Friday, March 13, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుఎలక్ట్రిక్‌ బస్సుల ముసుగులో ఆర్టీసీని ప్రయివేటీకరించే కుట్ర

ఎలక్ట్రిక్‌ బస్సుల ముసుగులో ఆర్టీసీని ప్రయివేటీకరించే కుట్ర

- Advertisement -

మహాలక్ష్మి పథకం కింద రూ.2,804 కోట్ల బకాయిలను విడుదల చేయాలి
ఆర్టీసీ కార్మికుల సమస్యలపై అసెంబ్లీలో నిలదీస్తా : మాజీమంత్రి హరీశ్‌రావు

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్ర ప్రజలకు నిరంతరం సేవలందిస్తున్న ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం అసెంబ్లీ వేదికగా ప్రభుత్వాన్ని నిలదీస్తానని బీఆర్‌ఎస్‌ఎల్పీ ఉపనేత, మాజీమంత్రి తన్నీరు హరీశ్‌రావు స్పష్టం చేశారు. మంగళవారం హైదరాబాద్‌లో టీజీఎస్‌ఆర్టీసీ జాయింట్‌ యాక్షన్‌ కమిటీ (జేఏసీ) నాయకులు ఆయన్ను కలిసి, ఆర్టీసీ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కార్మికుల పక్షాన నిలబడి, వారి సమస్యలను సభ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని హరీశ్‌రావు హామీ ఇచ్చారు. ఒకవైపు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి సంస్థను కాపాడుకోవాలని కార్మికులు పోరాడుతున్నారని అన్నారు.

కానీ రేవంత్‌రెడ్డి ప్రభుత్వం మాత్రం ఒక్కొక్క విభాగాన్ని ప్రయివేటీకరించేందుకు కుట్రలు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాలుష్య నియంత్రణ పేరుతో ఎలక్ట్రిక్‌ బస్సుల తయారీని కార్పొరేట్‌ శక్తులకు అప్పగించి, వారికే సబ్సిడీలు ఇస్తూ ఆర్టీసీని నిర్వీర్యం చేస్తున్నదని అన్నారు. ప్రయివేట్‌ కంపెనీలతో ఏకంగా రెండు వేల బస్సుల సరఫరాకు రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకున్నదని వివరించారు. ఎలక్ట్రిక్‌ బస్సుల ముసుగులో ఆర్టీసీని ప్రయివేట్‌ వ్యక్తులకు ధారాదత్తం చేయడానికి కాంగ్రెస్‌ సర్కార్‌ కంకణం కట్టుకున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్రం నుంచి వచ్చే సబ్సిడీలను నేరుగా ఆర్టీసీకే ఇప్పించి, సంస్థ సొంతంగా బస్సులు కొనుగోలు చేసుకునేలా పథకంలో సవరణలు చేయాలని కార్మికులు డిమాండ్‌ చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమన్నారు.

జీరో టికెట్‌ అమలు కోసం ప్రతినెలా రూ.350 కోట్లు చెల్లిస్తామంటూ ప్రభుత్వం చెప్పిందని గుర్తు చేశారు. ఇపుడు అరకొర నిధులు చెల్లించి చేతులు దులుపుకోవడం శోచనీయమని విమర్శించారు. గత రెండేండ్లుగా ఈ పథకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీకి చెల్లించాల్సిన బకాయిల భారాన్ని ఆర్టీసీపైనే మోపడం వల్ల సంస్థ ఆర్థికంగా కుదేలవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్టీసీ ఉద్యోగులకు ఇప్పటికీ రెండు పీఆర్సీలు పెండింగ్‌లో ఉన్నాయనీ, 2025 పీఆర్సీ సైతం అమలుకు నోచుకోకపోవడంతో కార్మికులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. రిటైర్డ్‌ అయిన ఉద్యోగులు క్రెడిట్‌ కో ఆపరేటివ్‌ సొసైటీలో దాచుకున్న పొదుపు మొత్తాలకు కాంగ్రెస్‌ ప్రభుత్వం 23 నెలలుగా వడ్డీ చెల్లించడం లేని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఉచిత ప్రయాణం పథకం సజావుగా సాగుతోందని డబ్బా కొట్టుకుంటున్న ప్రభుత్వం రద్దీకి సరిపడా కొత్త బస్సులు కొనడంలో, సిబ్బందిని నియమించడంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. సిబ్బంది కొరతతో ఉన్న కార్మికులపై తీవ్ర పని భారం పడుతోందనీ, ఆ ఒత్తిడి వల్ల కార్మికులు తీవ్రమైన అనారోగ్య సమస్యలకు గురవుతున్నారని వివరించారు. ఆర్టీసీ కార్మికుల సంక్షేమం, వారి హక్కుల పరిరక్షణ కోసం బీఆర్‌ఎస్‌ ఎల్లప్పుడూ అండగా ఉంటుందన్నారు. రూ.2,804 కోట్ల బకాయిలను తక్షణమే విడుదల చేసి ప్రభుత్వం చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి కోరారు. ప్రయివేటీకరణ ఆలోచనను విరమించుకోవాలనీ, కార్మికుల సమస్యలను రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో బలంగా బీఆర్‌ఎస్‌ పక్షాన వినిపిస్తామని అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -