– మీరు ధైర్యంగా ఉండాలి, ప్రభుత్వం ఆదుకుంటుంధి : కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతి
నవతెలంగాణ – కామారెడ్డి
కామారెడ్డి లోని వరద బాధితులు అధైర్య పడకుండా ధైర్యంగా ఉండాలని ప్రభుత్వం ఆదుకుంటుందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతి అన్నారు. ఆదివారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ముంపుకు గురి అయిన కాలనీల్లో ఆమె కాంగ్రెస్ ఎమ్మెల్సీలతో కలిసి సందర్శించారు. కామారెడ్డిలో ప్రజలు వరదలతో అల్లాడుతుంటే బీజేపీ ఏం చేస్తోందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతి ప్రశ్నించారు. ఎమ్మెల్సీలు అద్దంకి దయాకర్, శంకర్ నాయక్ , బల్మూరి వెంకట్, జిల్లా కలెక్టర్లతో కలిసి ఆదివారం కామారెడ్డి పట్టణంలో పర్యటించారు.
పట్టణంలోని వరద ముంపునకు గురైన జీఆర్ కాలనీ , కౌండిన్య, హౌసింగ్ బోర్డు కాలనీల్లో పర్యటించారు. జీఆర్ కాలనీలో ప్రతి ఇంటికి వెళ్లి బాధితుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వరదలకు గల కారణాలపై ఆరా తీశారు. వరదతో తీవ్రంగా నష్టపోయామని బాధిత కుటుంబాలు ఎమ్మెల్సీల బృందం ముందు కన్నీటి పర్యంతమయ్యాయి.వరదల్లో సర్వం కోల్పోయామని, ప్రాణాలతో బయట పడ్డామని ఆవేదనతో తన సమస్యలను వివరించారు. తమ విలువైన వస్తువులు, సర్టిఫికెట్లు, డాక్యుమెంట్లు తడిసి ముద్దయ్యాయన్నారు. వరదల సమయంలో డాబాలు, ట్యాంకులపై ఎక్కి ప్రాణాలు కాపాడుకున్నామని ఆవేదన వెలిబుచ్చారు.
ధైర్యంగా ఉండాలని, ప్రభుత్వం ఆదుకుంటుందని విజయశాంతి బాధిత కుటుంబాలను ఓదార్చారు. జీఆర్ కాలనీలో దాదాపు రెండు గంటల పాటు విజయశాంతి పర్యటించారు. కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్‌ను వరద నష్టం వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం పార్టీ జిల్లా కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ 2018 ఎన్నికల సమయంలో కామారెడ్డికి ప్రచారం నిమిత్తం వచ్చానని, అప్పుడున్న కామారెడ్డి, ఇప్పుడున్న కామారెడ్డిని చూస్తే బాధేస్తుందని ఎమ్మెల్సీ విజయశాంతి తెలిపారు. ఒక్కో ఆడబిడ్డ వారి పరిస్థితి చెబుతుంటే ఏం మాట్లాడాలో అర్థం కాలేదన్నారు. కాలనీ వాసుల పరిస్థితి చూసి కన్నీళ్లు వచ్చాయన్నారు. ప్రజల బాధ కళ్లారా చూశాక వారు అనుకున్న దానికన్నా ఎక్కువే ప్రభుత్వం ఇచ్చేలా చూస్తామన్నారు. ప్రజలు ఇంతలా అల్లాడుతుంటే బీజేపీ ఏం చేస్తోందని విజయశాంతి ప్రశ్నించారు.తెలంగాణలో 8 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలను ఇక్కడి ప్రజలు గెలిపించారని గుర్తు చేశారు. ఇలాంటి సమయంలో కేంద్రమే ముందుకు వచ్చి నష్టపరిహారం ఇస్తామని చెప్పాల్సిందని ఆమె పేర్కొన్నారు. బీజేపీ ప్రతినిధులను ప్రజలు గెలిపించింది జాలీగా కూర్చోవడానికి కాదని ఫైర్ అయ్యారు. స్థానిక ఎమ్మెల్యే తమకు ఇప్పటివరకు కనిపించలేదని కాలనీవాసులు చెబుతున్నారన్నారు.
బఫర్ జోన్‌పై (Buffer zone) విలేకరులు ప్రశ్నించగా గతంలో చేసిన తప్పుల వల్లే ఇళ్లలోకి నీళ్లు వచ్చాయన్నారు. మళ్లీ ఇలాంటివి జరగకుండా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంటుందని తెలిపారు. రాష్ట్రంలోని ఎమ్మెల్యేలు, ఎంపీలు పార్టీలకు అతీతంగా వరద ప్రాంతాల ప్రజలను ఆదుకునేందుకు తలా ఒక చేయి వేయాలని కోరారు. సినిమా ఇండస్ట్రీ నుంచి కూడా సహాయం చేయడానికి ముందుకు రావాలని సూచించారు. వరదల్లో ఇబ్బందులకు గురైన ఎమ్మెల్యే ప్రజలకు భరోసా ఇవ్వాల్సింది పోయి ప్రజలనే తప్పు పడతారా అని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ప్రశ్నించారు. వరదల విషయంలో రాజకీయం చేయొద్దని తాము అనుకున్నామని తెలిపారు. బీజేపీ, బీఆర్ఎస్ రాజకీయాలకు తెరలేపాయన్నారు. ప్రజలను తప్పుపట్టేలా ఎమ్మెల్యే వ్యాఖ్యలు సరికావని పేర్కొన్నారు. ఆ వ్యాఖ్యలు వెనక్కి తీసుకుని ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
ప్రజలకు అండగా నిలవాల్సిన బాధ్యత ఎమ్మెల్యేపై ఉందని గుర్తు చేశారు. తాము ప్రజలకు ధైర్యం చెప్పడానికే వచ్చామని, వారికి న్యాయం చేసే బాధ్యత తీసుకుంటామన్నారు. కామారెడ్డిలో ఇలాంటి ఘటన జరగడం బాధాకరమని, ఇక్కడి పరిస్థితులను పరిశీలించి నష్టంపై ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడం కోసమే తాము వచ్చామని ఎమ్మెల్సీ శంకర్ నాయక్ అన్నారు. ప్రజలను ఆదుకునేందుకు అధికారులు చాలా కష్టపడ్డారని కితాబిచ్చారు. తమ పార్టీ నాయకులు ప్రజలకు అండగా నిలిచారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలకు, ప్రజల అభివృద్ధి కోసం అండగా ఉంటుందని, బాధిత కుటుంబాలకు న్యాయం చేస్తుందన్నారు.
కిషన్ రెడ్డి , బండి సంజయ్ కేంద్ర మంత్రులుగా కాకుండా తెలంగాణ మంత్రులుగా మాట్లాడతారని విమర్శించారు. కేంద్రాన్ని రూ.10 వేల కోట్లు అడిగితే రూ.10 కోట్లు కూడా ఇస్తారన్న నమ్మకం లేదన్నారు. గుజరాత్‌లోని సబర్మతి కడితే దానిపై రూ.వేల కోట్లు ఖర్చు చేస్తారని విమర్శించారు. గణపతి బొప్పా మోరియా కావాలయ్యా యూరియా అని మాట్లాడే బీఆర్ఎస్కు కామారెడ్డి వద్దా అని ప్రశ్నించారు. సమావేశంలో డీసీసీ అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాస్ రావు, టీపీసీసీ జనరల్ సెక్రెటరీలు గిరిజ షెట్కార్, ఉప్పల శ్రీనివాస్ గుప్తా, జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి, జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు పాక జ్ఞానేశ్వరి, నాయకులు పాల్గొన్నారు.