– ట్రంప్ షరతులకు తలొగ్గిన మోడీ..
– దేశంలోకి అమెరికా వ్యవసాయ ఉత్పత్తుల దిగుమతికి యత్నం: వ్యకాస ఆల్ ఇండియా ప్రధాన కార్యదర్శి బి. వెంకట్
నవతెలంగాణ-బీబీనగర్
కార్పొరేట్ వ్యవస్థకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆగస్టులో నిర్వహించనున్న క్విట్ కార్పొరేట్ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి బి.వెంకట్ పిలుపునిచ్చారు. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండల కేంద్రంలో గురువారం తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సమావేశానికి హాజరైన ఆయన అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మోడీ ప్రభుత్వం కార్పొరేట్లకు అనుకూలంగా వ్యవసాయ రంగంలో మార్పులు తీసుకొచ్చి.. సంపదను వారికి దోచి పెట్టే విధంగా వ్యవహరిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. పేదల సంపదను దోచుకుంటున్న కార్పొరేట్లను తరిమికొట్టి వ్యవసాయ రంగాన్ని కాపాడుకోవడంతోపాటు గ్రామీణ పేదలను రక్షించుకుందామని పిలుపునిచ్చారు. అమెరికా అధ్యక్షులు ట్రంప్ పెట్టిన షరతులకు తలొగ్గి.. ఆ దేశ వ్యవసాయ ఉత్పత్తులను మన దేశంలోకి ప్రవేశపెట్టడానికి ప్రధాని మోడీ ప్రయత్నిస్తున్నారని విమర్శించారు.
అమెరికా వ్యవసాయ ఉత్పత్తులు దేశంలోకి వస్తే ఇక్కడి రైతులు పండించే గోధుమలు, మొక్కజొన్న, ఇతర ఉత్పత్తుల కొనుగోళ్లు దెబ్బతింటాయని, మన ఆహార భద్రతకే ముప్పు ఏర్పడే పరిస్థితి ఉందని అన్నారు. మరోపక్క ఆహార భద్రతలో భాగంగా ఇకపై సరుకులు ఇవ్వకుండా నగదు బదిలీ చేయాలని చూస్తున్నారని చెప్పారు. అంబానీ, అదానీ ఆస్తులను మరింత పెంచడానికి మోడీ ప్రయత్నాలు కొనసాగిస్తున్నారని విమర్శించారు. వ్యవసాయ రంగంలోకి కార్పొరేట్ శక్తులు వస్తే తీవ్ర నష్టం జరుగుతుందని చెప్పారు. ఈ సమావేశంలో వ్యకాస రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు జి.నాగయ్య, వెంకట్రాములు, రాష్ట్ర ఆఫీస్ బేరర్స్ బుర్రి ప్రసాద్, బొప్పని పద్మ, నారి ఐలయ్య, పొన్నం వెంకటేశ్వరావు, కొండమడుగు నరసింహ తదితరులు పాల్గొన్నారు.
‘క్విట్ కార్పొరేట్’ను జయప్రదం చేయండి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES