Saturday, September 6, 2025
E-PAPER
spot_img
Homeజాతీయంవినియోగదారులకు ఫలాలు అందాలి

వినియోగదారులకు ఫలాలు అందాలి

- Advertisement -

కొనుగోళ్ళకు ఊతమివ్వనున్న జీఎస్టీ తగ్గింపులు
లేకపోతే జీఎస్టీ మార్పులు నిరుపయోగం
ఆర్థిక నిపుణుల విశ్లేషణ

జీఎస్టీ శ్లాబుల్లో తీసుకొచ్చిన మార్పులతో పలు వస్తువులు, సేవల ధరలు తగ్గనున్నాయని అంచనా. ఈ మార్పులు ఈనెల 22 నుంచి అమల్లోకి రానున్నాయి. దీంతో అందరి దృష్టి ఈ తేదీ మీదనే పడింది. ధరలు తగ్గనున్నా యన్న అంచనాల నేపథ్యంలో చాలా మంది వినియోగదారులు తమ కొనుగోళ్లను వాయిదా వేసుకుంటు న్నారు. అయితే తగ్గించిన ఈ జీఎస్టీ పన్నుల ఫలాలు అమ్మకందార్లు, ఉత్పత్తిదారులు, యజమానుల నుంచి కొనుగోలుదార్లు, వినియోగదారులకు అందాలని పలువురు ఆర్థిక నిపుణులు చెప్తున్నారు. అలా జరగకపోతే జీఎస్టీ మార్పులతో ప్రజలకు ఎలాంటి ప్రయోజనమూ ఉండదని అంటున్నారు. ఈ విషయంలో ప్రభుత్వం దృష్టిసారించాలని వారు సూచిస్తున్నారు.

న్యూఢిల్లీ :
ఎనిమిదేండ్ల అనంతరం చేపట్టిన వస్తు సేవల పన్ను (జీఎస్టీ) సంస్కరణలు రిటైల్‌ మార్కెట్లో ఉత్సాహాన్ని నింపే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆటో మొబైల్స్‌, వినియోగ వస్తువుల కొనుగోలు దారులకు భారీ ఉపశమనమే కలిగించనున్న దనే అంచనాలు వినబడుతున్నాయి. అదే సందర్భంలో కొన్ని శ్లాబుల్లో పెరుగుదల వస్త్ర పరిశ్రమను, విలాసవంతమైన కార్లు, విమానయాన రంగాన్ని కలవరపెడుతున్నది. అయితే ఈ కొత్త మార్పులు సెప్టెంబర్‌ 22 నుంచి అమల్లోకి రానున్నాయి. దీంతో కొనుగోలుదారులు చాలా మంది తమ కొనుగోళ్లను 22వరకు వాయిదా వేసుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయని విశ్లేషకులు చెప్తున్నారు.

ఆటోమొబైల్‌ కొనుగోళ్లపై ప్రభావం
దీని ఫలితంగా జీఎస్టీ తగ్గింపు జాబితాలో ఉన్న అనేక వినియోగ వస్తువులు ముఖ్యంగా ఆటోమొబైల్‌ తదితర వ్యవహారాలన్నీ దాదాపు నిలిచిపోనున్నాయని వాహనాల డీలర్లు అభిప్రాయపడుతున్నారు. చిన్నకార్ల ధరలు రూ.45వేల నుంచి రూ.50వేల వరకు తగ్గొచ్చని ఆటోమేకర్లు చెప్తున్నారు. ఇక మూడు చక్రాల వాహనాలు దాదాపు 8 శాతం చౌక ధరలకు లభించే అవకాశాలున్నాయి. ఈ సంస్కరణలలో ప్రకటించిన మార్పులు చిన్న వినియోగదారులను తక్కువ ధర కలిగి ఉండే వస్తు సేవలు సంతృప్తిపరిచేవిగా ఉన్నాయని విశ్లేషకులు చెప్తున్నారు. అయితే జీఎస్టీ తగ్గింపు ద్వారా కోల్పోయే రాబడిని కొన్ని ఇతర వస్తు సేవలను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావడం, విలాసవంతమైన వస్తు సేవలపై జీఎస్టీ రేట్లను పెంచడం ద్వారా భర్తీ చేయొచ్చు. పన్ను తగ్గింపు ప్రయోజనాలు కొనుగోలుదార్లకు అందేలా చేస్తే ఎయిర్‌ కండిషనర్లు, ఎలక్ట్రానిక్స్‌ ధరలు రూ.3వేల నుంచి రూ.5 వేల మధ్య తగ్గొచ్చని వినియోగదారుల వస్తు కంపెనీలు అంచనా వేస్తున్నాయి. అలాగే సబ్బులు, షాంపూలు వంటి బ్రాండెడ్‌ ప్యాకేజ్డ్‌ ఫుడ్‌, ఆరోగ్య, వ్యక్తిగత సంరక్షణకు సంబంధించిన వస్తువులకు సంబంధించి ఉత్పత్తిదారుల నుంచి వినియోగదారులకు జీఎస్టీ తగ్గింపు ప్రయోజనాలు అందితే అవి 8-9 శాతం చౌకగా లభించే అవకాశాలు కనబడుతున్నాయి. సాధ్యమైనంత త్వరగా జీఎస్టీ ప్రయోజనాలు వినియోగదారులకు దక్కేలా చూడటమే ప్రస్తుత ప్రాధాన్య అంశమని ఫిక్కీ ప్రెసిడెంట్‌ హర్ష అగర్వాల్‌ చెప్పారు.

