Tuesday, November 18, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంకేసులున్న కంపెనీకి రూ.కోట్ల కాంట్రాక్టులా?

కేసులున్న కంపెనీకి రూ.కోట్ల కాంట్రాక్టులా?

- Advertisement -

కేఎల్‌ఎస్‌ఆర్‌ ఇన్‌ఫ్రాటెక్‌తో సీఎం రేవంత్‌ సంబంధాలపై అనుమానం : బీఆర్‌ఎస్‌ అధికార ప్రతినిధి మన్నె క్రిశాంక్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

ఇన్సాల్వెన్సీ కేసులు ఉన్న కంపెనీకి రూ.కోట్ల కాంట్రాక్టులను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కట్టబెట్టడంపై అనేక అనుమానాలున్నాయని బీఆర్‌ఎస్‌ అధికార ప్రతినిధి మన్నె క్రిశాంక్‌ చెప్పారు. కేఎల్‌ఎస్‌ఆర్‌ ఇన్‌ఫ్రాటెక్‌ సంస్థతో సీఎంకు అనుబంధం ఏంటో చెప్పాలని సూటిగా ప్రశ్నించారు. సోమవారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్‌ ప్రభుత్వం కేఎల్‌ఎస్‌ఆర్‌ ఇన్‌ఫ్రాటెక్‌ సంస్థకు అసాధారణ ప్రాధాన్యత ఇస్తూ భారీ స్థాయిలో కాంట్రాక్టులను కట్టబెట్టిందని ఆరోపించారు. ఈ సంస్థకు ఇన్సాల్వెన్సీ, బ్యాంక్రప్సీ సంబంధిత కేసులున్న నేపథ్యంలో కూడా వరుసగా రూ.కోట్ల ప్రాజెక్టులు ఇవ్వడంతో ప్రభుత్వంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయని చెప్పారు. ఈనెల 14న సుప్రీంకోర్టు ఈ కంపెనీకి సంబంధించిన కేసును స్వీకరించిందని గుర్తు చేశారు. నేషనల్‌ కంపెనీ లా ట్రిబ్యునల్‌లో ఒక జడ్జీపై అనుకూలంగా ఆదేశాలు ఇవ్వాలంటూ పైస్థాయి నుంచి ఒత్తిడి తెచ్చారని అన్నారు. సుప్రీం ఈ అంశాన్ని అత్యంత తీవ్రంగా పరిగణనలోకి తీసుకుందని చెప్పారు. తీవ్రమైన ఆర్థిక ఆరోపణలున్న ఆ కంపెనీకి రాష్ట్ర ప్రభుత్వం కాంట్రాక్టులను కట్టబెట్టి ప్రజాప్రయోజనాలను ప్రశ్నార్థకంగా మార్చిందని అన్నారు. కొడంగల్‌లో న్యూ కాలేజ్‌ ఆఫ్‌ వెటర్నరీ సైన్స్‌ నిర్మాణానికి రూ.145 కోట్లు, వికారాబాద్‌ రోడ్ల నిర్మాణం కోసం రూ.185 కోట్లు, బషీరాబాద్‌ నుంచి మైలావర్‌ వరకు రోడ్‌ నిర్మాణానికి రూ.116 కోట్లు, పాలేరు లిఫ్ట్‌ ఇరిగేషన్‌ స్కీమ్‌కు రూ.191 కోట్లు, రాజీవ్‌ గాంధీ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ స్కీమ్‌, సూర్యాపేటకు రూ.319 కోట్లు, హెచ్‌ఎండబ్ల్యూఎస్‌ఎస్‌బీ పైప్‌లైన్‌ రిమైనింగ్‌ పనులకు రూ.168 కోట్లు, యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ స్కూల్స్‌ కాంట్రాక్టులను ఇచ్చారని వివరించారు. గతంలో ఈ సంస్థ సీఎం రేవంత్‌రెడ్డికి ల్యాండ్‌ క్రూజర్‌ వాహనం బహుమతిగా ఇచ్చిందని చెప్పారు. ఆ వాహనం ఆయన సోదరుడి పేరుతో రిజిస్టర్‌ చేశారని వివరించారు. ఈ సంస్థను రేవంత్‌రెడ్డి బినామీ కంపెనీగా ఈడీ పేర్కొందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వరుసగా కాంట్రాక్టులు ఇవ్వడం వెనుక ఎవరి ప్రయోజనాలు దాగి ఉన్నాయో ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -