమ ఆయుధాలు సీజ్‌ : ఈసీ
బీహార్‌లో ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చిన తర్వాత రూ.37 కోట్లకుకు పైగా విలువైన నగదు, మద్యం, నార్కొటిక్స్‌, ఇతర విలువైన వస్తువులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బుధవారం ఒక్క రోజు రూ.1.284 కోట్ల విలువైన నగదు, మద్యం, ఇతర వస్తువులను సీజ్‌ చేశారు. దీంతో బుధవారం నాటికి సీజ్‌ చేసిన వీటి విలువ మొత్తం రూ.37.14 కోట్లకు చేరిందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి తెలిపారు. నగదు, మద్యంతో పాటు 221 అక్రమ ఆయుధాలను సీజ్‌ చేసినట్టు వివరించారు.

1487 కాట్రిడ్జ్‌లు, ఐదు పేలుడు పదార్థాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అక్రమ ఆయుధాలు తయారు చేస్తున్న మొత్తం 14 కేంద్రాలపై ఇప్పటి వరకు దాడులు నిర్వహించారు. రాష్ట్రంలో 33.3 శాతం లైసెన్స్‌డ్‌ ఆయుధాలు డిపాజిట్‌ అయ్యాయి. మొత్తం 798 ఆయుధ లైసెన్స్‌లు రద్దయ్యాయి. 669 ఆయుధాలను సీజ్‌ చేశారు. మొత్తం 243 అసెంబ్లీ స్థానాలను కలిగి ఉన్న బీహార్‌లో నవంబర్‌ 6, 11 తేదీలలో రెండు దశల్లో ఎన్నికలు జరుగనున్నాయి. నవంబర్‌ 14న ఫలితాలు వెలువడనున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -