– పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిన పారిశ్రామికవేత్తలు
– వివిధ సంస్థలతో సీఎం రేవంత్‌రెడ్డి ప్రత్యేకంగా సమావేశం
– ట్రంప్ మీడియా రూ. లక్ష కోట్ల పెట్టుబడులు: సంస్థ డైరెక్టర్ ఎరిక్
– రూ.25 వేల కోట్లతో గ్రీన్ డేటా సెంటర్ల ఏర్పాటు: అదానీ గ్రూప్
– సింగపూర్‌కు చెందిన ఏజీఐడీసీ కంపెనీ రూ.70వేల కోట్ల పెట్టుబడులు
– ఫ్యూచర్ సిటీలో వంతారా జూపార్క్
– ముఖ్యమంత్రి సమక్షంలో 35 ఎంవోయూలు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ తొలి రోజు భారీగా ఎంవోయూలు కుదిరాయి. డీప్ టెక్నాలజీ, గ్రీన్ ఎనర్జీ, ఏరోస్పేస్ తదితర రంగాల్లో వివిధ కంపెనీలతో రూ.1.88 లక్షల కోట్ల మేర ప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకుంది. డీప్ టెక్నాలజీ రంగంలో రూ.75 వేల కోట్లు, గ్రీన్ ఎనర్జీ రంగంలో రూ.27 వేల కోట్లు, పునరుత్పాదక రంగంలో రూ.39,700 కోట్లు, ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాల్లో రూ.19,350 కోట్లు, ఏవియేషన్ రంగంలో జీఎంఆర్ గ్రూప్‌తో రూ.15 వేల కోట్లు, తయారీ రంగంలో రూ.13,500 కోట్లు, ఉక్కు రంగంలో రూ.7 వేల కోట్లు, టెక్స్‌టైల్ రంగంలో రూ.4 వేల కోట్ల మేర ఒప్పందాలు కుదిరినట్టు ప్రభుత్వం వెల్లడించింది. కొరియా ప్రతినిధులతో సీఎం రేవంత్‌రెడ్డి సమావేశమై, ఎలక్ట్రానిక్స్, గ్రీన్ ఎనర్జీ రంగాల్లో పెట్టుబడులపై చర్చించారు. ట్రంప్ మీడియా,. అమెజాన్ ప్రతినిధులతో భేటీ అయ్యారు. అమెజాన్ సంస్థ తెలంగాణలో లాజిస్టిక్స్, రిటైల్ రంగాల్లో విస్తరణపై ఆసక్తి చూపింది. ఐకియా సంస్థ ప్రతినిధులతో సమావేశమై, టెక్స్‌టైల్స్, ఫర్నీచర్ తయారీ రంగాల్లో ఎంఎస్‌ఎంఈ భాగస్వామ్యంపై చర్చించారు. వియత్నాంకు చెందిన ప్రముఖ సంస్థ విన్ గ్రూప్ ప్రతినిధులతో సమావేశమై, ఎలక్ట్రిక్ వాహ నాలు, హెల్త్‌కేర్ రంగాల్లో పెట్టుబడులపై చర్చించారు. ఎలక్ట్రానిక్స్ రంగ ప్రతినిధులతో రౌండ్ టేబుల్ సమావేశంలో ఫ్యూచర్ సిటీలో మాన్యు ఫ్యాక్చరింగ్ హబ్ స్థాపనపై చర్చించారు. ఎస్‌ఐడీబీఐ వరల్డ్ బ్యాంక్, వెస్ట్రన్ యూనియన్ ప్రతినిధులతో సమావేశమై, స్టార్టప్ ఫండింగ్, యూనివర్సిటీ ఆఫ్ లండన్‌తో ఉన్నత విద్యా భాగస్వామ్య ఎంవోయూ కుదిరింది. సింగపూర్‌కు చెందిన ఏజీఐడీసీ కంపెనీ రూ.70వేల కోట్లతో ఒప్పందం కుదుర్చుకున్నట్టు మంత్రి ఉత్తమ్ తెలిపారు. ఈ సంస్థ ఏఐ ఆధారిత డేటా సెంటర్లు ఏర్పాటు చేస్తుందన్నారు. వియ త్నాంకు చెందిన విన్ గ్రూప్‌తో రూ.27వేల కోట్ల ఒప్పందం జరిగిందన్నారు. ఈ సంస్థ రాష్ట్రంలో సోలార్‌ప్లాంట్లు, ఈవీ, ఎనర్జీ స్టోరేజీ ఏర్పాటు చేయనుంది.
రూ.25వేల కోట్లతో గ్రీన్‌డేటా సెంటర్ : కరణ్ అదానీ
దేశంలోనే అతి పెద్ద కార్పొరేట్ సంస్థ అయిన అదానీ గ్రూప్ తెలంగాణలో భారీ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది. రూ.25వేల కోట్లతో 48 మెగావాట్ల గ్రీన్ డేటా సెంటర్ ఏర్పాటు చేస్తామని అదానీ పోర్ట్స్ అండ్ సెజ్ ఎండీ కరణ్ అదానీ గ్లోబల్ సమ్మిట్ మొదటి రోజు ప్రకటించారు. తెలంగాణ విజన్‌ను ఈ సమ్మిట్ ప్రతిబింబిస్తోందని అన్నారు. ”రాష్ట్రంలో గ్రీన్ డేటా సెంటర్లు, రెన్యువబుల్ ఎనర్జీ, సిమెంట్, డిఫెన్స్, ఏరోస్పేస్, యూఏవీ టెక్నాలజీలో ఇప్పటికే పెట్టుబడులు పెడుతున్నాం. హైదరాబాద్‌లో తయారయ్యే యూవీలను సైన్యానికి అందిస్తాం. రాష్ట్రాన్ని అగ్ర పథాన నిలిపేందుకు అదానీ గ్రూప్ ప్రయత్నిస్తోంది” అని కరణ్ అదానీ తెలిపారు.
ఫ్యూచర్ సిటీలో వంతారా జూపార్క్ సీఎం సమక్షంలో ఎంవోయూ
తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌లో రిలయన్స్ సంస్థతో కీలక ఒప్పందం కుదిరింది. రిలయన్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ నిర్వహిస్తున్న వంతారా వన్యప్రాణుల సంస్థ ఫ్యూచర్ సిటీలో కొత్త జూ పార్క్ ఏర్పాటుకు ముందుకొచ్చింది. ఈ మేరకు ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి సమక్షంలో వంతారా బృందం ఎంవోయూ కుదుర్చుకుంది. వంతారా యాజమాన్యానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా సహాయ, సహకారాలు అందిస్తుందని ఈ సందర్భంగా సీఎం వారికి హామీ ఇచ్చారు. వన్య ప్రాణుల సేవ అనే నినా దంతో వంతారా గుజరాత్‌లో జూ పార్క్‌ను నిర్వ హిస్తోంది. ఇది దేశంలో అతి పెద్ద జూ పార్క్‌గా మన్ననలు అందుకుంటోంది.
పెట్టుబడులకు తెలంగాణ అనుకూలం ట్రంప్‌మీడియా టెక్నాలజీస్ డైరెక్టర్ ఎరిక్
రానున్న పదేండ్ల కాలంలో తెలంగాణలో రూ.లక్ష కోట్ల వరకు పెట్టుబడులు పెడతామని ట్రంప్ మీడియా టెక్నాలజీస్ సంస్థ డైరెక్టర్ ఎరిక్ ప్రకటించారు. కొత్తగా ఏర్పడిన రాష్ట్రమైనా పెట్టుబడులు పెట్టేందుకు కావాల్సిన అన్ని వసతులు ఉన్నాయని తెలిపారు. నీరు, భూమి, నైపుణ్యం కలిగిన మానవ వనరులు పుష్కలంగా ఉన్నాయని అన్నారు. ఇక్కడి ప్రభుత్వం పరిశ్రమలకు కావాల్సిన అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తుండటంతో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామిక వేత్తలు ముందుకొస్తున్నారని అభిప్రాయపడ్డారు.
తెలంగాణ విజన్ స్ఫూర్తిదాయకం : సీఐఐ మాజీ చైర్మెన్ దినేశ్
తెలంగాణ విజన్ స్పూర్తిదాయకంగా ఉందనీ, రాష్ట్రాభివృద్ధిలో భాగస్వాములయ్యేందుకు సిద్ధంగా ఉన్నామని సీఐఐ మాజీ చైర్మెన్ దినేశ్ అన్నారు. ఫ్యూచర్ సిటీ పేరుతో కొత్త నగరం ఆలోచన భినందనీ యమని పేర్కొన్నారు. తెలంగాణ ఇప్పటికే వేగంగా అభివృది చెందుతోందని గుర్తు చేశారు. దాన్ని మరింతంగా ముందుకు తీసుకు పోయేందుకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సంస్థలను ఒకే వేదికపైకి రప్పించడం గొప్ప విషయమని కొనియాడారు.
రూ.1700 కోట్లతో అపోలో విస్తరణ : – శోభన కామినేని
తెలంగాణలో రాబోయే మూడేండ్లలో రూ.1,700 కోట్లతో అపోలో గ్రూప్ వైద్య రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రణాళికలు రూపొందించిందని సంస్థ వైస్ చైర్మెన్ శోభనా కామినేని ప్రకటించారు. తెలంగాణలో ఫార్మా ఉత్పత్తి, అమ్మకాల్లో తమ సంస్థ 30 శాతం వాటా కలిగి ఉందని చెప్పారు. నిరంతరం పెట్టుబడులు పెడుతూ రాష్ట్రాభివృద్ధిలో తమ వంతు పాత్ర అపోలో పోషిస్తున్నదని చెప్పారు.
రూ.2.43 లక్షల కోట్ల ఒప్పందాలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



