కార్యకర్తల అభీష్టం మేరకే అధ్యక్షుల ఎంపిక
ఏఐసీసీ పరిశీలకులు బిస్వరంజన్ మహంతి
నవతెలంగాణ – మిర్యాలగూడ
దేశం కోసం, దేశ ప్రజల రక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ పుట్టిందని ఈ పార్టీపై ఇప్పుడు అధికారoలో ఉన్న ప్రభుత్వం కాంగ్రెస్ పై అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని ఏఐసీసీ పరిశీలకులు బిస్వరంజన్ మహంతి ఆరోపించారు. గురువారం స్థానిక రాజీవ్ భవన్ లో కాంగ్రెస్ పార్టీ నియోజవర్గ స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో ఎంతోమంది మహనీయులు దేశం కోసం ప్రాణ త్యాగాలు చేశారని గుర్తు చేశారు. అందులో ప్రధానంగా మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ వల్లభాయ్ పటేల్, మౌలానా ఆజాద్ వంటి మహనీయులు దేశం కోసం ప్రాణాలు అర్పించారని చెప్పారు. ఇప్పుడు అధికారంలో ఉన్న ఆ పార్టీ నాయకులు ఒక్కరైనా దేశం కోసం జైలుకు వెళ్లారా అని ప్రశ్నించారు.
కాంగ్రెస్ పార్టీపై కావాలనే అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేస్తామని కలలు గన్నా పార్టీలు ఇప్పుడు కనుమరుగయ్యే పరిస్థితి కనిపిస్తుందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలే పునాదులని అలాంటి కార్యకర్తలను కాపాడుకోవడంలో పార్టీ ముందుంటుందన్నారు. పారాచుట్లకు పార్టీలో అవకాశం ఉండదన్నారు. దేశవ్యాప్తంగా పార్టీ అధ్యక్షులు ను కార్యకర్తల అభిప్రాయాలు మేరకు ఎంపిక చేస్తున్నామని ఇది రాహుల్ గాంధీ ఆదేశం అని తెలిపారు. అందులో భాగంగానే తెలంగాణలోని అన్ని జిల్లాల అధ్యక్షుల పదవులకు దరఖాస్తుల స్వీకరిస్తున్నామని మెజార్టీ కార్యకర్తల అభిప్రాయాల మేరకు అధ్యక్షులను ఎన్నుకుంటామన్నారు. జిల్లా, మండల, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులను ఎన్నుకోనున్నట్లు తెలిపారు.
జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉందని ఎమ్మెల్యేలను ఎంపీలను అత్యధిక మెజార్టీతో ప్రజలు గెలిపించారని గుర్తు చేశారు. జిల్లాలో మరో 5 రోజులు పర్యటన చేస్తామని, అన్ని నియోజక వర్గాలలో సమావేశాలు జరిపి దరఖాస్తులు స్వీకరిస్తున్నామని తెలిపారు. తెలంగాణలో ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ,అభివృద్ధి పథకాలపై విసృత ప్రచారం చేయాలన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలన్నారు. ఎమ్మెల్సీ శంకర్ నాయక్ మాట్లాడుతూ పేదల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు అమలు చేసిన ఘనత కాంగ్రెస్కే దక్కుతుందన్నారు.
ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి మాట్లాడుతూ .. నియోజవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. పార్టీ కోసం పని చేసే కార్యకర్తలకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని పార్టీ పదవులలో వారికి ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు. పార్టీ బలోపేతం కోసం కృషి చేయాలని కోరారు. పార్టీలో ఉంటూ పార్టీకి ద్రోహం చేసే కార్యకర్తలకు తగిన గుణపాఠం చెప్తామని హెచ్చరించారు. అనంతరం దరఖాస్తులను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో టిపిసిసి ప్రధాన కార్యదర్శి వెంకట్, జిల్లా కాంగ్రెస్ మహిళ అధ్యక్షురాలు మాధవి కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.