ఇవి మరింత ప్రియం
ఇక రూ.2500 కంటే ఎక్కువ ధర ఉన్న దుస్తులు 12 శాతం నుంచి 18 శాతం శ్లాబులోకి రావటం వల్ల అవి మరింత ప్రియం కానున్నాయి. బిజినెస్‌ క్లాస్‌ విమాన ప్రయాణంపై జీఎస్టీ రేట్లు 18 శాతంలోకి రావటం ద్వారా అవి కూడా ఖరీదు కానున్నాయి. ఐపీఎల్‌ టక్కెట్లు 28 శాతం నుంచి 40 శాతం పన్నులోకి రావటంతో వాటికి రెక్కలు రానున్నాయి.

వీటిపై తగ్గిన జీఎస్టీ
ఇక వ్యక్తిగత వినియోగం కోసం ఉపయోగించే మందులు ఇతర సామాగ్రిపై జీఎస్టీని 18 శాతం నుంచి 5 శాతానికి కుదించారు. విద్యాసంబంధిత స్టేషనరీ ఇతరత్రా వస్తువులపై 12 శాతం నుంచి ఐదు లేదా సున్నా శాతానికి తగ్గించారు. కొన్ని రకాల పండ్లపై 12 శాతం నుంచి ఐదు శాతానికి, వెజిటబుల్‌ ప్రొడక్ట్స్‌పై 18 శాతం నుంచి ఐదు శాతానికి, రిఫైన్డ్‌ షుగర్‌ పైన 12 శాతం నుంచి ఐదు శాతానికి జీఎస్టీ తగ్గింది. చాక్లెట్‌లు, కోకకోలా ఉత్పత్తులు, టాల్కంపౌడర్‌ లాంటివీ, నూనెలు, షాంపూలు టూత్‌బ్రష్‌లపై 18 శాతం నుంచి ఐదు శాతానికి తగ్గించారు. దువ్వెనలూ, డైపర్స్‌, చేతి రుమాళ్ళు వంటి వాటిపై 12 నుంచి ఐదు శాతానికి జీఎస్టీ శ్లాబు తగ్గింది.

జీవిత బీమాకు ధీమా
ఏటా పది లక్షల కోట్ల రూపాయల మేర జరిగే లైఫ్‌ ఇన్సూరెన్స్‌ మార్కెట్‌కు ఈ జీఎస్టీ మిన హాయింపు ఊరటనిచ్చే అంశం. లైఫ్‌ ఇన్సూరెన్స్‌ ప్రీమియంపై జీఎస్టీ వేయడం ద్వారా ముఖ్యంగా సింగిల్‌ ప్రీమియం చెల్లించే పాలసీదారులు తీవ్ర నిరాశలో ఉండేవారు. అయితే ఇప్పుడు దానిని మినహాయించటంతో ఆ తరగతి సంతృప్తి పడనున్నది. అయితే వ్యక్తిగత లైఫ్‌, మెడికల్‌ ఇన్సూరెన్స్‌కు మాత్రమే వర్తింపజేసి జనరల్‌ ఇన్సూరెన్స్‌ను, గ్రూప్‌ ఇన్సూరెన్స్‌ను ఇంకా జీఎస్టీ పరిధిలో కొనసాగిస్తున్నారు.
అదే విధంగా నాలుగు మీటర్ల పొడవు గల కార్లు లేదా పెట్రోల్‌ ఇంజిన్‌ అయితే 1200 సీసీ, డీజిల్‌ ఇంజిన్‌ అయితే 1500 సీసీ కలిగిన కార్లపై, 350 సీసీ కలిగిన ద్విచక్ర వాహనాలపై ప్రస్తుతమున్న 28 శాతం జీఎస్టీ శ్లాబ్‌ను 40 శాతానికి పెంచడం జరిగింది. సిగరెట్లపై 28 శాతం నుంచి వు 40 శాతానికి పెంచగా.. బీడీలపై 20 శాతం నుంచి 15 శాతానికి తగ్గించారు. ఎయిర్‌ కండిషనర్లు, డిష్‌ వాషర్లు, టెలివిజన్‌ వంటి వాటిపై జీఎస్టీ 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గింది.

జీఎస్టీతో ముక్కుపిండి మరీ వసూలు
ఇప్పుడు తగ్గించిన ఈ శ్లాబ్‌ రేట్లను బట్టి కేంద్రం గతంలో అనవసరంగా ఎక్కువ మొత్తంలో జీఎస్టీ వసూలు చేసిందన్నది కూడా రుజువైందని చెప్తున్నారు. జీఎస్టీ తగ్గించాలని కేంద్రంపై ఒత్తిడి పెంచేలా ప్రజా సంఘాల పోరాటాలు తీవ్రం కావటంతో మోడీ సర్కారు దిగొచ్చిందని గుర్తు చేస్తున్నారు. అయితే దేశ ఆర్థిక వ్యవస్థ మందగించడానికి పరోక్ష పన్నుల రూపంలో అధిక జీఎస్‌టీ ఒక కారణమేనంటూ విశ్లేషకులు చెప్తున్నారు. కోవిడ్‌ ప్రారంభం కన్నా ముందున్న గిరాకీలు లేకపోవడానికి జీఎస్టీ ముఖ్య కారణమని చాలా మంది వస్తుత్పత్తిదారులు వాపోతున్నారు. 2017లో జీఎస్టీ అమలు జరిగినప్పుడు మొదటినెల రూ.50,000 కోట్ల రూపాయలు రాగా సరిగ్గా ఎనిమిదేండ్లు తిరిగే సరికి అది రూ. 2,00,000 కోట్లకు చేరింది. అంటే.. ప్రభుత్వం పలు దఫాలుగా జీఎస్టీ పరిధిని విస్తరించడం, పన్ను శ్లాబ్‌లలో వినియోగ అంశాలను చేర్చడంతో వినియోగదారుల జేబులకు చిల్లుపడింది.

ఇది తాత్కాలిక ఉపశమనం మాత్రమే..
ఇప్పుడు తగ్గించిన జీఎస్టీ పన్నుల ఫలాలను వస్తు సేవలనందించే యజమానులు (అమ్మకందార్లు) వినియోగదారునికి పార నివ్వకపోతే ఎలాంటి ఉపయోగమూ ఉండ దని నిపుణులు చెప్తున్నారు. ఇలాంటి వాటిపై సరైన దృష్టి పెట్టకపోతే, ప్రభుత్వం జీఎస్టీ తగ్గించి కూడా ప్రజలకు మేలు చేయనట్లే అవుతుందని అంటున్నారు. వినియోగదారులు, సాధారణ ప్రజలకు ప్రయోజనాలను చేకూర్చని జీఎస్టీ ఫలితాలు కాగితాలకే పరిమితమయ్యే ప్రమాదమున్నదని హెచ్చరిస్తున్నారు. తగ్గిన జీఎస్టీతో అమ్మకాలు మరింత పెరిగి వినియోగదారుల కన్నా ఉత్పత్తిదారులకు ఎక్కువ ప్రోత్సాహకంగా ఉండనున్నదని విశ్లేషకులు చెప్తున్నారు. అయితే ఎప్పుడో చేపట్టవలసిన ఈ జీఎస్టీ మినహాయింపులు, తగ్గింపులు వినియోగదారులకు తాత్కాలిక ఉపశమనాలే తప్ప పన్ను విముక్తి కాదన్నది ఆర్థిక నిపుణుల అభిప్రాయం.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad