నవతెలంగాణ-హైదరాబాద్: ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(CWC) సమావేశం ప్రారంభమైంది. పార్టీ ప్రధాన కార్యాలయం ఇందిరా భవన్‌లో జరుగుతున్న ఈ భేటీకి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్, జైరాం రమేష్, దిగ్విజయ్ సింగ్, ఇతర సీనియర్‌లు.. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలు హాజరయ్యారు. చాలాకాలంగా కాంగ్రెస్ కీలక సమావేశాలకు సైతం దూరంగా ఉంటూ..తిరువనంతపురం ఎంపీ శశిథరూర్ ఎట్టకేలకు ఇవాళ సీడబ్ల్యూసీ భేటీకి హాజరయ్యారు.ఇందిరా భవన్ ప్రాంగణంలో కనిపించిన ప్రతీ ఒక్కరికీ షేక్‌హ్యాండ్ ఇస్తూ చిరునవ్వుతో పలకరించారాయన.
జాతీయ ఉపాధి హామీ పథకం పేరును వీబీ జీ రామ్ జీ మార్చడంపై కాంగ్రెస్ అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. మహాత్మా గాంధీ పేరును బీజేపీ ప్రభుత్వం తుడిచి వేసే ప్రయత్నం చేస్తుందని మండిపడుతోంది. ఈ నేపథ్యంలో.. ఈ అంశంపైనే దేశవ్యాప్త పోరాటాలు చేయాలని నిర్ణయించి.. ప్రణాళిక ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. దీనికి తోడు వివిధ రాష్ట్రాల్లో కొనసాగుతున్న ఎస్‌ఐఆర్, నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా కుటుంబంపై కేసులు, బంగ్లాదేశ్‌లో నెలకొన్న పరిస్థితులు, .. తదితర తాజా రాజకీయాంశాలపై, కేంద్ర ప్రజా వ్యతిరేక నిర్ణయాలపైనా సీడబ్ల్యూసీలో చర్చించనున్నట్లు సమాచారం.



