నవతెలంగాణ-కోహెడ
కోహెడ మండలంలోని సముద్రాల గ్రామంలో మూడో విడత గ్రామపంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్న వేళ, మానవతా విలువలను చాటిన ఓ సంఘటన స్థానికంగా ప్రశంసలు అందుకుంది. సముద్రాల గ్రామానికి చెందిన ఉప్పరపల్లి రాజు అనే వ్యక్తి అంధుడైనప్పటికీ, తన ఓటు హక్కును వినియోగించుకోవాలనే సంకల్పంతో పోలింగ్ కేంద్రానికి వచ్చాడు.
ఈ క్రమంలో ఆయనకు ఓటు వేసేందుకు కానిస్టేబుల్ భూక్య రమేష్ మానవతా దృక్పథంతో సహకారం అందించారు. ఎన్నికల పోలింగ్ అధికారి (పీఓ) సమక్షంలో, గ్రామస్తుల జోక్యం లేకుండా, కానిస్టేబుల్ సహాయంతో ఉప్పరపల్లి రాజు తన ఓటు హక్కును వినియోగించుకున్నాడు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటు విలువైనదేనని మరోసారి నిరూపించిన ఈ సంఘటన పలువురిని ఆకట్టుకుంది. అంధుడైన ఓటరికి సహాయం చేసి ప్రజాస్వామ్య స్ఫూర్తిని చాటిన కానిస్టేబుల్ భూక్య రమేష్‌ను ఎస్సై అభిలాష్,గ్రామస్తులు, స్థానికులు అభినందించారు. మానవతా విలువలతో కూడిన పోలీసు సేవకు ఈ ఘటన ఉదాహరణగా నిలిచింది.



