– నయ వంచక కాంగ్రెస్ పాలనను ప్రజల్లో ఎండగట్టాలి
– ఇంటికి ఓటు అడగడానికి వచ్చే కాంగ్రెస్ నాయకులను నీలదీయండి
– స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేస్తే ఆ ఓట్లు మురిగిపోతాయి
– రాష్ట్రంలో కాంగ్రెస్, బిజెపి రెండు కలిసి పనిచేస్తున్నాయి
– మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి
నవతెలంగాణ-కమ్మర్ పల్లి
కాంగ్రెస్ బాకీ కార్డు లను ప్రజలకు విస్తృతంగా చేరవేయాలని బిఆర్ఎస్ పార్టీ శ్రేణులకు మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పిలుపునిచ్చారు. నయ వంచక కాంగ్రెస్ పాలనను ప్రజల్లో ఎండగట్టాలని, ఇంటికి ఓటు అడగడానికి వచ్చే కాంగ్రెస్ నాయకులను నీలదీయాలన్నారు.స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేస్తే ఆ ఓట్లు మురిగిపోతాయని పేర్కొన్న అయన రాష్ట్రంలో కాంగ్రెస్, బిజెపి రెండు కలిసి పనిచేస్తున్నాయన్నారు. వివిధ పథకాల ద్వారా ప్రజలకు కాంగ్రెస్ బాకీ పడ్డ డబ్బులు చెల్లిస్తేనే ఓటు వేస్తాం అని మీ ఇంటికి ఓటు అడగడానికి వచ్చే కాంగ్రెస్ నాయకులను నిలదీయాలని ప్రజలకు సూచించారు.బుధవారం వేల్పూర్ మండల కేంద్రంలోని కేసీఆర్ కాలనీలో జరిగిన మండల స్థాయి బిఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం, కాంగ్రేస్ బాకీ కార్డు పంపిణి ప్రారంబోత్సవ కార్యక్రమంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్బంగా ఎమ్మెల్యే వేముల మాట్లాడుతూ…కాంగ్రెస్ పాలనపై ప్రజలు అసంతృప్తిగా ఉన్నారని, ఇచ్చిన హామీలు నెరవేర్చలేదన్నారు. ప్రజలకు బాకీ ఉన్న హామీలను కాంగ్రెస్ బాకీ కార్డు రూపంలో ప్రజలందరికీ చేరవేయాలని కార్యకర్తలకు ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన నయవంచక హామీలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు “కాంగ్రెస్ బాకీ కార్డు ఉద్యమం” ను బాల్కొండ నియోజకవర్గం వ్యాప్తంగా విస్తృతంగా చేపడతామని ఎమ్మెల్యే అన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన 420 హామీలను పూర్తిగా మోసం చేసిందని, ప్రజలను మభ్యపెట్టిందని విమర్శించారు. ప్రజల పట్ల ఈ కాంగ్రెస్ మోసపూరిత వైఖరిని, వంచనను బయటపెట్టడానికి బీఆర్ఎస్ పార్టీ “బాకీ కార్డు” రూపంలో ప్రజల్లోకి తీసుకు వస్తోందని తెలిపారు.మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అనేక అడ్డగోలు హామీలు ఇచ్చి ప్రజలను నమ్మించి ఓట్లు వేయించుకొని గద్దె నెక్కిందన్నారు.
మేము అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే హామీలన్ని అమలు చేస్తామని ఎన్నికల్లో ప్రతి వేదికలో చెప్పారన్నారు.ప్రజలను నమ్మించడానికి మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గ్యారంటీ కార్డులను పంచి ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిందని విమర్శించారు.కాంగ్రేస్ పార్టీ అధికారంలోకి వచ్చి 22 నెలలు కావస్తుందనీ, ఏ ఒక్క హామీ కుడా సక్రమంగా అమలు చేయలేదన్నారు.పథకాల అమలు తక్కువ, ప్రచారం ఎక్కువ అన్న తీరున కాంగ్రెస్ పార్టీ పాలన సాగుతుందని విమర్శించారు.అనాడు ఎన్నికల్లో అనేక హామీలు ఇచ్చి వాటిని అమలు చేస్తాం అంటూ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా గ్యారంటీ కార్డులు ఇచ్చి మోసం చేసిందో ప్రజలకు వివరిస్తామన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేస్తే ఆ ఓట్లు మునిగిపోతాయన్నారు.
రాష్ట్రంలో కాంగ్రెస్, బిజెపి రెండు కలిసి పనిచేస్తున్నాయని పేర్కొన్నారు.కాంగ్రెస్ పార్టీని, రేవంత్ రెడ్డితో ప్రజల పక్షాన నీలదీసి కోట్లాడేది బిఆర్ఎస్ పార్టీ మాత్రమే అన్నారు.ప్రతి మహిళకు 2500 ఇస్తామని కాంగ్రెస్ హమీ ఇచ్చింది కానీ ఇప్పటి వరకు అమలు కాలేదని, 22 నెలలుగా 2500 చొప్పున 55000 కాంగ్రెస్ ప్రతి మహిళకు బాకీ పడిందని తెలిపారు.వృద్దులకు, బీడీ పెన్షన్ వాళ్లకు అధికారం లోకి రాగానే 4000 పెన్షన్ చేస్తాం అన్నారు. కానీ కేసీఆర్ ఇచ్చిన 2000 మాత్రమే ఇస్తున్నారు. 22 నెలలుగా వృద్ధులకు, బీడీ పెన్షన్ దారులకు కాంగ్రెస్ 44,000 బాకీ పడిందన్నారు.దివ్యంగులకు పెంచుతామన్న 6000 పెన్షన్ అమలు చేయక ప్రతి దివ్యంగునికి 44,000 కాంగ్రెస్ బాకీ పడ్డదని, రైతు భరోసా 15,000, కౌలు రైతులకు 19 వేలు, రుణమాఫీ 2,00,000 బాకీ ఉందన్నారు.బోనస్ ప్రతి ఎకరాకు 12500 చొప్పున నాలుగు పంటలకు 50,000 రైతుకు కాంగ్రెస్ బాకీ పడిందని,విద్యాభరోసా కార్డు 5,00,000 ఇస్తామన్నారు ఇవ్వలేదు.ఉపాధి హామీ కూలీలకు, ఆటో డ్రైవర్లకు సంవత్సరం కు 12,000 చొప్పున రెండు ఏండ్లకు 24,000 కాంగ్రెస్ బాకీ ఉందన్నారు.విద్యార్థులకు 2 లక్షల ఉద్యోగాలు, 22 నెలలుగా ఇవ్వని నిరుద్యోగ భృతి 88,000 కాంగ్రెస్ పార్టీ బాకీ పడ్డదన్నారు.ఇప్పటి వరకు పెళ్లిళ్లు అయినా ఆడబిడ్డలకు తులం బంగారం, విద్యార్థులకు స్కూటిలు, ఫీజు రియంబర్స్మెంట్ 8000 కోట్లు కాంగ్రెస్ పార్టీ బాకీ పెట్టిందన్నారు.
బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ రెండు ఏండ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం వివిధ పథకాలు ద్వారా ప్రజలకు ఎంత బాకీ పడిందో తెలిసేలా కాంగ్రెస్ బాకీ కార్డులను ప్రజలకు పంచుతామని ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి తెలిపారు.పార్టీ కార్యకర్తలు కాంగ్రెస్ బాకీ కార్డులను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని, ప్రజలకు కాంగ్రెస్ చేస్తున్న మోసాన్ని వివరిస్తూ అవగాహనా కల్పించాలని ఏమ్మల్యే కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. అనంతరం కెసిఆర్ కాలనీలో ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి స్వయంగా ఇంటింటికి వెళ్లి ప్రజలకు బాకీ కార్డులను పంపిణీ చేశారు.
