ఒక కవిని అంచనా వేయడానికి మనకున్న తూనికరాళ్ళు ఏమిటనే ప్రశ్న మనసులో మెదిలినపుడు, దాని తాలూకు అలజడి కొంతకాలం నిలువనీయకుండా చేస్తది. ఒక మెతుకు చూసి బువ్వ ఉడికిందనే నిర్ధారణను కవిత్వానికి అన్వయించ గలమా? ఒకసారి నానబాల పడిన (సగం ఉడికి, సగం ఉడకని) అన్నం మెతుకును పట్టిచూసి కవిని మూల్యాంకనం చేయగలమా? విద్యార్థుల ప్రగతిని అంచనావేయడానికైనా, ఒక కవి యొక్క కవిత్వాన్ని గురించి మాట్లాడటానికైనా ఒకే ఒక సరియైన పద్ధతి నిరంతర సమగ్ర మూల్యాంకనం (CCE – Continuous Comprehensive Evaluation).
దశల వారీగా, నిర్మాణాత్మకంగా వివిధ కాలవ్యవధులలో రాసిన కవిత్వాన్ని ఎప్పటికప్పుడు అసెస్ (Assess) చేస్తేనే కవి యొక్క నాడీని పట్టుకోగలుగుతాం. కవులు, వారు రాసే కవిత్వం ఎల్లకాలం స్థిరంగా వుండదు. నిరంతరం చలన సహితమై ప్రవహిస్తూనే వుంటది. కవులకు వారి వారి అభిరుచులు, యిష్టాయిష్టాలు ప్రకారం ఏర్పర్చుకున్న దృక్పథంలోంచి వారి ‘వస్తువు’ తలెత్తి తొంగిచూస్తది. ఏ రకమైన వస్తువుల్ని ఎంచుకుని కవిత్వ సాధన చేస్తున్నరో దాన్ని ఆధారంగా చేసుకుని కవిని, తన దృక్పథాన్ని, కవిత్వస్థాయిని నిర్ణయించే సౌలభ్యం వుంటది.
నిరంతరం తనను తాను పుటం పెట్టుకుంటూ, తన లోని Ductility (సన్నని తీగలుగా మార్చే లోహధర్మం) ని, Malleability (సన్నని రేకులుగా మార్చే లోహధర్మం)ని సరిచూసుకుంటూ పరిణతి వైపు తన కవిత్వాన్ని సాగదీసుకుంటున్న కవి గన్నోజు ప్రసాద్. ‘తొలిపొద్దు’ తో ఉదయించిన కవి. ‘గాయమెరుగని సముద్రం’, ‘శిలాక్షరం’, ‘వెన్నెల్లో చీకటి’ మొ.న కవిత్వ సంపుటులతో తనదైన కవిత్వ ప్రయాణాన్ని సులభతరం చేసుకుంటున్న కవి. మనుషులు, మనస్తత్వాలు, మానవ సంబంధాలు, వారి జీవన పోరాటాలు, సాధకబాధకాలు, జీవిక కోసం చేసే పడరానిపాట్లు, ప్రకతి, పర్యావరణం, బడిపిల్లలు, రైతులు, పుస్తకాలు, స్నేహం, పల్లెతనం, సామాజిక స్పహ, ఆధునీకరణ వంటి అంశాల చుట్టూ తన కవిత్వ వస్తువును పరిభ్రమణం చెందిస్తడు. భౌతిక ప్రపంచంలోని వస్తువుల్ని కవిత్వం చేయడం నుండి క్రమంగా మానసిక ప్రపంచంలోంచి మొత్తం జీవితాన్ని చూస్తూ నిర్వచించే దశకు తన వస్తువును చేర్చడం వరకు అనేక ఒడిదుడుకులతో సాగిన తన తీరుతెన్నులు కవిత్వ పరిణామక్రమాన్ని విశదపరిచేలా వుంటది.
ఏమున్నది నాకీడీ
ఈ నేలపై నాకేమున్నది? భూమిని వేలాడుతున్న కాళ్లు తప్ప ముక్తి కోసం నింగికి చేతులు చాచే ఆశ తప్ప!
ఇంకేముంది నాకు నేలపై? నిశ్శబ్ద గొంతుక శాంతి కపోతమై భూగోళం చుట్టూ రెక్కలూపుతూ సమాజ హితం కోసం కలం పట్టే ఆశ తప్ప!
ఏముంది నాకీడ నేలపై? ఎడారి మనసులో ముసుగేసుకుని మిగిలున్న ఇసుక గూడును నిలుపుకోవాలని ఆశ తప్ప! నేనేడున్న ఈ నేలపై?
కండ్ల ముందు పరుచుకున్న చీకటి ఇంట్లో చంద్రున్ని నిలుపాలన్న ఆశ తప్ప!
కవిత్వంలో ”refrain’ అనేది సరికొత్త టెక్నిక్ కాకపోయినప్పటికీ ఈతరం కవులు సుత రిథమ్, లయను ఆసరాగా చేసుకుని రిపిటేషన్ ను బట్టి చెప్పే విషయ ప్రాధాన్యతను పాఠకుడు గుర్తించగలిగేలా భావవ్యక్తీకరణను తీర్చిదిద్దుతున్నరు. ఏముంది? అన్న పశ్న, ‘ఆశ తప్ప!” అనే సమాధానం పునరావతం కావడమనే ఫ్రేములో కవి తన భావాన్ని, భావనలను ఇమిడ్చే ప్రయత్నం చేసిండు. కవి ఎంచుకున్న ఫ్రేమ్ చాలా పాతది. సరికొత్తదనానికి పాత ఫ్రేమ్స్ లేకపోవడమే మంచిది. ఇట్ల చెప్పితే బాగుంటుందనే ఆలోచన, ముందుతరం కవుల శైలీ అనుసరణ యిందులో కనిపిస్తది. అనుసరణలో వైవిధ్యాన్ని, ఇట్లా కాకుండా చెబితే ఎట్లుంటది? అనే ఆలోచన వైపుగా దష్టిసారించాలి.
”కండ్లముందు పరుచుకున్న చీకటి ఇంట్లో చంద్రున్ని నిలుపాలి”
అని వాక్యాన్ని సవరించి రాసినా అర్థం మారదు. కవి తనను తాను ప్రశ్నించుకునే, పరిశీలించుకునే, అంత: పరీక్షణ (Introspection)) కు ఈ కవితలో అవకాశం కల్పించిండు. ఇక్కడ ‘ఆశ’ అనే పదం రాకుండా -ఆశ ‘ను వ్యక్తపరిచేలా వాక్య నిర్మాణాన్ని సాధన చేయొచ్చు.
జీవితంలోని పరిమితులను ఇవి తప్ప ఇంకేమీ లేని బతుకు మాధుర్యాన్ని చెబుతూ కొంత నిరాశాజనకమైన మనస్తత్వ ధోరణిలో ఈ కవిత సాగింది. కవి వాడిన టెక్నిక్ తో పాటు చాలా రకాలుగా కవితను నడిపించే అవకాశం వుంది. ఎంపికలో మొదటి ప్రాధాన్యతపు టెక్నిక్ ను గుర్తించగలిగితే, అందుకోగలిగితే ‘వస్తువు’కు కవిత్వ శాశ్వతత్వం చేకూరుతది. కవిత్వ సాధన పట్ల కవి గన్నోజు ప్రసాద్ పరిశ్రమకు శుభాకాంక్షలు.
– బండారి రాజ్ కుమార్, 8919556560



