Monday, October 20, 2025
E-PAPER
Homeప్రధాన వార్తలు21 ఏండ్లకే ఎమ్మెల్యేగా పోటీ

21 ఏండ్లకే ఎమ్మెల్యేగా పోటీ

- Advertisement -

రాజ్యాంగ సవరణపై అసెంబ్లీలో తీర్మానం చేస్తాం
‘జూబ్లీ’ ఎన్నికలపై బీజేపీ, బీఆర్‌ఎస్‌ చీలిక కుట్రలు
వాటిని తెలంగాణ సమాజం తిప్పికొట్టాలి
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు రాకపోవడానికి ఆ రెండు పార్టీలే కారణం
చార్మినార్‌ వద్ద రాజీవ్‌గాంధీ సద్భావన
యాత్ర సంస్మరణ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
సల్మాన్‌ ఖుర్షీద్‌కు రాజీవ్‌ గాంధీ సద్భావన అవార్డు ప్రదానం

నవతెలంగాణ-సిటీబ్యూరో/ధూల్‌పేట
పద్దెనిమిది ఏండ్లకే ఓటు హక్కును కల్పించి దేశ అభివృద్ధిలో యువతను భాగస్వామ్యం చేసిన మహనీయుడు రాజీవ్‌ గాంధీ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. అదే స్ఫూర్తితో 21 ఏండ్లకే శాసనసభ్యుడిగా పోటీ చేసే అవకాశం కల్పిస్తూ రాజ్యాంగ సవరణ తీసుకు రావాల్సిన అవసరం ఉందన్నారు. దానిపై అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపుతామని అన్నారు. హైదరాబాద్‌లోని చార్మినార్‌ వద్ద రాజీవ్‌ గాంధీ సద్బావన యాత్ర స్మారకోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా పీసీసీ అధ్యక్షుడు మహేష్‌ కుమార్‌ గౌడ్‌ పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం కేంద్ర మాజీ మంత్రి సల్మాన్‌ ఖుర్షిద్‌కి ”రాజీవ్‌ గాంధీ సద్భావన అవార్డు”ను ప్రదానం చేశారు.

అనంతరం సీఎం మాట్లాడుతూ దేశంలో గాంధీ అనే పదం భారతదేశానికి పర్యాయపదం అనీ, గాంధీ కుటుంబం దేశానికి స్పూర్తినిచ్చిందన్నారు. దేశ సమగ్రతను కాపాడేందుకు ఇందిరా గాంధీ ప్రాణాలర్పించారనీ, దేశం కోసం మూడు తరాలు ప్రాణాలర్పించిన చరిత్ర గాంధీ కుటుంబానిదన్నారు. దేశ సమగ్రతను కాపాడేందుకు ఆనాడు రాజీవ్‌ గాంధీ సద్భావన యాత్ర చేశారనీ, ఆయన స్ఫూర్తిని కొనసాగించేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. సల్మాన్‌ ఖుర్షీద్‌కి రాజీవ్‌ సద్భావన అవార్డ్‌ అందించడం అందరికీ గర్వకారణం అన్నారు.

రాజీవ్‌ స్ఫూర్తితో రాహుల్‌ గాంధీ దేశ సమగ్రత కోసం భారత్‌ జోడో యాత్ర చేశారని అన్నారు. రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ బీజేపీకి బీ టీమ్‌గా మారిందనీ, గత పార్లమెంట్‌ ఎన్నికల్లో ఈ రెండు పార్టీల మధ్య రహస్య ఒప్పందం జరిగిందన్నారు. గత పార్లమెంట్‌ ఎన్నికల్లో 21 శాతం బీఆర్‌ఎస్‌ ఓట్లు ఎవరికి చేరాయనీ, ఇప్పుడు జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలోనూ అదే చేయాలని కుట్రలు చేస్తున్నారన్నారు. వచ్చే ఎన్నికల్లోనూ ఓట్లు చీల్చాలని ఇప్పటి నుంచే కుట్ర చేస్తున్నారన్నారనీ, ఈ కుట్రలను తెలంగాణ సమాజం తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు రాకపోవడానికి కూడా ఆ రెండు పార్టీలే కారణమన్నారు.ఈ కుట్రలను దృష్టిలో పెట్టుకుని తెలంగాణను అభివృద్ధివైపు నడిపిద్దామని అన్నారు.

సెక్యులరిజానికి కట్టుబడ్డ కాంగ్రెస్‌ : మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
మతసామరస్యానికి గాంధీ కుటుంబం, కాంగ్రెస్‌ పార్టీ అంకిత భావంతో పని చేసిందనీ, సెక్యులరిజానికి కాంగ్రెస్‌ పార్టీ కట్టుబడి ఉందని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్‌ ఎన్‌.ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి అన్నారు. 35 ఏండ్లుగా నిరంజన్‌ నేతత్వంలో రాజీవ్‌ గాంధీ సద్బావన స్మారకోత్సవం నిర్వహించడం అభినందనీయం అన్నారు. కాంగ్రెస్‌ 42శాతం రిజర్వేషన్లకు కట్టుబడి ఉందనీ, కొన్ని న్యాయపరమైన చిక్కులు ఎదురైనా అమలు చేయాలన్నదే తమ ప్రభుత్వ సంకల్పం అన్నారు.

ఈ రిజర్వేషన్ల ప్రక్రియను అడ్డుకుంటున్నదెవరో చైతన్యవంతమైన సభ్య సమాజం గుర్తించాలన్నారు. పదేండ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో రాజీవ్‌ గాంధీ సద్బావన యాత్ర స్మారోకోత్సవ సభలకు అనేక ఆటంకాలు ఎదురయ్యాయని అన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, మాజీ ఎంపీ వి.హనుమంతరావు, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌ అలీ, ప్రభుత్వ సలహాదారులు హర్క వేణుగోపాల్‌ రావు, ప్లానింగ్‌ కమిషన్‌ వైస్‌ చైర్మెన్‌ చిన్నారెడ్డి, ఎమ్మెల్యే మదన్‌ మోహన్‌, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్‌, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -