Friday, August 8, 2025
E-PAPER
spot_img
Homeరాష్ట్రీయంబీసీలకు కాంగ్రెస్‌ మోసం

బీసీలకు కాంగ్రెస్‌ మోసం

- Advertisement -

– రాహుల్‌ పీఎం అయితేనే బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత అంటారా? : బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

బీసీల రిజర్వేషన్ల చట్ట బద్ధత విషయంలో కాంగ్రెస్‌ పార్టీ వారిని మోసం చేసిం దని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ విమర్శిం చారు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే చేస్తామని హామీ ఇచ్చింది. ఇప్పుడేమో రాహుల్‌గాంధీ ప్రధానమంత్రి అయ్యాక చూద్దామంటుందని ఆయన మండిపడ్డారు. సీఎం రేవంత్‌ రెడ్డికి కేసీఆర్‌ ఫోబియా పట్టుకుందనీ, ముఖ్యమంత్రి చేస్తున్నది ముమ్మాటికీ డ్రామానే అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో పరిగి నియోజక వర్గానికి చెందిన నాయకులు బీఆర్‌ఎస్‌లో చేరారు. వారిని కేటీఆర్‌ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ కాంగ్రెస్‌ ప్రకటించిన బీసీ డిక్లరేషన్‌లో రాహుల్‌ గాంధీ ప్రధానమంత్రి అయితేనే… అనే షరతు ఉందా? అని ప్రశ్నించారు.
ఢిల్లీకి వెళ్లినా రేవంత్‌ రెడ్డి కేసీఆర్‌ గురించే మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. కేసీఆర్‌ పేరు తీయకుండా ఉండలేని మానసిక రుగ్మత రేవంత్‌ రెడ్డికి ఉన్నదేమో అని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. బీసీ రిజర్వేషన్ల పేరుతో కాలయాపన చేస్తున్న కాంగ్రెస్‌, బీసీ డిక్లరేషన్‌లోని ఇతర హామీలను పూర్తిగా పక్కన పెట్టిందని ఆరోపించారు. పీఎం మోడీతో, కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీతోనూ రేవంత్‌ రెడ్డి చేస్తున్నది డ్రామానేనని ఆయన అన్నారు. రేవంత్‌ రెడ్డి కాంగ్రెస్‌లో చివరకు వరకు ఉంటానని చెప్పడం కూడా డ్రామానేనని మండిపడ్డారు.
దౌర్భాగ్య స్థితిలో పార్టీ మారిన నేతలు
పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఏ పార్టీలో ఉన్నారో చెప్పుకోలేని దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నారని కేటీఆర్‌ వ్యాఖ్యానించారు. ”కండువాలు కప్పుకుని ఇప్పుడు దేవుడి కండువాలు కప్పుకున్నామనీ, ఏ పార్టీలో ఉన్నారో చెప్పుకోలేకపోతున్నారని తెలిపారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఏ పార్టీలో ఉన్నారో రాష్ట్రంలో చిన్న పిల్లవాడిని అడిగినా చెప్తారనీ, కానీ శాసనసభ స్పీకర్‌కు మాత్రం ఇంకా తెలియడం లేదని విమర్శించారు. కాంగ్రెస్‌ పార్టీ అరాచకాలు తగ్గాలంటే, అధికారులు ప్రజల మాట వినాలంటే రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ పార్టీని గెలిపించాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలను కాంగ్రెస్‌ మోసం చేసిందని కేటీఆర్‌ తీవ్రంగా విమర్శించారు. స్థానిక సంస్థల ఎన్నికలు అయిపోగానే కాంగ్రెస్‌ సర్కారు రైతుబంధును రద్దు చేస్తుందని కేటీఆర్‌ జోస్యం చెప్పారు.
కార్యకర్తలను అన్ని విధాలుగా ఆదుకుంటాం
తాము పదేండ్లు అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి సారించామనికేటీఆర్‌ తెలిపారు. ఆ సమయంలో పార్టీ కార్యకర్తలకు తగినంత చేయలేకపోయామని ఆయన అంగీకరించారు. మళ్లీ అధికారంలోకి రాగానే కార్యకర్తలను అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీని గెలిపించేందుకు గట్టిగా కష్టపడాలని కేటీఆర్‌ పిలుపునిచ్చారు. తెలంగాణ ఉన్నంత కాలం గులాబీ కండువా ఉంటుందని చెప్పారు. కాంగ్రెస్‌, బీజేపీలను మట్టి కరిపించి కేసీఆర్‌ను మళ్లీ ముఖ్యమంత్రిగా ఎన్నుకుంటామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img