నవతెలంగాణ-హైదరాబాద్: నేడు భారత రాజ్యాంగ దినోత్సవం. ఈ సందర్భంగా పత్రంలో పొందుపరిచిన రాజ్యాంగ విలువల్ని కాపాడుకోవాలని తమిళనాడు, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రులు స్టాలిన్, మమతాబెనర్జీలు ప్రజలకు పిలుపునిచ్చారు. భారతదేశం దాని ప్రజలందరికీ చెందినది. ఒక సంస్కృతికి లేదా ఒక భావజాలానికి చెందినది కాదు. ఈ రాజ్యాంగ దినోత్సవం నాడు, బాబాసాహెబ్ అంబేద్కర్ దార్శనికతను కుదించడానికి ప్రయత్నించే శక్తులను ప్రతిఘటించాలనే దృఢసంకల్పాన్ని ఆయన పునరుద్ఘాటించారు. మన రాజ్యాంగంలో పొందుపరచిన నిజమైన సమాఖ్యవాదాన్ని నిలబెట్టడానికి, ప్రతి రాష్ట్ర హక్కుల్ని కాపాడటానికి అవసరమైన ప్రతిదాన్ని మేము చేస్తాము అని స్టాలిన్ ఎక్స్ పోస్టులో పేర్కొన్నారు. మన రాజ్యాంగం పట్ల మనం చూపించే అభిమానం ఏమిటంటే.. న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సోదరభావం యొక్క వాగ్దానానికి భయపడే వారి నుండి మన గణతంత్రాన్ని రక్షించడమే అని స్టాలిన్ ఎక్స్ పోస్టులో తెలిపారు.
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ రాజ్యాంగ దినోత్సవం రోజున రాజ్యాంగ నిర్మాతలకు నివాళులర్పించారు. మన సంస్కృతులు, భాషలు, సమాజాల యొక్క అపారమైన వైవిధ్యాన్ని సమగ్ర, సమాఖ్యతను రాజ్యాంగం మొత్తంగా అద్భుతంగా ఒకదానికొకటి అల్లుతుంది. ఈ పవిత్ర రోజున మన రాజ్యాంగంలో పొందుపరిచిన ప్రధాన ప్రజాస్వామ్య విలువలకు, ఒక దేశంగా మనల్ని నిర్వచించే, నిలబెట్టే పవిత్ర సూత్రాలను అప్రమత్తంగా కాపాడుకోవడానికి మనం కట్టుబడి ఉండాలి. ఇప్పుడు ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉన్నప్పుడు లౌకికవాద ప్రమాదంలో ఉన్నప్పుడు సమాఖ్యవాదం అణగదొక్కబడుతున్న ఈ క్లిష్ట సమయంలో మన రాజ్యాంగం అందించే విలువైన మార్గదర్శకత్వాన్ని మనం కాపాడుకోవాలి అని సిఎం మమతాబెనర్జీ ఎక్స్‌లో పోస్టు చేశారు.


