Saturday, December 13, 2025
E-PAPER
Homeఖమ్మంమధిర నియోజకవర్గంలో ఆ మూడు గ్రామాలలో కాంగ్రెస్ ఓటమి..

మధిర నియోజకవర్గంలో ఆ మూడు గ్రామాలలో కాంగ్రెస్ ఓటమి..

- Advertisement -

* గోవిందాపురం ఎల్, పాతర్లపాడు, పందిళ్ళపల్లిలో..

* సీపీఐ(ఎం) అభ్యర్థులు ఘనవిజయం

* పాతర్లపాడులో 12 వార్డులలో కాంగ్రెస్ కు దక్కని వార్డులు నిల్..

* పందిళ్ళపల్లిలో అలవాల శ్రీనివాసరావు

* గోవిందాపురం ఎల్ లో ఎర్రబోయిన నాగేశ్వరరావు

* పాతర్లపాడు లో సామినేని రామారావులను… హత్య చేసిన కాంగ్రెస్ గుండాలు

* హత్య రాజకీయాలకు ఓటర్లు గుణపాఠం

నవతెలంగాణ బోనకల్

ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలోనే కాంగ్రెస్ నాయకులు హత్య రాజకీయాలకు పాల్పడిన మూడు గ్రామాలలోనూ సీపీఐ(ఎం) అభ్యర్థులు ఘన విజయం సాధించటం విశేషం. అధికార అహంకారంతో హత్య రాజకీయాలకు పాల్పడిన కాంగ్రెస్ నాయకులకు ఓటర్లు తగిన గుణపాఠం చెప్పారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. తాము శాంతికే ప్రాధాన్యత ఇస్తామని, హత్యా రాజకీయాలకు మా గ్రామాల్లో చోటు లేదని ఆ మూడు గ్రామాల ఓటర్ల తమ తీర్పుతో స్పష్టం చేశారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ప్రాతినిధ్యం వహిస్తున్న మధిర నియోజకవర్గంలోనే మూడు హత్యలు జరిగాయి. ఈ మూడు హత్యలు కూడా కాంగ్రెస్ నాయకులే చేశారనే ఆరోపణలు బలంగా ఉన్నాయి. ఆ విధంగా వారిపై కేసులు కూడా నమోదై ఉన్నాయి. ఈ మూడు గ్రామాలలో కాంగ్రెస్ నాయకులు అనేక రూపాలలో ఓటర్లను బెదిరించారు. అధికారం పేరుతో బెదిరింపులకు దిగిన ఏ మాత్రం బెదరకుండా ఓటర్లు సీపీఐ(ఎం) అభ్యర్థులకే పట్టం కట్టడం విశేషం. ఈ మూడు గ్రామాల ఓటర్ల తీర్పుతోనైనా కాంగ్రెస్ నాయకులు హత్యా రాజకీయాలకు దూరంగా ఉంటారేమో వేచి చూద్దాం. ఇది ఇలా ఉండగా పందిళ్ళపల్లి గ్రామంలో సిపిఎం అభ్యర్థిగా పోటీ చేసిన వత్సవాయి పద్మ పోటీ చేయగా కాంగ్రెస్ వ్యూహాత్మకంగా పద్మ బంధు వర్గం నుంచే అభ్యర్థిని బరిలో నిలిపింది. అయినా ఓటర్లు చాలా తెలివిగా కాంగ్రెస్ హత్యా రాజకీయాలకు గుణపాఠం చెప్పారు.

చింతకాని మండల పరిధిలోనే పందిళ్ళపల్లి గ్రామంలో సీపీఐ(ఎం) నాయకులు, ప్రముఖ లాయరు అలవాల శ్రీనివాసరావును కాంగ్రెస్ గూండాలు కొన్ని సంవత్సరాల క్రితం హత్య చేశారు. కాంగ్రెస్ నాయకులపై కేసు కూడా నమోదై ఉంది. చింతకాని, బోనకల్ మండలాలలో మొదటి విడత పంచాయతీ ఎన్నికలు జరిగాయి. ఈ పంచాయతీ ఎన్నికలు ఈనెల 11వ తేదీన ముగిశాయి. పందిళ్ళపల్లిలో సర్పంచ్ ఎన్నికలలో సీపీఐ(ఎం), బీఆర్ఎస్ కలిసి పోటీ చేశాయి. కాంగ్రెస్, సిపిఐ, వైఎస్ఆర్సిపి, టిడిపి కలిసి పోటీ చేశాయి. సీపీఐ(ఎం) అభ్యర్థిగా సిపిఎం సీనియర్ నాయకులు వత్సవాయి జానకి రాములు సతీమణి పద్మ పోటీ చేసింది. ఐదు వార్డులలో సీపీఐ(ఎం), మరో 5 వార్డులలో బీఆర్ఎస్ కలిసి పోటీ చేశాయి. ఇక్కడ మొత్తం 10 వార్డులు ఉన్నాయి. సీపీఐ(ఎం) పోటీ చేసిన ఐదు వార్డులలో మూడు విజయం సాధించింది. బీఆర్ఎస్ పోటీ చేసిన ఐదు స్థానాలలో మూడు స్థానాలను సాధించుకుంది. పందిళ్ళపల్లి లో మొత్తం 1658 ఓట్లు ఉన్నాయి ఇందులో 1526 ఓట్లు పోలయ్యాయి. ఇందులో సీపీఐ(ఎం)కు 795 ఓట్లు రాగా, కాంగ్రెస్ అభ్యర్థి అలవాల రాధ కు 711 ఓట్లు వచ్చాయి.

సీపీఐ(ఎం) సర్పంచ్ అభ్యర్థి 84 ఓట్ల మెజార్టీతో విజయం సాధించింది. సీపీఐ(ఎం) 3,7 వార్డులలో విజయం సాధించింది. మూడో వార్డులో 20 ఓట్ల మెజార్టీ, ఏడో వార్డులో 31 మెజార్టీ వచ్చింది. బీఆర్ఎస్ కు రెండవ వార్డ్ లో 26 , 5వ వార్డులో 30, ఆరవ వార్డులో 52 ఓట్ల మెజార్టీ వచ్చింది. ఉప సర్పంచ్ గా ఒప్పందంలో భాగంగా బీఆర్ఎస్ కు చెందిన మేకల కల్పన ఎన్నికయింది. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలోనే బోనకల్ మండల పరిధిలోనే గోవిందాపురం ఎల్ గ్రామంలో సీపీఐ(ఎం) కార్యకర్త ఎర్రబోయిన నాగేశ్వరరావుని 28 అక్టోబర్ 2023న కాంగ్రెస్ నాయకులు అతి కిరాతకంగా హత్య చేశారు. వీరిపై ప్రస్తుతం కోర్టులో విచారణ సాగుతుంది. ఈ క్రమంలో గోవిందాపురం ఎల్ లో పంచాయతీ ఎన్నికలలో సీపీఐ(ఎం), సీపీఐ, బీఆర్ఎస్ కలిసి పోటీ చేశాయి. సీపీఐ(ఎం) అభ్యర్థిగా మంద కరుణ పోటీ చేశారు. ఇక్కడ మొత్తం 10 వార్డులు ఉన్నాయి. సీపీఐ(ఎం) 9 వార్డులలో, బీఆర్ఎస్ ఒక వార్డులో కలిసి పోటీ చేశాయి. మొత్తం గ్రామంలో 2,248 ఓట్లు ఉన్నాయి. ఇందులో 2,055 ఓట్లు పోలయ్యాయి.

సీపీఐ(ఎం) అభ్యర్థికి 1,127 ఓట్లు రాగా, కాంగ్రెస్ అభ్యర్థికి 899 ఓట్లు వచ్చాయి. సీపీఐ(ఎం) అభ్యర్థి 228 ఓట్ల మెజార్టీతో విజయం సాధించింది. సీపీఐ(ఎం) పోటీ చేసిన 9 వార్డులలో పోటీ చేయగా ఆరు వార్డులలో విజయం సాధించింది.ఒకటో వార్డులో 21 ఓట్ల మెజార్టీ, ఆరో వార్డులో 34, 7వ వార్డులో 79, 8వ వార్డులో 89, 9వ వార్డులో 99, 10వ వార్డులో 85 ఓట్ల మెజార్టీతో విజయం సాధించింది. 4వ వార్డులో బిఆర్ఎస్ అభ్యర్థి 16 ఓట్ల మెజార్టీతో విజయం సాధించింది. ఉపసర్పంచ్ గా సిపిఎం కు చెందిన కారంగుల చంద్రయ్య ఎన్నికయ్యాడు.కాంగ్రెస్ కేవలం మూడు వార్డులలో విజయం సాధించింది. ఇక్కడ నోటాకు 6 ఓట్లు పడటం విశేషం.

చింతకాని మండలం పాతర్లపాడు గ్రామంలోనూ ఈ నెల 11వ తేదీన మొదటి విడతల్లోనే పంచాయతీ ఎన్నికలు జరిగాయి. పాతర్లపాడు గ్రామానికి చెందిన సిపిఎం రాష్ట్ర నాయకులు, ఆ గ్రామ మాజీ సర్పంచ్ సామినేని రామారావుని 31 అక్టోబర్ 2025న కాంగ్రెస్ గుండాలు హత్య చేశారని ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో గ్రామపంచాయతీ ఎన్నికలు వచ్చాయి. పాతర్లపాడు లో సీపీఐ(ఎం), బీఆర్ఎస్ కలిసి పోటీ చేశాయి. సీపీఐ(ఎం) సర్పంచ్ అభ్యర్థిగా ఓబినబోయిన లక్ష్మి పోటీ చేసింది. కాంగ్రెస్ అభ్యర్థిగా సామినేని రామారావు హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బొర్రా ప్రసాద్ భార్య ఉమ పోటీ చేసింది. ఎక్కడ మొత్తం 12 వార్డులు ఉన్నాయి. 11 వార్డులలో సీపీఐ(ఎం) పోటీ చేయగా ఒక వార్డులో మిత్రపక్షమేనా బీఆర్ఎస్ పోటీ చేసింది. సిపిఎం 10 వార్డులలో విజయం సాధించగా, ఒక వార్డులో మిత్రపక్షం విజయం సాధించింది. కేవలం ఒకే ఒక స్థానం కాంగ్రెస్ మిత్ర పక్షమైన టిడిపి గెలుచకుంది.

కాంగ్రెస్ కు ఒక్క వార్డు కూడా దక్కకపోవడం విశేషం. సిపిఎం అభ్యర్థులు ఒకటో వార్డులో 63 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. రెండవ వార్డ్ లో 97, మూడవ వార్డులో 57, నాలుగో వార్డులో 45, 5వ వార్డులో 51 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఏడవ వార్డులో 37, 8 వ వార్డులో 19, 10 వ వార్డులో 18, 11వ వార్డులో 9, 12 వ వార్డులో 70 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. సీపీఐ(ఎం) మిత్రపక్షమైన బిఆర్ఎస్ ఆరో వార్డులో 40 ఓట్ల మెజార్టీతో విజయం సాధించింది. పాతర్లపాడు లో మొత్తం 2,720 ఓట్లు ఉన్నాయి. మొత్తం 2,557 ఓట్లు పోలయ్యాయి. సీపీఐ(ఎం) అభ్యర్థికి 1532 ఓట్లు రాగా కాంగ్రెస్ అభ్యర్థికి 968 ఓట్లు వచ్చాయి. దీంతో సిపిఎం అభ్యర్థిని ఓబినబోయిన లక్ష్మి 567 భారీ ఓట్ల మెజార్టీతో విజయం సాధించింది. ఉప సర్పంచ్ గా సీపీఐ(ఎం)కి చెందిన 11వ వార్డు మెంబర్ దారెల్లి సురేష్ ఎన్నికయ్యాడు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -